Advertisement


Home > Politics - Gossip
తెలుగుదేశం ఆత్మ విశ్వాసం కోల్పోతోందా!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయం రోజురోజుకు దిగజారడం దురదృష్టకరం. ఒకప్పుడు ఏ విలువల కోసం తెలుగుదేశం పార్టీని ఆనాటి ప్రఖ్యాత నటుడు ఎన్‌టీ.రామారావు స్థాపించారో, వాటి విలువలను నేటి నాయకత్వం విప్పేస్తోంది. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ ఆత్మవిశ్వాసం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్‌టీఆర్‌ ప్రకటించారో, ఆ రెండిటిని వదలుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం సిగ్గుపడుతున్నట్లు కనిపించడంలేదు. లేకుంటే తాజాగా జరిగిన ఫిరాయింపు పర్వం చూడండి.

వాడు ఒక పెద్ద మోసగాడు... వాడు ద్రోహి.. అతను అసలు మనిషేకాదు.. ఇవి ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. కొద్దిరోజుల క్రితం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి గతంలో చేసిన వ్యాఖ్యలు.. కాని ఆశ్చర్యంగా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెకు సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. మంత్రిపదవి లేదా ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారని, ఇతరత్రా పనులు చేసుకోవచ్చని ఆమె స్వయంగా చెప్పిన విషయం బహిర్గతం అయింది.

ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరైనా ఇలా పార్టీ మారగలగుతారా? అంటే లేదనే చెప్పాలి.. అప్పట్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినప్పుడు ఏకంగా చంద్రబాబు తల తీయాలని వివాదాస్పద వ్యాఖ్యచేశారు. దాంతో ఆమెపై ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం రాజద్రోహం కేసుపెట్టింది. అంతేకాదు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉండే వారి గురించి చంద్రబాబు ఏమి విమర్శలు చేస్తారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

కాని ఆయనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా తన పార్టీలో చేర్చుకుంటారు. ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయం. విలువలులేని రాజకీయం. పదవే పరమావధిగా ఎంతకైనా దిగజారడానికి నలభైఏళ్ల రాజకీయ సీనియారిటీ కలిగిన చంద్రబాబు ఎందుకు సిద్ధపడుతున్నారో అర్థంకాదు.. అదేసమయంలో టీడీపీ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పుట్టిందని చెబుతారు. మరి ఇదేనా ఆత్మగౌరవం అంటే. అయితే ఇక్కడ ఒక వాస్తవం చెప్పుకోవాలి. అలనాటి ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆత్మగౌరవం నినాదం ఇచ్చారు. 

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య పట్ల రాజీవ్‌గాంధీ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్‌ పార్టీ తెలుగువారిని అవమానించిందన్న భావన ప్రబలిన రోజులు అవి. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ ఆత్మగౌరవం నినాదం ఇస్తే దానికి ప్రజలంతా ఆకర్షితులయ్యారు. కానీ అప్పటికే ఎన్‌టీఆర్‌కు అల్లుడైనా చంద్రబాబు ఆత్మగౌరవం నినాదాన్ని అంగీకరించలేదు. ఆయన కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండేవారు. పైగా కాంగ్రెస్‌పార్టీ ఆదేశిస్తే ఎన్‌టీఆర్‌ పైన అయినా పోటీకే సిద్ధమని సవాల్‌ చేసేవారు. ఆ తర్వాత ఆయన ఆ ఎన్నికలలో ఓడిపోయారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీని తదనంతర కాలంలో కబ్జా చేయగలిగారు.

అది వేరేసంగతి. అప్పట్లో ఎన్‌టీఆర్‌ నాయకత్వంలో తెలుగుదేశంపార్టీ ఫిరాయింపులను పూర్తిగా వ్యతిరేకించి ఎవరైనా రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేరాలని షరతుపెట్టింది. కాని ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఆత్మగౌరవం కాస్త ఆత్మల కొనుగోళ్లుగా మారిపోయిందనిపిస్తుంది. చంద్రబాబు తనను మోసగాడుగా దూషించిన వారిని సైతం తన పక్కన పెట్టుకోవడానికి ఆత్మగౌరవ భంగంగా ఫీల్‌ కావడంలేదు.

1978లో ఇందిరా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు విపక్ష జనతాపార్టీకి అరవైమంది, రెడ్డి కాంగ్రెస్‌కు 30మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో దాదాపు 80మంది ఇందిరా కాంగ్రెస్‌లో చేరిపోయారు. 1982లో ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు ఆయనతో ఒకరిద్దరే ఎమ్మెల్యేలు ఉండేవారు. కాని ప్రభంజనం సష్టించి 200సీట్లతో అధికారంలోకి వచ్చారు. 1994లో అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్‌టీ.రామారావు పక్క సీట్లోనే రఘుమారెడ్డి అనే టీడీపీ ఎమ్మెల్యే ఉప నేతగా ఉండేవారు. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయినా టీడీపీకి ఏమీకాలేదు. ఎన్‌టీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు.

ఇక చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కాని, పార్టీ నేతలు కాని ఆయనపై ఎన్ని వ్యాఖ్యలు చేసేవారో సీనియర్‌ పాత్రికేయులందరికి తెలుసు. నలభైమంది ఎమ్మెల్యేలు ఆయనను వదలి వెళ్లిపోయారు కూడా. అయినా పరిస్థితులు కలిసివచ్చి ఆయన మళ్లీ విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్ని చరిత్రలో జరిగిన ఘట్టాలే. వీటన్నిటిపై అవగాహన ఉన్న చంద్రబాబు ఎందుకు ఇలా కోట్లు వెచ్చించి విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారు? మంత్రిపదవులు, విప్‌ పదవులు విపక్షానికి చెందిన కొందరికి ఇచ్చి అప్రతిష్ట మూట కట్టుకుంటున్నారు?

సమాజానికి ఒక ఆదర్శం చూపవలసిన నేత ఎందుకు ఇంత అద్వాన్నంగా నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారు? వీటన్నిటికి ఒకటే కారణం కనిపిస్తుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో గెలవలేనన్న భయం పట్టుకుని ఉండాలి. వారితో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే అది ఆత్మగౌరవం అవుతుంది. ఆత్మ విశ్వాసంతో రాజీనామా చేయించామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకమాట చెప్పాలి. చంద్రబాబు కన్నా చిన్నవాడైన విపక్షనేత జగన్‌కు ఉన్న ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం చంద్రబాబులో  కొరవడిందన్నది ఒప్పుకోవాలి.

జగన్‌ ఎవరితోనైనా దైర్యంగా రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకున్నారు. అందుకు అభినందించాలి. ఈ పరిణామాలు చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఇక అత్మగౌరవాన్ని వదలుకుందని ఈ ఘటనలు రుజువు చేస్తాయి. అధికారం ఉన్నా ఆత్మగౌరవం కోల్పోవడానికి తెలుగుదేశం సిగ్గుపడడంలేదు. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం కోల్పోయినా, ఆత్మ విశ్వాసాన్ని వదలుకున్నా, ఆంధ్రులు మాత్రం ఆత్మగౌరవం వదలుకోరని, ఆత్మవిశ్వాసంతో ఇలాంటి చెత్త రాజకీయాలను నిరసిస్తారని ఆశిద్దాం.

-కొమ్మినేని శ్రీనివాసరావు