టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ త్వరలో టీడీపీ నుంచి వైసీపీలోకి మారనున్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల పరిణామాలు పొమ్మనకుండానే పార్టీ పెద్దలు పొగ పెడుతున్నట్టు సుగుణమ్మ అనుమానిస్తున్నారు.
తన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి, తనను విస్మరించడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. తనపై పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆమె అనుమానిస్తున్నారు. గౌరవం, నమ్మకం లేని చోట ఉండడం కంటే, ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో వున్నారు. మరోవైపు సుగుణమ్మ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను చంద్రగిరి ఇన్‌చార్జ్ పులివర్తి నానీకి ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన అన్వేషణ మొదలు పెట్టారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన, ఆర్థిక స్థితిమంతుల్ని ఎంపిక చేసే క్రమంలో పులివర్తి నాని పలువుర్ని సంప్రదించినట్టు తెలిసింది.
ఇందులో భాగంగా మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటముని శెట్టి కుమారుడు పురందర్, అలాగే బీజేపీ నాయకుడు ఆకుల సతీష్‌తో పులివర్తి నాని చర్చించారని విశ్వసనీయ సమాచారం. ఇద్దరూ బలిజ సామాజికవర్గ నేతలే. అయితే ఎన్నికల ఖర్చు కింద కనీసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టుకోవాలనే షరతు విధించడంతో పురందర్ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఇక ఆకుల సతీష్ విషయానికి వస్తే… ముందు బీ ఫారం టికెట్ ఇప్పిస్తే, డబ్బు సంగతి చూసుకుంటానని చెప్పినట్టు తెలిసింది.
బీజేపీలో ప్రస్తుతం ఆకుల సతీస్ యాక్టీవ్‌గా లేరు. గతంలో కన్నా లక్ష్మినారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయనతో అనుబంధం రీత్యా క్రియాశీలకంగా వ్యవహరించారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. మరోవైపు తిరుపతిలో ఆకుల కుటుంబీలకు బంధువులు, మిత్రులు బాగా వున్నారు. రాజకీయంగా ఆకుల కుటుంబానికి ఇవన్నీ లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జేబీ శ్రీనివాస్‌కు టికెట్ ఇప్పించేందుకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన అభ్యర్థిత్వంపై పులివర్తి నాని అధిష్టానానికి నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా తనను కాదని అధిష్టానం మరెవరి కోసమో వెతుక్కోవడంపై సుగుణమ్మ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఆమె రివర్స్ ఎటాక్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇటీవల ఆమె మనుమరాలు కీర్తి భర్త కిరణ్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తనయుడు అభినయ్‌తో చర్చించినట్టు తెలిసింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులని సమాచారం. రాజంపేట మాజీ దివంగత ఎంపీ గునిపాటి రామయ్య కుమారుడే కిరణ్. వైసీపీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని ఆఫర్ చేయడంతో జంప్ కావడానికి సుగుణమ్మ సీరియస్‌గా ఆలోచిస్తున్నారని తెలిసింది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ ఇవ్వాలని సుగుణమ్మ ప్రతిపాదన చేయడం, దానికి వైసీపీ పెద్దలు కూడా సరే అన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే తనకు తానుగా బయటకు వెళ్లకుండా, టీడీపీతో గెంటి వేయించుకుని, సానుభూతితో పార్టీ మారాలనే ఆలోచనలో సుగుణమ్మ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టు తెలిసింది. తిరుపతిలో రాజకీయ సమీకరణల మార్పు ఇక చంద్రబాబు చేతల్లోనే వుందని సన్నిహితుల వద్ద సుగుణమ్మ చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.