Advertisement


Home > Politics - Gossip
తెలంగాణ సింహాసనంపై మ్యూజికల్‌ ఛెయిర్స్‌

తెలంగాణ సింహాసనం చుట్టూ మ్యూజికల్‌ ఛెయిర్స్‌ ఆట నడుస్తోంది. గ్రామ్‌ఫోన్‌ రికార్డులో సంగీతం ప్లే అవుతోంది... ఎవరికి వారు దాని చుట్టూతా పరుగులు పెడుతూనే ఉన్నారు. సంగీతం ఆగే సమయానికి... కుర్చీకి దగ్గరలో ఎవరున్నారు? దగ్గర- దూరం అనే పదాలతో నిమిత్తం లేకుండా.. ఎగిరిగంతేసి అందులో కూర్చొన గలిగినవారు. చుట్టూ పరుగెడుతున్న వారేకాకుండా.. అమాంతం ఆకాశం నుంచి రాలి.. సరాసరి సింహాసనంపై పడగలిగిన వారు మరెవరైనా ఉన్నారా? ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి.

ఇవేమీ.. పనిలేక సాగుతున్న చర్చలుకాదు. గులాబీదళంలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న అంతర్గత చిరుమంటలకు ప్రతీకలే. కాకపోతే... ప్రస్తుతం గులాబీ దళపతి అధిష్టించిన సింహాసనానికి వారసత్వం విషయంలో వేరే ఆలోచన ఏముంది...? అంతా స్పష్టంగానే కనిపిస్తోంది కదా... అనేవారే ఎక్కువ. కానీ రాజకీయం అంటే... కనిపించేది మాత్రమేకాదు! కనిపించకుండా నడిచేవీ.. ఊహల్లో మెదలకుండా పరిణమించేవీ అనేకం ఉంటాయి. అలాంటి పరిస్థితుల మీదనే గ్రేట్‌ఆంధ్ర విశ్లేషణ!

'వారసత్వం' అనేపదం వినిపించినప్పుడు.. గులాబీదళంలోని అనేకానేక మంది గుస్సాకావొచ్చు. వారి ఆవేశం సహేతుకమైనది. ఎందుకంటే.. గులాబీ దళపతిగా.. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ సారథిగా అందరి గుర్తింపు ఉన్న, 'తెలంగాణ జాతిపిత'గా కొందరి కీర్తనలను అందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో వారసత్వం గురించి ఎందుకు చర్చ సాగిస్తారు. తల ఉందా? లేదా? అని వారు కోపగించవచ్చు.

ఇలాంటి వారసత్వ చర్చలు.. తమ అధినేతకు గుత్తపెత్తనానికి అవమానకరం అని వారు అనుకోవచ్చు. కానీ.. సాక్షాత్తూ వారి పార్టీలోనే సదరు సింహాసనం మీద కర్చీఫు వేసుకుని కాసుకున్న వారే.. అలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడు.. జనాంతికంగా ప్రజలు చర్చించుకోవడంలో వింత ఏముంది? అదే సుదీర్ఘకాలం నాటి చర్చ.. ఇప్పుడు మళ్లీ కీలకంగా జరుగుతోంది.

భాగ్యనగరం ఏకకాలంలో రెండు కీలక ఘట్టాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఒకటి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రూపంలో.. ఇవాంకకు పెద్దపీట వేసిన సదస్సు అయితే.. రెండోది మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాల్లో.. ముఖ్యమంత్రి స్థాయిలో కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్న తీరు.. చేసిన ప్రసంగం... ఆయన శైలి.. ఇవన్నీ.. ముఖ్యమంత్రిని తలపించాయి.

తెలంగాణ రాష్ట్రానికి ఆయన అప్రకటిత కిరటీధారి అనే సంకేతాలు ఇచ్చాయి. ఈ ఎరీనాలో.. ఆయనతో కలిసి మ్యూజికల్‌ ఛెయిర్స్‌ ఆడుతున్న మరో కీలక నాయకుడు హరీష్‌రావు.. సరిగ్గా ఆ సమయానికి ఢిల్లీ యాత్రలో ఉండడం కూడా గమనార్హం. ఆయన రాష్ట్రానికి ప్రాజెక్టులు సాధించుకు రావడానికి ఢిల్లీ వెళ్లారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట నిజమేకావొచ్చు. కానీ జనానికి మాత్రం మరో భిన్నాభిప్రాయం లేకుండా.. 'దాల్‌ మే కుచ్‌ కాలా హై' అని మాత్రమే అనిపిస్తున్నది.. ఇది నిజం!

ఈ ఆట ఇవాళ్టిది కాదు!

