Advertisement


Home > Politics - Gossip
నా మాట చెల్లలేదు : ఒప్పుకున్న చంద్రబాబు

ఒకటే రకమైన హామీతో కొన్ని సంవత్సరాల నుంచి ఊరించారు.. ఆశ పెట్టారు.. తీరా అది నెరవేరలేదు. ఇదేంటి సార్ అని అడగబోతే.. ‘నా మాట చెల్లలేదు.. నేనేం చేయను’ అంటూ సింపుల్ గా తప్పించేసుకున్నారు. ఇదీ చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న శైలి. మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ గిరీ విషయంలో మోడీ సర్కార్ మొండిచేయి చూపించడం.. భవిష్యత్తులో మిగిలిన గవర్నర్ ఖాళీలను భర్తీ చేసే సమయంలోనైనా ఇస్తారో లేదో క్లారిటీలేని నేపథ్యంలో.. ఆదివారం నాడు తన హైదరాబాదు నివాసంలో టీటీడీపీ నాయకులతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో మోత్కుపల్లి తన ఆవేదన వెలిబుచ్చారు.

అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. ఆయనకు ఎన్నాళ్లుగానో ఎదురుచూసి భంగపడిన ఆయనకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా.. తాను చెప్పినా స్పందించలేదని చంద్రబాబు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మోడీ కలిగించిన భంగపాటు కంటె, చంద్రబాబునాయుడు స్పందించిన తీరు మోత్కుపల్లికి ఇంకా బాధ కలిగించిందని పలువురు పేర్కొంటున్నారు. 

ఎందుకంటే- ఇటీవల కేంద్రం అయిదుగురు గవర్నర్లను కొత్తగా నియమించింది. వారిలో పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటూ పార్టీకి సేవలు చేసిన వారికి మాత్రమే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే తెలుగుదేశం తరఫున గవర్నర్ గిరీకి ఆబ్లిగేషన్ తో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోత్కుపల్లికి అవకాశం దక్కలేదు.

ఆయన అప్పుడే చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినా.. తర్వాత మాట్లాడదాం అంటూ దాటవేసినట్లు సమాచారం. చంద్రబాబుతో ఈ విషయం నేరులో చర్చించే అవకాశమే ఆయనకు ఇన్నాళ్లకు వచ్చింది. తీరా ముఖత: అడిగేసరికి.. ‘నా మాట చెల్లలేదు.. ఏం చేయగలను’ అని సింపుల్ గా ముగించేయడం తెలంగాణ పార్టీ నేతకు అశనిపాతంగా మారింది.

చంద్రబాబునాయుడుకు మోడీ సర్కారు వద్ద ఏ మాత్రం ప్రాధాన్యం దక్కుతోంది అనే విషయంలో సొంత పార్టీలోనే రకరకాల సందేహాలు కమ్ముకుంటున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఇవే సందేహాలు పెరుగుతున్నాయి. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామి పార్టీ గనుక.. ఆయన ఇబ్బడి ముబ్బడిగా నిధులు రాబట్టేసి.. రాజధానిని ఇతర  పనులను చకచకా పూర్తిచేసేస్తారని ప్రజలంతా అనుకున్నారు. ఆయనకు రాష్ట్రంలో అధికారం దక్కడం వెనుక.. మోడీ కూటమిలో భాగస్వామి కావడం కూడా ఒక కీలకాంశం అని మరచిపోలేం. అయినా సరే.. ప్రాక్టికల్ పరిస్థితులు వచ్చేసరికి చంద్రబాబు, కేంద్రంనుంచి రాబడుతున్నది శూన్యంగా కనిపిస్తోంది. 

ఎక్కడి శంకుస్థాపనలు అక్కడ పడి ఉన్నాయే తప్ప... పనులు మాత్రం జరగడంలేదు. ఏవీ రెండో దశ పనుల్లోకి ప్రవేశించలేదు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలం కావడం మాత్రమే కాదు, తమ నేత పార్టీ వారికి కేంద్రం నుంచి పదవులు రాబట్టడంలో కూడా దారుణంగా విఫలం అవుతున్నారంటూ.. పార్టీ వర్గాలే తమలో తాము చర్చించుకుంటున్నారు.