cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఈ గిల్లికజ్జాలు 'హోదా'ని పాతరేసేందుకేనా.?

ఈ గిల్లికజ్జాలు 'హోదా'ని పాతరేసేందుకేనా.?

జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరుగుతోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తుండడం ఆశ్చర్యం కలిగించకమానదు. అవినీతి జరిగితే అది నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. అదొక్కటే కాదు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపైన చంద్రబాబు దర్శకత్వంలో హత్యాయత్నం జరిగిందని సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రాజకీయ ఆరోపణలు చేసేస్తున్నారాయె. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తాం, కడిగేస్తామంటూ బీజేపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు గత కొద్ది కాలంగా. చంద్రబాబు అండ్‌ కో తక్కువేమీ తిన్లేదు. బీజేపీ మెడలు వంచుతామన్నారు.. నరేంద్రమోడీ 'పొగరు అణిచి' ప్రత్యేక హోదా సాధిస్తామని నినదించేశారు.

నిన్న విజయవాడలో బీజేపీ, టీడీపీ పాలనపై మండిపడుతూ ధర్నా నిర్వహించింది. కాస్సేపటి తర్వాత టీడీపీ నేతలూ, విజయవాడలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మీడియాలో గత కొద్ది రోజలుగా టీడీపీ - బీజేపీ నేతల మధ్య 'రచ్చ' ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదంతా నిజమేనా.? లేదంటే, టీడీపీ - బీజేపీ సంయుక్తంగా ఆడుతున్న పొలిటికల్‌ డ్రామానా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పోలవరం జాతీయ ప్రాజెక్టు.. అందులో అవినీతి అంటూ జరిగితే, కేంద్రం రంగంలోకి దిగి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆస్కారం వుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మీద హత్యాయత్నమే జరిగితే, దానికి కథ ఇంకోలా వుంటుంది. సీబీఐ విచారణో, ఇంకొకటో వేసేసి.. టీడీపీ నేతల మీద కేసులు బుక్‌ చేసేసి.. పెద్ద వ్యవహారమే నడిచి వుండాలి. కానీ, అవేవీ జరగలేదు. సాధారణ రాజకీయ వివాదంలానే పోలీసులు ఆ వ్యవహారాన్ని డీల్‌ చేస్తున్నారు.

ఈ సందట్లో ప్రత్యేక హోదా అంశం అటకెక్కిపోయింది. నవ నిర్మాణ దీక్షల కోసం చంద్రబాబు చేయాల్సిన పబ్లిసిటీ అంతా చేసేశారు. ఆ ప్రసహనమూ పూర్తయిపోయింది. అంతే, ఒక్కసారిగా అంతా కామప్‌ అయిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ని విశ్లేషిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అత్యంత వ్యూహాత్మకంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఇంకోసారి బీజేపీ, టీడీపీ డైల్యూట్‌ చేశాయని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు పాత్ర వుందంటూ బీజేపీ నేతలూ నానా యాగీ చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడమంటే ఆషామాషీ విషయం కాదు. 2014ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కలిసి పోటీ చేశాయి. నాలుగు యేన్ల కాపురం తర్వాత, రెండు పార్టీలూ విడిపోయాయి. రెండు మూడు నెలలుగా ఇరు పార్టీల మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వివాదాలు రాజుకున్నాయి. కానీ, ఇప్పుడది అంతా.. 'హంబక్‌' అని తేలిపోయేలా వుంది. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కేంద్రం బెదిరింపులకు చంద్రబాబే తలొగ్గుతారో.. దేశంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీనే దిగొస్తుందో.!