Advertisement


Home > Politics - Gossip
టిక్కెట్‌... టిక్కెట్‌..!

టిక్కెట్‌.. టిక్కెట్‌ అంటే బస్సులో కండక్టర్‌ ప్రయాణికులను టిక్కెట్‌ తీసుకోవాలని చెప్పడం కాదు. ఇది రాజకీయ టిక్కెట్ల వ్యవహారం. అన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులకూ టెన్షన్‌గానే ఉంది. సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో టిక్కెట్‌ వస్తుందా? రాదా? ఎన్నికల్లో పోటీ చేయగలమా? లేదా? అనే ఆత్రుత, ఆందోళన పెరుగుతున్నాయి. ఉన్న పార్టీలో టిక్కెట్టు ఇవ్వకపోతే ఏ పార్టీలోకి దూకాలో ఆలోచిస్తున్నారు.

టిక్కెట్‌ ఇస్తామని గట్టిగా హామీ ఇస్తేనే పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు పార్టీకి ఇతర పార్టీల నుంచి ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నుంచి నేతలను లాక్కోవడం ఇబ్బందిగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి పార్టీ అధికార పార్టీకి తానే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నా కాంగ్రెసుకు ఉన్నంత సీన్‌ బీజేపీకి, ఇతర పార్టీలకు లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెసు బలంగా ఉందనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా పార్టీ సమావేశాల్లో వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నవారు కాంగ్రెసు వైపే చూస్తున్నారు. కాని టిక్కెట్‌ ఇస్తామని కచ్చితంగా హామీ ఇస్తేనే చేరతామని చెబుతన్నారు. టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నుంచి కాంగ్రెసులో చేరడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారని, తమతో టచ్‌లో ఉంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పుకుంటున్నారు. కాని చేరడానికి ఉత్సాహపడుతున్నవారు ముందుగా టిక్కెట్‌ కోసం హామీ ఇవ్వాలనే కండిషన్‌ పెడుతున్నారు.

కొందరు తమ కోసం మాత్రమే కాకుండా, వారసులకు, బంధువులకూ ఇవ్వాలని అడుగుతున్నారు. 'ముందు పార్టీలో చేరండి. తరువాత చూద్దాం' అంటే అంగీకరించడంలేదు. పార్టీలో చేరాలనుకున్నవారు బేషరతుగా చేరాలని రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా చెబుతుండటంతో టిక్కెట్‌ ఇవ్వనప్పుడు చేరడమెందుకని గమ్మున ఉంటున్నారు.

టీడీపీ, కాంగ్రెసు నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవులు, ఇతర పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు నిరాశతో వేరే మార్గాల కోసం చూస్తున్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరుగుతాయో లేదో తెలియదు. ఈ విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. సీట్లు పెరుగుతాయనే ఆశతోనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఫిరాయింపులను ప్రోత్సహించారు.

పెరిగితే ఫిరాయింపుదారుల్లో చాలామందికి టిక్కెట్లు ఇస్తారు. లేదంటే ఉన్న సీట్లలో సర్దుబాటు చేయలేక ఇబ్బందులు పడాల్సిందే. సీట్లు పెరగకూడదని బీజేపీ, కాంగ్రెసు కోరుకుంటున్నాయి. కాంగ్రెసులో తుది నిర్ణయాలు చేసేది ఢిల్లీలోని కాంగ్రెసు హైకమాండ్‌. పీసీసీ అధ్యక్షుడు ఫలానవారికి టిక్కెట్లు ఇవ్వాలని సిఫార్సు చేసినా అధిష్టానం ఆమోదముద్ర పడకపోవచ్చు. అందుకే కాంగ్రెసులో చేరాలని ఆసక్తి ఉన్న నాయకులు జంకుతున్నారు.

గత మూడున్నరేళ్లలో కాంగ్రెసులో చేరిన చెప్పుకోదగ్గ నాయకుడు రేవంత్‌ రెడ్డి ఒక్కడే కనబడుతున్నాడు. అతనికెంత ప్రాధాన్యం ఇస్తారో ఇప్పటివరకు తేలలేదు. హస్తం పార్టీకి పీతల సీసా అనే పేరుంది. సీసాలోని పీతల్లో ఏదైనా ఒకటి పైకి వెళుతుంటే మరోటి దాన్ని కిందికి గుంజుతుంది. కాంగ్రెసులో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయం. ఒకరిని అణగదొక్కి మరొకరు పైకి రావాలనుకుంటారు. పార్టీలో చేరాలనుకునేవారికి ఈ భయం కూడా ఉంది. ఇక ఈ పార్టీలో చేరడానికి అంగీకారం తెలియచేసిన కొందరు నాయకులు వెయిటింగ్‌లో ఉన్నారు. అధిష్టానం ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. చేరతామని వచ్చిన వారందరిని చేర్చుకోవద్దని అధిష్టానం పీసీసీకి ఆదేశాలిచ్చింది.

చేరాలనుకున్నవారి చరిత్రను అధ్యయనం చేయాలని, నియోజకవర్గాల్లో వారి బలాన్ని, బలహీనతల గురించి పరిశీలించాలని చెప్పింది. పార్టీకి పూర్తిగా ఉపయోగపడేవారినే చేర్చుకోవాలని చెప్పింది. వాస్తవానికి కాంగ్రెసు ఎక్కువమంది నేతలను చేర్చకునే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్నవి 119 అసెంబ్లీ సీట్లు కాగా, వంద స్థానాల్లో పార్టీలోని సీనియర్లకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలినవి 19 స్థానాలే. సీనియర్లను కాదని, కొత్తగా పార్టీలో చేరినవారికి ఎక్కువ టిక్కెట్లు ఇస్తే తిరుగుబాట్లు వచ్చే ప్రమాదముంది.

పార్టీలో చేరాలనుకున్నవారికి టిక్కెట్లు ఇవ్వలేకపోతే మరి వారికి ఏం ప్రయోజనం కల్పించాలి? అందుకు పీసీసీ నేతలు 'టిక్కెట్లు ఇవ్వలేని వారికి పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం' అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ బలపడి ఎక్కువ సీట్లు సాధించవచ్చేమోగాని, అధికారంలోకి రాగలదా? రెండోసారి కూడా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చేస్తున్న  అంచనా తప్పి కాంగ్రెసు అధికారంలోకి రాగలిగితే అది కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు చావు దెబ్బే. 

-మేనా