cloudfront

Advertisement


Home > Politics - Gossip

ట్వీట్‌ల వల్ల పవన్ కే లాభం!

ట్వీట్‌ల వల్ల పవన్ కే లాభం!

కొన్ని సంఘటనలు చరిత్ర గతిని మార్చేస్తాయి. ఒక నాయకుడు పెట్టే బహిరంగ సభ కావచ్చు (జయప్రకాష్‌ నారాయణ పాట్నాలోని గాంధీ మైదానలో పెట్టినది), ఒక బస్సుయాత్ర కావచ్చు ( ఎన్టీఆర్‌ చైతన్య రథం), ఒక పాదయాత్ర కావచ్చు (వైఎస్సాఆర్‌ పాదయాత్ర).. ఒక నిరాహార దీక్ష (ప్రత్యేక తెలంగాణా కోసం కేసీఆర్‌ దీక్ష) కావచ్చు. వీటన్నింటి తర్వాత అప్పటిదాకా ఉన్న పరిస్థితులు మారిపోతాయి. ఇవి ఒకతరహా.

మరి కొన్ని సంఘటనలు- అలజడి లేవదీసి- కొత్త పరిస్థితులు ఏర్పడటానికి ఉత్ర్పేరకంగా పనిచేస్తాయి. నెలక్రితం దాకా శ్రీరెడ్డి గురించి తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. ఆమె వీడియోలు.. లైవ్‌ ఇంటర్వ్యూలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. తెలుగు రాజకీయ రంగాన్ని, సినిమా రంగాన్ని ఒక కుదుపు కుదిపాయి. కొత్త సమీకరణాలను లేవదీశాయి. వీటిలో పవన్ కళ్యాణ్‌ చేస్తున్న ట్వీట్‌లు.. వాటికి ప్రతిగా ఎబీఎన్ రాధాకృష్ణ, టీవీ9 శ్రీనిరాజు వేసిన పరువు నష్టం దావాలు కొత్త చర్చను లేవదీశాయి. 

మీడియా మీద ఇతరులు దావాలు వేయటం సహజమే కానీ.. మీడియా అధినేతలు రాజకీయ నాయకులపై వేయటం చాలాఅరుదు. ఇప్పుడు ఒక చాలా సులభమైన ప్రశ్నకు సమాధానం కనుగొనటానికి ప్రయత్నిద్దాం. తాను చేస్తున్న ట్వీట్లతోటి.. చేస్తున్న ప్రకటనలతోటి.. తనపై దావాలు వేసే అవకాశం ఉందని పవన్ కు తెలియదా? తెలిసి ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? సినిమాల్లో చూపించినట్లు- వేలమంది ఫాలోయర్స్‌ను వేసుకొని రోడ్ల మీదకు వచ్చేసి వ్యవస్థను మార్చేయటం కుదరదని అతనికి తెలియదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ముందు పవన్ ఏ వర్గాన్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని గమనించాలి.

చాలాకాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు.. కులం ఆధారంగానే నడుస్తున్నాయి. కమ్మ.. రెడ్డి.. కాపు ఈ మూడుకులాలు.. వెనకబడిన తరగతులు ఈ సమీకరణంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కువమంది కమ్మ కులస్తులు తెలుగుదేశానికి.. రెడ్డి కులస్తులు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌కు, కాపు కులస్తులు.. కొన్నిసార్లు అటూ.. కొన్నిసార్లు ఇటు మద్దతు ఇస్తూ వచ్చారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలన ఎప్పుడూ అగ్రవర్ణాల చేతిలోనే ఉంది.

అయితే ఈ వర్ణాల పిరమిడ్‌లో చిట్టచివర ఉండే కాపులకు పూర్తి అధికారం ఎప్పుడూ దక్కలేదు (చిరంజీవికి ఈ అవకాశం వచ్చింది.. దానిని చేజేతులా వదిలిపెట్టుకున్నారు). ఇప్పుడు కాపులకు మరోసారి అలాంటి అవకాశం వచ్చింది. దీనికి కారణం బీజేపీ. తెలుగుదేశంతో కటీఫ్‌ చేసుకున్న తర్వాత బీజేపీకి మరో బలమైన సామాజికవర్గ ఆలంబన కావాలి. ఇప్పటికే రాజులు, కమ్మలతో చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి.

