cloudfront

Advertisement


Home > Politics - Gossip

'తెగులు' పట్టించేస్తున్న టీడీపీ అధినేత

'తెగులు' పట్టించేస్తున్న టీడీపీ అధినేత

తెలుగుదేశం పార్టీకి టీడీపీ అధినేత ఎప్పుడో తెగులు పట్టించేశారు. లేకపోతే, కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడమేంటట.? చంద్రబాబు దగ్గర ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంటుంది. ఎందుకంటే, ఆయన 'నిప్పు' నారా చంద్రబాబునాయుడు కదా.! అవును మరి, అన్నిటికీ చంద్రబాబు దగ్గర వున్నది ఒకటే మాత్రం.. 'నేను ఏంచేసినా, తెలుగు ప్రజల కోసమే..' అని. ఆయన చెబుతున్నారు సరే, అది నిజమేనా.? అనడక్కూడదు. అదంతే.

ఒకప్పుడు, నరేంద్రమోడీని హైద్రాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేదే లేదని శపథం చేసిన చంద్రబాబు.. బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో ఇదే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. నరేంద్రమోడీని పక్కన కూర్చోబెట్టుకుని మరీ, తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. నరేంద్రమోడీని పొగిడేయడం, నరేంద్రమోడీతో పొగిడించేసుకోవడం.. ఇదీ చంద్రబాబు వరస.

నాలుగేళ్ళకే ముచ్చట తీరిపోయింది. నరేంద్రమోడీపై గత కొంతకాలంగా చంద్రబాబు ఏ స్థాయిలో విరుచుకుపడిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబుతో 'హనీమూన్‌' ముగించేసిన చంద్రబాబు, కాంగ్రెస్‌తో 'కొత్త కాపురానికి' తెరలేపారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు తెలంగాణకే పరిమితం. ముందు ముందు, ఆ పొత్తు ఆంధ్రప్రదేశ్‌కి కూడా విస్తరించబోతోంది. ఇంతకీ, తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నట్లు.? అంటే, దానికి చంద్రబాబు చెప్పే సమాధానం.. 'తెలుగు ప్రజల కోసం..' అని. వావ్‌, చంద్రబాబు నుంచి ఇంతకన్నా భిన్నమైన సమాధానాన్ని ఆశించగలమా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిందంటూ పదేళ్ళపాటు చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కాంగ్రెస్‌ పార్టీని. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేయమని, కాంగ్రెస్‌ పార్టీని పాతరేయమనీ చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో పిలుపునిచ్చారు.

ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించమని కోరుతున్న చంద్రబాబు, కాంగ్రెస్‌ గెలుపు 'చారిత్రక అవసరం' అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకి అన్నీ చారిత్రక అవసరాలే మరి.! స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఉద్దేశ్యమేంటి.? ఆయన్ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచాక, టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేంటి.?

తెలుగు ప్రజలంటే, తెలుగు రాష్ట్రాల్లోనివారే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో వుంటోన్న, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో వుంటోన్న తెలుగువారు కూడా.! ఆంధ్రప్రదేశ్‌లో ఏదన్నా రాజకీయ కార్యక్రమం చేపడితే, 'తెలుగు ప్రజల అభివృద్ధి కోసం..' అనడం చంద్రబాబుకి అలవాటే. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకీ అదేమాట చెబుతున్నారాయన.

చంద్రబాబు ఉద్దేశ్యం తెలుగు ప్రజలంటే.. తెలుగు తమ్ముళ్ళని తప్ప, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, బీజేపీతో టీడీపీ జతకట్టినా.. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టాలనుకుంటున్నా.. అవన్నీ టీడీపీకి 'చారిత్రక అవసరాలు' తప్ప, తెలుగు ప్రజలకి కానే కాదని ఎప్పుడో తేలిపోయింది. మొత్తమ్మీద, 'తెలుగు' అన్నమాటకే చంద్రబాబు తెగులు పట్టించేశారన్నమాట.