Advertisement


Home > Politics - Gossip
ఇది పాలనను నిగ్గుతేల్చే రెఫరెండం!

70స్థానాలున్న అసెంబ్లీలో 67స్థానాలను గెలుచుకోవడం అంటే.. సాధారణ విజయం కాదు. సామాన్యుడి పార్టీగా ప్రజల ముందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) కు ఢిల్లీ ప్రజలు అలాంటి అపురూపమైన విజయాన్ని కట్టబెట్టారు. కానీ.. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల ఆశలను తీర్చగలిగిందా? వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నదా? ఇలాంటి విషయాల్లో మీడియా చేసే అనుకూల, ప్రతికూల ప్రచారాలు తప్ప.. వాస్తవాలు మనకు తెలియవు.

కానీ.. ఇప్పుడు అచ్చమైన రెఫరెండం లాంటి ఉప ఎన్నికలు అక్కడ రాబోతున్నాయి. ఏకంగా 20మంది ఆప్ ఎమ్మెల్యేలను ‘లాభదాయక పదవులు’ నిర్వహించినందుకుగాను అనర్హులుగా పేర్కొంటూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చేయడంతో.. ఈ 20స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇది ఖచ్చితంగా రెఫరెండం లాంటి ఎన్నికే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

తమ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినందుకు కేంద్రలోని భాజపా ప్రభుత్వాన్ని తూర్పార పడుతూ.. ఆప్ నాయకులు విరుచుకుపడుతున్నారు. తీవ్ర మైన నిందలు వేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సహా, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారు.. అని ఒకే గాటన కట్టేస్తూ... ఏకంగా రాష్ట్రపతికి కూడా అంటేలాగా.. పరోక్షంగా.. నిందలు వేస్తున్నారు.

తమను నియమించిన వారికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ వాస్తవాల్ని పరిశీలిస్తే ఇలాంటి విమర్శలు ఆప్ రాజకీయ పార్టీకి ఏదో.. రాజకీయంగా ప్రజలను ఆకర్షించడానికి ఉపయోగపడవచ్చు తప్ప.. ఇతరత్రా లాభదాయకం కాజాలవు.

ఇక్కడ మరో సంగతి గుర్తించాలి. న్యాయస్థానం మీదనే తమ అన్ని ఆశలు ఉన్నాయని ఆప్ ప్రకటిస్తోది. కానీ నిజానికి సుప్రీం తీర్పు ఆధారంగానే.. ‘లాభదాయక పదవులు’ అంటే ఏమిటో సుప్రీం ఇచ్చిన నిర్వచనం ఆధారంగానే... ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఆప్ కూడా ఇలాంటి సాంప్రదాయ పార్టీల రాజకీయపు ఎత్తుగడలు మానేసి.. ఉప ఎన్నికలకు సిద్ధపడితే బాగుంటుంది.

అయితే ఇన్నాళ్లలో కొత్త తరహాలో కేజ్రీవాల్ సాగించిన పరిపాలన ప్రజలకు నిజంగా ఎలాంటి అభిప్రాయం కలిగించింది? అనే సంగతి ఈ ఉప ఎన్నికల్లో తేలుతాయి. ఎందుకంటే... 70స్థానాల అసెంబ్లీలో 21స్థానాలకు (ఒక రాజీనామా మరియు 20అనర్హత వేటు కలిపి) ఉప ఎన్నికలు జరగడం చిన్న సంగతి కాదు. మరి, దేనికైనా తాము సిద్ధమే అంటున్న ఆప్ తమ పరిపాలన ప్రజారంజకమైనదే అని ఎలా నిరూపించుకుంటుందో చూడాలి.