అలాంటి పరిస్థితుల్లో వారి కళ్లముందు కనిపించే ఏకైకవర్గం కాపులు. వీరు ఇప్పటి దగ్గర ఒక సంఘటిత శక్తిగా ఎదగలేకపోయారు. వారిలో ఉన్న వర్గ విభేదాలు.. నాయకత్వ లేమి దీనికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం కాపు యువతలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లేవు. వారిలో ఏదో ఒక నైపుణ్యం ఉన్న వారు కూడా తక్కువే. పల్లెటూళ్లలో సామాజికంగా ముందు వరసలోనే ఉన్నా ఆర్థికంగా వెనకబడి ఉండటం వారిలో ఒక విధమైన అశాంతికి గురిచేస్తోంది.

ఈ పరిస్థితులను ఏదో ఒక విధంగా తమవైపు తిప్పుకోవటానికి ముద్రగడ వంటి నాయకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం పవన్ రూపంలో వీరిని ఒక తాటిపైకి తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కాపునేతను తప్పనిసరిగా నియమించాలనుకోవటం దీనిలో ఒకభాగమే. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పవన్ కు కలిసివచ్చాయి. ఇప్పటిదాకా ‘కనిపించని శత్రువుతో కనిపించే యుద్ధం చేసిన’ పవన్ తన శత్రువులను తానే నిర్దేశించుకున్నాడు. ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ప్రాబల్యం ఉన్న రాజు, కమ్మ కులాలలో పేరు పొందిన వారిని టార్గెట్‌ చేశాడు.

బలమైన శత్రువును (లేదా బలంగా కనబడే శత్రువును) ఎంచుకొని పోరాడటం వల్ల ప్రయోజనాలెన్నో ఉంటాయి. పవన్ చర్యలవల్ల కాపు యువతతో పాటుగా మొత్తం కాపులందరూ సంఘటితం అవుతున్నారు. అప్పుడు బీసీలను తనవైపు తెచ్చుకోవటం పవన్ కు సులభమవుతుంది. పవన్ ట్వీట్లను గోదావరి జిల్లాల్లో యువకులు విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నారని అనేకమంది చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇంకొద్దికాలం కొనసాగించి ఆ తర్వాత పవన్ మౌనముద్ర దాలుస్తాడనటంలో ఎటువంటి సందేహంలేదు. 

పైగా ఈ కేసులు వల్ల పవన్ కు వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమిలేదు. ఎన్నిసార్లు కోర్టుకు వస్తే అతనికి అంత మంచిది. మరోవైపు అతని ప్రత్యర్థులు తప్పుమీద తప్పుచేస్తూ పోతున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ - తన వీకెండ్‌ కామెంట్‌లో- పవన్ తల్లిని తిట్టిన తిట్లు పట్టించుకోవాల్సినవి కావని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి తిట్లు సహజమేనని రాయటం కూడా చాలామందిలో ఇబ్బంది కలిగించింది. (దీనిపై కూడా పవన్ నర్మగర్భంగా ట్వీట్‌ చేశాడు). ఇప్పటిదాకా పవన్ పై రాధాకృష్ణ, శ్రీనిరాజు మాత్రమే కేసులు వేశారు.

టీవీ9 రవిప్రకాష్‌ మాత్రం మౌనంగానే ఉన్నాడు. కేసు వేస్తే ఎలాంటి పర్యవసానాలు ఏర్పడతాయో.. ఎలాంటి లీక్‌లు బయటకు వస్తాయోననే భావన ఆయనలో ఉండచ్చు. ఎందుకంటే పవన్ పేర్కొన్న ముగ్గురిపైనా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అవి కొంతమందికే తెలిసి ఉండచ్చు. ఈ వ్యవహారం రచ్చకెక్కితే మరిన్ని లీకులు.. వదంతులు.. ఆరోపణలు రావటం సహజం. అంతేకాదు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం, కమ్మ సామాజిక వర్గం కొంత వెనకడుగు వేయాల్సి వచ్చిందనే చెప్పాలి.

అందుకే తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు కానీ పవన్ ట్వీట్లపై పెద్దగా స్పందించటం లేదు. ఒకటి రెండురోజుల్లో ఈ మొత్తం విషయాలలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. 
-భావన 
(fbackfm@gmail.com)