cloudfront

Advertisement


Home > Politics - Gossip

దటీజ్‌ కేసీఆర్‌.. ఆ ప్లానింగ్‌ దేవరహస్యం.!

దటీజ్‌ కేసీఆర్‌.. ఆ ప్లానింగ్‌ దేవరహస్యం.!

రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్‌ తర్వాతే ఎవరైనా.. అంటూ ప్రత్యర్థులు సైతం ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తుంటారు. అదీ గులాబీ బాస్‌ ప్రత్యేకత. తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది.. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకి ఆ విషయం హుటాహుటిన వెళ్ళిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా అలర్ట్‌ అయ్యింది. 'వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాల్సి వుంది..' అనేమాట కేంద్ర ఎన్నికల సంఘం నుంచి చూచాయిగా బయటకు వచ్చేసింది కూడా.

కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాల్సిన విషయాల్ని కేసీఆర్‌ చెప్పడమేంటంటూ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై ఈ మేరకు ఒత్తిడి కూడా పెరుగుతోంది. అయితే 2002 సుప్రీంకోర్టు రూల్‌ ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరునెలల వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదనీ, ప్రయార్టీగా తీసుకుని ఎన్నికలు జరపాల్సి వుంటుందని సాక్షాత్తూ సీఈసీ రావత్‌ అభిప్రాయపడ్డారంటే, కేసీఆర్‌ స్కెచ్‌ ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

సీఈసీ వ్యాఖ్యల్ని బట్టి చూస్తోంటే, వీలైనంత త్వరగా.. అంటే, కేసీఆర్‌ చెప్పినట్లే.. అదీ నవంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్నమాట. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుండగా.. అవీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ముందుగా జరిగే అవకాశాలైతే సుస్పష్టం.

అన్నట్టు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ ఇలాంటి 'వేగం' కేసీఆర్‌లో స్పష్టంగా కన్పించింది. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ చక్రం తిప్పేశారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనంపై సంకేతాలిచ్చేశారు. పనులన్నీ చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్‌ పెద్దలకు కేసీఆర్‌ వంగి వంగి దండాలు పెట్టేశారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలకు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) ఢిల్లీలో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. ఢిల్లీలో వ్యవహారం చక్కబెట్టుకొచ్చేశారు.. ఇక్కడ తెలంగాణలో చెయ్యాల్సింది చేసేశారు. చివరికి ఏం జరిగిందో చూశాం.

ఇప్పుడూ అదే స్థాయిలో కేసీఆర్‌ స్కెచ్‌ వేసేశారు. ఢిల్లీ వెళ్ళారు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీతో చర్చలు జరపడం, ఆ చర్చల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు అంశం కూడా వుండడం ఓపెన్‌ సీక్రెట్‌. ఢిల్లీలో కేసీఆర్‌ ఏం చేశారన్న దానిపై తెలంగాణ బీజేపీ నేతలకు క్లారిటీలేదు. ఆయన అలా వెళ్ళొచ్చారు.. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు.

'అంతా కేసీఆర్‌ అనుకున్నట్టేమీ జరగదు..' అని విపక్షాలు పెదవి విరుస్తున్నాయిగానీ.. కేసీఆర్‌ ఎలా అయితే స్కెచ్‌ ప్రిపేర్‌ చేశారో, అన్నీ అలాగే జరుగుతున్నాయి. 'విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ పెద్దలతో స్వయంగా మాట్లాడాను.. నేను చెప్పినట్టే అన్నీ జరిగాయి..' అని కేసీఆర్‌ అప్పట్లో చెప్పినా, దాన్ని ఎవరూ నమ్మలేదు. కాంగ్రెస్‌ నేతలైతే ఎగతాళి చేశారు. అంతెందుకు విభజన చట్టంలో ప్రతి అక్షరం తన కనుసన్నల్లోనే జరిగిందని ఓ దశలో కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ చెప్పుకున్న విషయాన్ని ఎలా కాదనగలం.?

కేసీఆర్‌ చెప్పినట్లు అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ఎలా ఆడింది.? ఇప్పటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎలా ఆడుతోంది.? అన్నది ఎవరికీ అర్థంకాని విషయం. అది ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం.