cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇది షూటింగ్‌ కాదు పవనా..

ఇది షూటింగ్‌ కాదు పవనా..

పవన కళ్యాణ్‌ రిసార్ట్‌ దీక్షను చూస్తుంటే ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది. చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీ టైమింగ్స్‌పై సభా నిర్వహణ కమిటీ సమావేశం నడుస్తోందిట. తెలుగుదేశం నేతలు సభ ఉదయం నుంచి రాత్రి దాకా సాగాలని పట్టుపడుతుంటే.. కాంగ్రెస్‌ పక్షం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలని వాదిస్తున్నారుట.

ఈ వ్యవహారం ఇలా సాగుతుంటే- చిరంజీవి హఠాత్తుగా లేచి- మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు దాకా బ్రేక్‌ ఇద్దాం. ఆ తర్వాత మళ్లీ పెట్టుకుందాం అన్నారట. ఈ ప్రతిపాదన వెనకున్న మర్మమేమిటో ఎవరికీ అర్థం కాలేదట. అప్పుడు చిరంజీవి చిరునవ్వుతో- ‘ఇంటికి వెళ్లి లంచ్ చేసి.. ఒక బ్యూటీ స్లీప్‌ తీసి రావటానికి మూడు గంటలు చాలుగా..’ అన్నారట.

సినిమా నటులు రాజకీయ వేడిని తట్టుకోలేరనటానికి ఇదొక ఉదాహరణ. ఈ సంఘటన నిజంగా జరిగిందా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్‌ మినహా మిగిలిన సినిమా నటులెవ్వరూ రాజకీయ వేడిని తట్టుకోలేరని పవన దీక్ష చెప్పకనే చెబుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు కావాలనుకొనేవారందరూ కొన్ని రకాల అగ్నిపరీక్షలకు సిద్ధపడాలి.

వీటిలో మొదటిది శారీరక శ్రమ. అవసరమైనప్పుడు.. సమయం కాని సమయంలో కూడా ఎలాంటి పరిస్థ్థితుల్లోనైనా ఎంత మారుమూలకైనా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్త్తే సౌకర్యాలు ఎంతో మెరుగుపడినా-ఎండ, వానలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్భాటంగా తన పాద యాత్రను ప్రారంభించిన పవన్ జనాల మధ్యే దీక్ష కూడా చే స్త బావుండేది.

ఉద్దానంలో మత్స్యకారుల ఇంట్లో దీక్ష చేస్తే పోయేదేముంటుంది? ఎన్టీఆర్‌ చైతన్యరథం మీద యాత్ర చేస్తున్నప్పుడు రోడ్ల మీద స్నానం చేసిన ఫొటోలు ఎంత సంచలనం సృష్టించాయో పవన్ కు, ఆయన వ్యూహకర్తలకు తెలియదా? ప్రజల దగ్గరకు తాను వెళ్తునానని కాకుండా ప్రజలే తనను చూడటానికి వస్తున్నారనే బాడీ లాంగ్వేజ్‌.. విలాసంగా రిసార్ట్‌లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్న ఫొటోలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేవే! పవన కళ్యాణ్‌కి ఒక మేధావి ఇమేజ్‌ లేదని.. మాస్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉందనే విషయాన్ని ఆయన వ్యూహకర్తలు గుర్తించాలి.

వాస్తవానికి ఇప్పుడు ఆయనకు మేధావి ఇమేజ్‌ అనవసరం కూడా! ఇక వర్తమానం నుంచి పవన్ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నాడో చూద్దాం. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో-అక్కడి జేడీఎస్‌ను జనసేనతో పోల్చవచ్చు. (ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ.. ఆంధ్రలో త్రిముఖ పోటీనే ఉంటుంది). జేడీఎస్‌కు దాదాపు 112స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. కానీ వారికి బలమైన స్థానాల్లో విపరీతమైన మెజారిటీ వచ్చింది. అంటే తాము బలంగా ఉన్న 50-60 స్థానాలపైనే వారు దృష్ట్టి పెట్టారు. వాటిలో దాదాపు 40స్థానాలు గెలిచారు.

కుమారస్వామి తాను ఎప్పుడూ కింగ్‌ కావాలనుకోలేదు. కింగ్‌ మేకర్‌ కావాలనుకున్నాడు. అదృష్టం కొద్ది కింగ్‌ కూడా అయ్యాడు. మొదటి నుంచి జేడీఎస్‌ వ్యూహమిదే! పవన కళ్యాణ్‌ ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా ఇదే వ్యూహం అనుసరించటం మంచిది. కాపుల ప్రాబల్యం ఉన్న సీట్లను ఎంపిక చేసుకొని వాటిలో బలమైన అభ్యర్థులను పోటీకి పెడితే కొన్ని సీట్లు వస్తాయి. (పవన్ కేవలం కాపు నేతేనా? ఆయనకు మద్దతుదారులందరూ వారేనా? అనేది మరో చర్చ. కానీ ప్రస్తుతం ఆయనను నడిపించేది.. చుట్టు కాపు కాస్తున్నది కాపులే). అప్పుడు వారు 2019ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించగలుగుతారు.

ఉదాహరణకు ఉద్ధానం సమస్యనే తీసుకుందాం. అక్కడికి వచ్చి సమస్యను అధ్యయనం చేసిన ఫారెన్ డాక్టర్లందరూ ఏమయ్యారు? వాళ్లు ఇచ్చిన నివేదికలేమిటి? వాటిపై జనసేన కార్యాచరణేమిటి? వీటికి సమాధానాలు లేవు. మళ్లీ ఉద్ధానానికే వెళ్లి మీటింగ్‌లు పెట్టి ప్రయోజనమేమిటి? ఒక చోటకు వెళ్లటం.. అక్కడ ఉన్నవారిని.. లేదా పరిస్థితులను విమర్శించటం.. మళ్లీ మరో చోటకు వెళ్లిపోవటం-ఈ తరహాలో రాజకీయాలు నడవవు. కట్‌ చెప్పగానే ఎండ వేడి నుంచి తప్పించుకొని వెళ్లిపోవటానికి వేనిటీ వ్యానులుండవు. ప్రామ్ట్‌లు చెప్పటానికి అసిస్ట్టెంట్‌లు ఉండరు. ప్రతి సమస్యకు ఏదో ఒక నిర్ణయం లేదా ఆ దిశగా తీసుకొనే చర్యలను పార్టీలు లేదా నేతలు మాట్లాడాల్సి ఉంటుంది.

ఇంకా పురుడుకూడా పూర్తిగా పోసుకోని పార్టీ ప్రజల విశ్వసనీయతను పొందటానికి ఇలాంటి విన్యాసాలెన్నో చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫలితాలను కూడా రాబట్టాల్సి ఉంటుంది. ఇవేమి లేకుండా ప్రజల విశ్వసనీయత పొందాలనుకోవటం అవివేకమే! ప్రజారాజ్యం విఫలయత్నం తర్వాత కింగ్‌మేకర్స్‌ కావటానికి కాపులకు పవన్ కళ్యాణ్‌ రూపంలో ఒక మంచి అవకాశమొచ్చింది. తన మీద ఉన్న బాధ్యతను పవన్ ఎలా నిలబెట్టుకుంటాడో.. రాజకీయాలంటే షూటింగ్‌లు కావని ఎప్పటికి తెలుసుకుంటాడో కాలమే నిర్ణయించాలి.

-భావన 
(fbackfm@gmail.com)