cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీపై ఈగ వాలనివ్వని అగ్ర దినపత్రిక!

మోడీపై ఈగ వాలనివ్వని అగ్ర దినపత్రిక!

అటు చంద్రబాబునాయుడు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా మీడియాను మేనేజి చేయడంలో.. తమకు అనుకూలంగా మాత్రమే కథనాలు వచ్చేలా.. మేనేజిమెంట్ లను ప్రభావితం చేయడంలో ఉద్ధండులే. ఇద్దరికీ ఈవిషయంలో పోటాపోటీ తెలివితేటలు ఉన్నాయనడంలో సందేహం లేదు.

అయితే ఈఇద్దరి మధ్యనే పోటీ వచ్చిదంటే ఎవరు నెగ్గుతారు.. సహజంగా పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి గనుక.. మోడీకి అనుకూలంగానే ఎవరైనా మొగ్గుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మీడియాలో కూడా అదే జరుగుతోంది.

తిరుగులేని అగ్ర దినపత్రికగా చెప్పుకునే ఒక పత్రిక మోడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండగల వార్తలను అతి తక్కువ ప్రాధాన్యంతో ప్రచురిస్తూ, ఆయన ఇమేజికి భంగం రాకుండా తమ వంతుగా ప్రభువు సేవలో గడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. చివరికి వారెంతగా ఈప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నారంటే.. అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా అవమానం ఫీలయ్యేంతగా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బుధవారం నాడు లోక్ సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్.. మాట్లాడారు. సుదీర్ఘప్రసంగం చేసిన జయదేవ్ కు సహచర సభ్యులనుంచి, ఇతర పార్టీల వారినుంచి  కూడా అభినందనలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని విపులంగా జయదేవ్ తెలియజెప్పాడు. మోడీ ఎలా మాట తప్పాడో విపులంగా వివరించేలాగానే ఆ ప్రసంగం సాగింది.

అయితే.. తెలుగులోని ఓ అగ్ర దినపత్రిక మాత్రం.. ఈజయదేవ్ వార్తను చాలా కనీస ప్రాధాన్యంతో లోపలి పేజీల్లో ఎక్కడా ఎవ్వరికీ కనిపించకుండా వేసింది. అదే నరేంద్రమోడీ.. ప్రసంగంలో కాంగ్రెస్ ను విమర్శించిన తీరును మాత్రం తాటికాయలంత అక్షరాలతో వేసింది.

రాష్ట్రానికి ఏం చేస్తానో మాట మాత్రంగానైనా స్పష్టత ఇవ్వకుండా.. మూడు రోజుల ఏపీ నాయకుల పోరాటాన్ని కూడా.. కాంగ్రెస్ ను నిందించడానికి చాలా లౌక్యంగా వాడుకున్న మోడీ వక్రరాజనీతిని నామమాత్రంగా కూడా ఎండగట్టకుండా.. ఆయన ప్రసంగాన్ని కీర్తించారు.

అదేసమయంలో.. తెలుగుదేశానికి అనుకూలంగానే వార్తలు వడ్డించే మరో పత్రిక మాత్రం.. జయదేవ్ వార్తకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. రెండు పత్రికలు చదివే అలవాటు ఉన్న చాలా మంది.. ప్రాధాన్యాల విషయంలో అగ్రపత్రిక ఇంత అన్యాయంగా వ్యవహరించిందేమిటి? మోడీ భజనలో తరించిపోయేప్పుడు, తాము రెగ్యులర్ గా కీర్తిస్తూ ఉండే తెలుగుదేశం ప్రయోజనాలు కూడా వారికి దిగదుడుపే ఏమో అని ప్రజలు అనుకుంటున్నారు.

మీడియా కూడా స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి, రాష్ట్రప్రయోజనాలు దెబ్బతినకుండా సముచిత ప్రాధాన్యాలతో కథనాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.