మ్యూజికల్‌ ఛెయిర్స్‌ ఆటలో పాట చాలాకాలంగా ఇంకా మోగుతూనే ఉంది. నిజానికి కేసీఆర్‌ సీఎం కుర్చీకి వారసత్వం గురించిన చర్చ ఇవాళ మొదలైనది కాదు. ఆయన గద్దెఎక్కిన నాటినుంచి ఉన్నదే. ఒకవైపు కుమారుడు.. హఠాత్తుగా ఉద్యమంలోకి ఉరికి.. కీలకంగా తెరపై ఎలివేట్‌ అయి, మంత్రి పదవిని కూడా దక్కించుకున్న కల్వకుంట్ల తారక రామారావు, మరోవైపు పార్టీ విస్తరణకు వ్యూహరచనకు మూలస్తంభంగా నిలుస్తూ అధినేతనుంచి బాధ్యతను పుచ్చుకున్నట్టే.. అధికారం కూడా తనది అని ఆశించిన అల్లుడు తన్నీరు హరీష్‌రావు ఇద్దరూ రెండు ధ్రువాలుగా నిలుస్తూ వచ్చారు.

రెండు ధ్రువాలు కాదు.. పార్టీకి వారు రెండు స్తంభాలు అనేవారు కూడా ఉంటారు. కావొచ్చు. కానీ.. అప్పటినుంచి వారి మధ్య వారసత్వం గురించిన నివురు గప్పిన నిప్పురవ్వ దాగిఉన్నదనడం సత్యం.

వారి మధ్య ఈ 'స్పర్ధ'ను కేసీఆర్‌ కొన్నాళ్లు పెంచి పోషించారు. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం కలిగిన వేర్వేరు బాధ్యతలు అప్పగించడం.. ఇద్దరికీ సమాన హోదాలు, కీలకమైన పదవులను అప్పగించడం.. ఇలా ఆయన కసరత్తు సాగింది. ఏ ఒక్కరూ ఎక్కువ- ఏ ఒక్కరూ తక్కువకాదు అని సంకేతాలు ఇవ్వడానికి కేసీఆర్‌ ప్రయత్నించారు. అలాంటి 'ఈక్వాలిటీ' ఎంతోకాలం సాగలేదు.

కాలంతో పాటూ.. కేసీఆర్‌ నిర్ణయాలు కూడా మారుతూవచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సీజను నుంచి ఆ విషయం స్పష్టంగా బయటపడడమూ ప్రారంభం అయింది. అప్పట్లో కేటీఆర్‌కు మంచి అవకాశం చేతికి అందివ్వడంతో పాటూ.. ఆయనను ఆకాశానికి ఎత్తేసిన తీరు చాలా వ్యూహాత్మకమైనది. ఒక్కదెబ్బతో.. నెంబర్‌ టూ రేసులో ఒకడిగా ఉన్న కేటీఆర్‌ 'నెంబర్‌ వన్‌ (ఏ)' అనిపించుకునే స్థాయికి వచ్చేశారు. కానీ అక్కడితో ఆట ముగిసిపోలేదు.

ప్రేమపూర్వకమైన ఆట...

మ్యూజికల్‌ ఛెయిర్స్‌ ఆడుతున్నది ఇద్దరేనా? అలా అని నిర్ధారించుకోవడానికీ వీల్లేదు. ఆటలో మరొకరు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె జాగతి సారథి కవిత. నిజానికి కేసీఆర్‌ తన కుమార్తెకు సంబంధించి.. ఇలాంటి పోటీ సంకేతాలు రాకుండా.. ఆమెకు క్లియర్‌ పాత్‌ సెట్‌చేసి ఇచ్చారు. కానీ.. ఆమె ఈ సింహాసనం కోసం సాగే మ్యూజికల్‌ ఛెయిర్స్‌ ఆటలో ఫ్రెండ్లీ పార్టిసిపేషన్‌ లాగా ఆడుతోంది అనుకోవాలి. ఒకరికి ముగ్గురు దాని చుట్టూ పరుగులు తీస్తున్నారు. పాట ఆగే సమయానికి ఎవరు కుర్చీకి దగ్గరగా ఉంటారు? కవిత ఉన్నా సరే.. ఆమె కుర్చీని కాపుగాసి.. తన సోదరుడి చేతిలో పెట్టేందుకే ఆడుతున్నదేమో అని కూడా అనేక సందేహాలు పార్టీలోనే ఉన్నాయి.

కవితది కూడా తండ్రిలాగానే కాస్త దూకుడైన మాటతీరు. ఆమె గతంలో తెగేసి చెప్పేశారు. కేసీఆర్‌ వారసత్వం కేటీఆర్‌కు తప్ప మరొకరికి ఎలా దక్కగలదని నిలదీశారు. తద్వారా ఆమె రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. తెరాస పార్టీలో అధినేతకు ప్రత్యామ్నాయంగా రెండు అధికార కేంద్రాలు ఉన్నాయనే భ్రమల్లో పార్టీ శ్రేణులు ఎవరైనా ఉంటే అలాంటి అవసరం లేదని ఆమె తేల్చేశారు.

సీన్‌ మరీ అంత బ్యాడ్‌గా ఉందా?

ఇందులో హరీష్‌ పరిస్థితి గురించి అనేక చర్చోపచర్చలు ఉన్నాయి. బయటి ప్రపంచానికి కేటీఆర్‌ మాత్రమే ఏకైక వారసుడిగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ.. హరీష్‌ పరిస్థితి పార్టీలో మరీ అంత బ్యాడ్‌గా ఉందా? అని అనుకోవచ్చు. అంతగా ఏమీకాదని పలువురు విశ్లేషిస్తున్నారు. బయటకు అంతగా ప్రచారం జరగకపోవచ్చు గానీ.. కేసీఆర్‌ వద్ద ఆయన ప్రాధాన్యం అలాగే ఉన్నదని కొందరు అంటూ ఉంటారు.

అయితే హరీష్‌ తన ప్రాధాన్యం గురించి 'ఎలివేట్‌' చేసుకోవడం గురించి పెద్దగా మోజున్న నాయకుడు కాదని అంటూ ఉంటారు. పార్టీ అంతర్గత ఆదేశాలు అందుకుంటూ ఉండే.. ఇతర మంత్రులు, ప్రభుత్వాధికార్లకు మాత్రం.. శక్తి కేంద్రాలు రెండు అనే సంగతి స్వానుభవంలో తెలిసినదేనని.. కాకపోతే.. ఈ రెండు శక్తికేంద్రాల మధ్య వైరుధ్యాలు రాకుండా పరిస్థితులు సాగిపోతుండడమే వారి బలం అని అనుకుంటూ ఉంటారు.

కీలకం ఎక్కడున్నదంటే..?

నాయకత్వ మార్పిడి తెరాసలో జరగడం అనేది అప్రస్తుత ప్రస్తావన. కానీ.. హరీష్‌రావులో నాయకత్వ సమీకరణాలపై అసంతప్తి ఉన్నదని వ్యాఖ్యానించే వారే ఎక్కువ. కేటీఆర్‌ హీరోగా కీర్తింపబడుతూ ఉండవచ్చు.. కానీ హరీష్‌రావుకు పార్టీ శ్రేణుల మీద పట్టు ఎక్కువ అని కొందరు అంటూ ఉంటారు. అధినేత నిర్ణయాలతో హరీష్‌ విభేేదించకుండా చూసుకోవడం.. పార్టీకి అవసరం అని.. ఆయనలో తేడావస్తే అది ప్రమాదకరం అని పలువురు అనుకుంటూ ఉంటారు.

కేటీఆర్‌ తన ప్రసంగాలు, ట్వీట్లు, ఇతరత్రా చురుకైన చర్యల ద్వారా మీడియా మేనేజిమెంట్‌ ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ.. హీరోయిక్‌గా ప్రొజెక్ట్‌ అవుతుండవచ్చు. కానీ.. పార్టీ మొత్తాన్ని చిటికెలో ఏకతాటిపైకి తేగల రీతిలో రాష్ట్రస్థాయిలో పార్టీ నెట్‌వర్క్‌ మీద పట్టున్న నాయకుడు హరీష్‌రావు మాత్రమే అనే వ్యాఖ్యానాలు కూడా కీలకంగా వినిపిస్తూ ఉంటాయి.

పాట ఆగేదెప్పుడు?

మ్యూజికల్‌ ఛెయిర్స్‌లో విజేత ఎవరో తేలాలంటే... ముందు పాట ఆగాలి. కానీ.. ప్రస్తుతం సాగుతున్నది ఆషామాషీ పాట కాదు. చాలా రసోద్దీపనతో సుదీర్ఘంగా సాగే పాట. ఇది ఆగాలని సింహాసనం కోసం సిగపట్లు, కుస్తీ పట్లు చూడాలని పార్టీలో ఎవ్వరూ కోరుకోవడంలేదు. ప్రజలు ఆశించడంలేదు.

కానీ ఇది రాజకీయ యవనిక. పాట ఆగకపోవచ్చు. కానీ గ్రామ్‌ఫోను మరమ్మత్తుకు గురవదనే గ్యారంటీలేదు. కరెంట్‌ బంద్‌ కాకూడదని నియమంలేదు. మరో రకమైన ఉపద్రవం ముంచుకు రాకూడదనే ఖరారులేదు. కనుక ఎలాంటి పరిణామాలు ఎప్పుడెదురైనా వాటిని స్వీకరించడమే.. తెలంగాణ పార్టీ గానీ, సమాజం గానీ చేయదగిన పని.

-ఎల్‌.విజయలక్ష్మి