Advertisement


Home > Politics - Gossip
ఇదీ.. తెలుగుదేశానికి అసెంబ్లీపై ఉన్న గౌరవం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడం గురించి మాట్లాడమంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తారు. వైకాపా వాళ్లకు శాసనసభపై గౌరవం లేదని, ప్రజా సమస్యలు పట్టవు అని.. మొదలుపెట్టి.. తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పే నీతులకు హద్దంటూ ఏమీ ఉండవు. ఈ విషయంలో తెలుగుదేశం వాళ్లు ఎన్ని కబుర్లు అయినా చెబుతారు. అయ్యా.. ఫిరాయింపుదారు ఎమ్మెల్యేల మీద వేటు వేయడం లేదు అనే మేము శాసనసభకు హాజరు కావడం లేదు.. అని వైకాపా వాళ్లు అంటుంటే.. దానికి సమాధానం చెప్పడం మినహాయించి తెలుగుదేశం వాళ్లు చాలా కథలు చెబుతారు.

మరి అసలు కథలు వేరేలా ఉంటాయి కదా.. ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకుంటే ఈ క్షణమే మేము అసెంబ్లీకి వస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరసగా ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ఫిరాయింపుల మాటెత్తితే డొంక తిరుగుడుగా మాట్లాడటమే కానీ.. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటం తెలుగుదేశం పార్టీకి చేత కావడం లేదు. ఫిరాయింపులను అందంగా సమర్థించుకోవడమే గాక.. ఇంకా వీలైనంతమందిని లాగుదాం.. అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది కానీ.. ఫిరాయింపులకు ఆ పార్టీ సిగ్గుపడటం లేదు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీకి రావడమే.. ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం... అని చెబుతున్న తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ఫిరాయింపులతో పాతరేసినా తప్పులేదని చెబుతున్న తెలుగుదేశం పార్టీ.. అసెంబ్లీకి హాజరీ విషయంలో తమ ‘గౌరవం’ను నిరూపించుకుంటోంది. అదెలాగంటే.. టీడీపీ వైపున్న కనీసం సగం మంది ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదు అంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వైపున ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంతంటే.. వందమమంది చిల్లర ఎన్నికల్లో గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక ఐదు మంది.

వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 21. అంటే.. దాదాపు 125మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పుడు పచ్చ కండువాలతోనే ఉన్నారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీకి హాజరవుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంతంటే.. 74మంది! 74.. ఇదీ అసెంబ్లీ సమావేశాల ఆరంభం రోజున హాజరైన ఎమ్మెల్యేల సంఖ్య. సోమవారం కూడా ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. అంటే టీడీపీ వైపు ఉన్న సభ్యుల్లో సగానికి కాస్త ఎక్కువమంది మాత్రమే సభకు వస్తున్నారు. మిగతా వాళ్లది మాస్ బంక్! వీరి సంఖ్య 50వరకూ ఉంది.

ఇదీ వైసీపీ వైపు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కన్నా ఎక్కువే! వైసీపీ వాళ్లు అసెంబ్లీని బహిష్కరించాం అంటే.. నీతుల చిట్టాను విప్పుతుంది తెలుగుదేశం. అంతేనా.. అధికార పక్షం మేమే.. ప్రతిపక్షం మేమే.. అంటూ అన్ని పాత్రలూ మేమే పోషించేస్తాం.. అని నవరసననటనా పోషకులు అయిన తెలుగుదేశం నేతలు చెబుతారు. తీరా వాస్తవానికి వస్తే.. అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేల మాస్ బంక్ కొనసాగుతోంది. యాభై మంది చిల్లర ఎమ్మెల్యేలు సభ మొహం చూడటానికి కూడా రావడం లేదు. మరీ దీన్ని ఏమనాలి?