Advertisement


Home > Politics - Gossip
ఇంటింటికీ తెదేపా ఖర్చులు సర్కారువేనా?

తెలుగుదేశం పార్టీ వద్ద పార్టీ నిర్వహణ ఖర్చులకు కూడా డబ్బుల్లేవా? నామమాత్రపు కార్యక్రమాల ఖర్చులకు కూడా డబ్బుల్లేకుండానే.. 2019ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం గురించి.. వారు ఆశలు పెంచుకుంటున్నారా? తమ పార్టీ విస్తరణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు చాటుమాటుగా ప్రభుత్వ కార్యక్రమం అనే ముసుగు తగిలించి.. సదరు ఖర్చులను సాంతం.. ప్రభుత్వ ఖాతాలో రాసేయడానికి, ఆ రకంగా పార్టీ ఖజానా మీద భారం పడకుండా.. సర్కారు వారి సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం ఉబలాటపడుతున్నదా? ఏమో మరి తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. 

చంద్రబాబునాయుడు సోమవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన తెట్టంగిలో ప్రారంభిస్తే ఆయన కేబినెట్ సహచరులందరూ వేర్వేరు ప్రాంతాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రజల ఇళ్లకు కూడా తిరిగారు. బహిరంగ సభలు కూడా నిర్వహించారు. 
తెలుగుదేశం పట్ల ప్రజలు కృతజ్ఞులై ఉండాల్సిన ఆవశ్యకత గురించి, తెలుగుదేశానికి మాత్రమే ఓట్లు వేసి మళ్లీ మళ్లీ అధికారాన్ని కట్టబెడుతూ ఉండవలసిన ఆవశ్యకత గురించి వారు విపులంగా తెలియజెప్పారు. అయితే ఇదంతా పార్టీ వ్యవహారం. ఎమ్మెల్యేలు స్వయంగా.. ఇలాంటి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తే.. అచ్చంగా పార్టీ ఖాతాలోనే ఖర్చు పడుతుంది. 

కాకపోతే.. మంత్రులు పాల్గొనే కార్యక్రమాల్లో డ్వాక్రారుణాల పంపిణీ, ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలను ఇరికిస్తే గనుక.. సదరు సభ ఖర్చులు మొత్తం సర్కారు ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నిర్వహించే కార్యక్రమాల సాదరు ఖర్చులన్నీ సర్కారు వారి ఖజానాకు కోట్ల భారంగా పరిణమించే ప్రమాదం కనిపిస్తోంది.

అయినా తెలుగుదేశం పార్టీ తమ సొంత పార్టీ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉందా? తమ పార్టీ ఖర్చులను ఎలా తప్పించుకోవాలా? అని వెతుకులాడే స్థితిలో ఉందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇలాంటి అనుమానాలకు తావివ్వకుండా..  చంద్రబాబునాయుడు పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖతో, హుందాగా వ్యవహరిస్తే ఆయన ప్రభుత్వానికే మంచిదని జనం అనుకుంటున్నారు.