cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘మానాన్న బతికున్నంత దాకా నేను మంచోణ్నే’

‘మానాన్న బతికున్నంత దాకా నేను మంచోణ్నే’

రాజకీయ అవకాశవాదాల్ని, రాజకీయ కుట్రలు కూహకాల్ని ఎండగట్టే మాట ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతరంగం ఇది. ఆంధ్రప్రదేశ్ లోని 13జిల్లాల్లో సాగించదలచుకున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రవేశించిన జగన్ ఒక జాతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన లక్ష్యాలను, భావోద్వేగాలను పంచుకుంటూ.. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ప్రస్తావించేప్పుడు ఈ మాట చెప్పడం విశేషం.

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. తన పార్టీ తరఫున ప్రజల మేనిఫెస్టోను తయారు చేయడం, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం లక్ష్యాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత.. కాంగ్రెస్ తో విభేదించడమే.. తన మీద నిరాధారమైన డజన్ల కొద్దీ కేసులు బనాయించడానికి కారణమైందని జగన్ అంటున్నారు. ‘మా నాన్న బతికున్నంత దాకా నేను చాలా గౌరవనీయమైన వ్యక్తిని.. మా నాన్న కూడా చాలా గౌరవనీయమైన వ్యక్తి’ అంటూ.. మరణానంతరం మారిపోయే పరిస్థితులు, నాయకులు అవకాశవాదాల తీరుతెన్నులను ఎండగడుతూ.. జగన్మోహన్ రెడ్డి.. తన అంతరంగాన్ని పంచుకోవడం విశేషం.

కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కలిసే.. తన మీద సమస్త కేసులను బనాయించారని ఆయన ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతో వేసిన ఇలాంటి కేసులు... తనను కొంతకాలం పాటు ఇబ్బంది పెట్టగలవే తప్ప.. ప్రజాబలం తన వెన్నంటి ఉన్నంతవరకు తన లక్ష్యాన్ని నాశనం చేయలేవని జగన్ పేర్కొన్నారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా చిన్న పని అని, ఆయన దాన్ని పట్టించుకోకుండా స్వార్థం చూసుకున్నందునే ఇవాళ ప్రజాచైతన్యంతో ప్రజాసంకల్పయాత్ర చేయాల్సివస్తున్నదని చెప్పారు జగన్.

హోదా విషయంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన ఏర్పడి ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోచేస్తూ విచ్చలవిడిగా సాగిస్తున్న అవినీతి పర్వానికి కేంద్రం ఆశీస్సులు ఉన్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఇసుక, మట్టి, కరెంటు, బొగ్గు, మద్యం.. ఏదీ వదిలిపెట్టకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడే సీఎం ఉండడం మన రాష్ట్రం చేసుకున్న ఖర్మం అంటున్నారు.

భాజపాతో సంబంధాల విషయంలో తనమీద ఎలాంటి నిందలు వేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ప్రజల ఎదుట అవి నిలబడేవి కాదని జగన్ చెబుతున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తాను కృతనిశ్చయంతో ఉన్నానని... కనీసం మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రాకుండా.. ఈ విషయంలో చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని కూడా జగన్ ఆరోపిస్తున్నారు.