Advertisement


Home > Politics - Gossip
తన వేలితో.. తన కంట్లోనే..

భూమానాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయ్యింది. నిజానికి 2014 ఎన్నికల్లో భూమానాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గనుక.. ఉప ఎన్నికలంటూ జరిగితే, ఆ సీటుని వైఎస్సార్సీపీకే వదిలెయ్యాలి. కానీ, భూమానాగిరెడ్డి మరణించేనాటికి టీడీపీలో వున్నారు గనుక.. తమకే ఆ సీటు దక్కుతుందన్నది టీడీపీ నేతల వాదన. 

అయినా, ఇప్పటికిప్పుడు నంద్యాల ఉపఎన్నిక గురించిన రచ్చ ఏంటట.? ఇది మరీ టూమచ్‌ కదూ.! అయినాసరే, టీడీపీ నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి కసరత్తు అప్పుడే షురూ చేసేసింది. భూమా కుటుంబం నుంచి ఎవరికన్నా సీటు ఇవ్వడం ఎంతవరకు పార్టీకి మేలు.? అన్న దిశగా చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. మరోపక్క, నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది చంద్రబాబే నిర్ణయిస్తారని చెబుతూనే, భూమా కుటుంబం నుంచి వచ్చే కొత్త వారసుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారనే సంకేతాలు పంపుతున్నారు ఆయన కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పార్టీ గురించి, ఎన్నికల గురించి, మంత్రిపదవి గురించీ ఆమె గలగలా మాట్లాడేస్తోంటే, చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్ట్ ని ఆమె ఎంత బాగా స్టడీ చేసేశారనే విషయం ఇట్టే అర్థమయిపోతోంది.

తండ్రి చనిపోయిన మూడో రోజునే, అఖిలప్రియ అసెంబ్లీకి వెళ్ళారు. అక్కడ సంతాప తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారమే ఆమె నడుచుకున్నారని స్పష్టమవుతోంది. ఆ వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. చంద్రబాబే అఖిలమ్మను అలా తీసుకొచ్చారనీ.. ఇది దారుణమనీ, భూమా అనుచరులే అసహనం వ్యక్తం చేశారు. అయితే, తాను అలా వెళ్ళడానికి కారణాల్ని వివరించేందుకు అఖిలప్రియ నానా తంటాలూ పడ్తున్నారనుకోండి.. అది వేరే విషయం. 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో, భూమా కుటుంబాన్ని చంద్రబాబు తనదైన రాజకీయ వ్యూహాలతో మేగ్జిమమ్‌ పలచన చేసేశారు కర్నూలు జిల్లాలో. చంద్రబాబు వ్యూహాలు ఇలాగే వుంటాయ్‌. చంద్రబాబు మాటల్ని నమ్మి, అఖిలప్రియ.. తన వేలితో, తన కంట్లోనే పొడుచుకుంటున్నారని భూమా అనుచరులు వాపోతున్నారిప్పుడు.