Advertisement


Home > Politics - Gossip
జగన్‌ను తిట్టకుండా వారికి ముద్ద దిగదంతే...!

‘ఒక మంత్రిగారు కాపుల పాదయాత్ర గురించి మాట్లాడతారు... ఆ ప్రెస్ మీట్ ముగిసేలోగా జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్ధాలు చెబుతారు. ప్రజలను మోసం చేస్తుంటారు’ అని ముగిస్తారు!

‘మరో మంత్రిగారు.. వ్యవసాయంలో కొత్తగా తాము ఉద్ధరిస్తున్న పథకాల గురించి వెల్లడిస్తారు. మధ్యలో ఆ టాపిక్ వదిలేసి.. వైఎస్ జగన్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. ఆయన పగటి కలలు కంటున్నారు అంటూ ఆ పల్లవి అందుకుంటాడు.’

‘మరొక అమాత్యశ్రేష్టుడు నీటిపథకాలు, పోలవరం తామెలా పగుళ్ల నిర్మాణాలను అపురూపంగా సాగిస్తున్నదీ నివేదిస్తూ ఉంటారు. హఠాత్తుగా టాపిక్ డైవర్ట్ అయిపోయి.. వైఎస్ జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.. ఆయనకు భవిష్యత్తు లేదు.. అంటూ ఆవేశంతో ఊగిపోతాడు’ ... ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన దాదాపుగా ప్రతి ఒక్క మంత్రీ.. తాము పబ్లిక్ లో మాట్లాడుతున్న సందర్భం ఏదైనా సరే, కార్యక్రమం ఎలాంటిదైనా సరే.. తమ ప్రసంగం మధ్యలోకి ఏదో ఒక తీరుగా వైఎస్ జగన్ ను లాక్కుని వచ్చి.. ఆయన మీద పదేపదే నిందలు వేయడం ఇటీవలి కాలంలో చాలా తరచుగా కనిపిస్తోంది.

ఏదో ఒకరిద్దరు మంత్రులకు ఇలా అన్యాపదేశంగా జగన్  మీద తిట్లు లంకించుకోవడం యాదృచ్ఛికంగా జరుగుతున్నదని అనుకోవచ్చు. కానీ.. కేబినెట్లోని దాదాపు అందరూ ముఖ్యమంత్రి సహా.. ప్రతి ప్రెస్ మీట్ లోనూ జగన్ మీద నిందలను కూడా కలగలిపి మాత్రమే ప్రసంగాలు సాగిస్తున్నప్పుడు దాన్నేం అనుకోవాలి. ఖచ్చితంగా ఇదంతా ఒక వ్యూహం ప్రకారం బురదపులిమే ప్రయత్నాలు అనుకోవాలి.

గోబెల్స్ ప్రచారవ్యూహాల్లో చంద్రబాబునాయుడును మించిన వారు సమకాలీన రాజకీయాల్లో మరొకరు ఉండకపోవచ్చు. తిమ్మిని బమ్మిని చేయడంలో, తాను ఏం చెబితే దానిని ప్రజలందరూ నమ్మేలా చేయడంలో ఆయన ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఆవిష్కరిస్తుంటారు.

ఇప్పుడు జగన్ మీద నిందలు వేయడం కూడా అలాంటి ఒక వ్యూహం లాగా కనిపిస్తోంది. ‘పదుగురాడు మాట పాడియై ధరజెల్లు’ అని సామెత. పదిమందీ పదేపదే అంటూ ఉంటే ఒక అబద్ధాన్ని నిజం చేసేయగలరు... అని దీని అర్థం. ఆ సామెతకు అనుగుణంగా తన కేబినెట్లోని మంత్రులందరినీ ప్రత్యేకంగా పురమాయించి మరీ.. ఇలా నిందలు వేయిస్తున్నారేమో అనిపిస్తోంది.

జగన్ జైలుకు వెళ్తాడు, జగన్ అబద్ధాలు చెబుతాడు, జగన్ పగటి కలలు కంటున్నాడు.. ఇలా తన వందిమాగధులతో పదేపదే అనిపించినంత మాత్రాన... తాను ఆశిస్తున్న ప్రయోజనం చంద్రబాబుకు దక్కుతుందా లేదా అనేది సందేహమే! ఎందుకంటే.. రాజకీయ నాయకుల మాట విషయంలో ప్రజలు ఇప్పుడు మరీ తెలివి మీరిపోయారు. 

వారి మాటల్ని నమ్మాలో లేదో ఆచితూచి మాత్రమే నిర్ణయించుకుంటున్నారు. అలాంటప్పుడు.. కేవలం కేబినెట్ మంత్రులే కాదు కదా.. తమ పార్టీకి చెందిన గల్లీ లీడర్లతో సహా.. జగన్ మీద పదేపదే నిందలు వేసినప్పటికీ.. దానివల్ల వారి క్రెడిబిలిటీకి భంగం కలుగుతుందే తప్ప.. జగన్ కు పెద్ద నష్టం ఉండకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.