Advertisement


Home > Politics - Gossip
ఉన్నది ఉన్నట్లుగా..బుల్ డోజర్ కు బ్రేకుల్లేవు బాబూ

ఎంత అందమైన అక్షరాలు పేర్చారు. ఎంత సమర్థవంతమైన మాటలు విసిరారు. ‘నేను ఒక్కో ఇటుకా పేరుస్తుంటే, మీరు బుల్ డోజర్ తో కూల్చేస్తున్నారు’ పార్టీ జనాల వైఖరిపై చంద్రబాబు మాట. నిజమే. వాళ్లు కూలుస్తున్నారు. మీరు పేరుస్తున్నారు. కానీ కూల్చేవారిని కనుసైగతో శాసించేదెప్పుడు? వాళ్లు బుల్ డోజర్ కు బ్రేకులు వేసేదెప్పుడు?

వెనకటికి సామెత వుంది. తోటకూరనాడే చెప్పివుంటే బాగుండేదని. మూడేళ్ల క్రితం అధికారం అందిన ఆనందంలో, చంద్రబాబు తను, తన సన్నిహితులు కలిసి, తమ వ్యవహారాలు తాము చక్క బెట్టుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో దూడలు కూడా గట్టును వదిలేసి, చేలో పడి మేయడం ప్రారంభించాయి.

అప్పుట్లో వాటిని ఆపేంత తీరికా లేదు, ఆలోచనా లేదు చంద్రబాబుకు. ఎందుకంటే అర్జెంట్ గా తనకు, తన వాళ్లకు చేయాల్సినవి, చేసుకోవాల్సినవి చాలా వున్నాయి. పది కోట్లు, వంద కోట్ల వ్యవహారాలు కాదు, వేల కోట్ల రాజధాని వ్యవహారాలు, పోలవరం కాంట్రాక్టులు, ఇంకా చాలా, చాలా.

అందువల్ల ఈ కుంభస్థలం సంగతి తాను చూసుకుంటూ, అడుగున మిగిలిన బొమికలు, మిగిలనవి ఏరుకుంటున్నారులే అని, కిందివారి వ్యవహారాలను చూసీ చూడనట్లు వదిలేసారు. అదిగో అదే తప్పయింది. ఇంకా చెప్పాలంటే అదే అలుసయ్యింది. కానీ ఈ తప్పు,ఈ అలుసు బాబు గారు కావాలని చేసిందే. కావాలని ఇచ్చిందే.

చిరకాలపు ఆకలి

దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో వున్నారు. కష్టపడి పార్టీని బతికించుకువచ్చారు. మామూలుగా అయితే చంద్రబాబు కాస్త కట్టడి చేసి, కాస్త చూసీ చూడనట్లు వదిలే వీలు వుండేదేమో?

కానీ రాష్ట్ర విభజన జరగడం, రాజధాని వంటి బృహత్తర వ్యాపార అవకాశం కళ్ల ముందుకు రావడం, డబ్బులు వుండాలే కానీ, బోలెడు పనులు చేపట్టి, అస్మదీయులకు అవకాశాలు కల్పించాల్సిన వీలు కనిపించడం, అన్నింటికి మించి జగన్ ఓ పిల్లకాకిలా కనిపించడం, కాంగ్రెస్ కుదేలు కావడం, ఇలా అనేకానేక కారణాలు చంద్రబాబులో ధీమాను, ఉదాసీనతను పెంచేసాయి. సరే, పదేళ్లు ఆకలిగా వున్నారు.

వాళ్ల ఆకలి కూడా తీరాలి కదా? అని అనుకున్నట్లున్నారు. కాస్త తాడు వదులు చేసి వదిలారు దీంతో కట్టుదాటి, గట్టుదాటి, చేలోకి చొచ్చుకుపోయారు. పరిస్థితి కకావికలు కావడం ప్రారంభమైంది.

భూములు.. ఇసుక.. కాంట్రాక్టులు

అధికారంలోకి వస్తూనే నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల లిమిట్ ను పెంచడం ద్వారా అస్మదీయులకు పెద్ద పీట వేసే పనికి బాబు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు వై.యస్ దాన్ని తగ్గిస్తే, బాబు నిర్మొహమాటంగా పెంచేసారు.

అక్కడితో ఆగకుండా చాలా వరకు పనులు ఈ లిమిట్ దాటకుండా వుండడానికి వీలుగా ముక్కలు చేసి, కాంట్రాక్టులు కట్టబెట్టే వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేసారు. దీంతో పనులన్నీ అస్మదీయులకు కాసుల పంట పండించడం ప్రారంభించాయి.

ఇదే సమయంలో ఇసుక దందాలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తెలుగు తమ్ముళ్లు తమ అధికార ధాష్టీకం చూపించి ఇసుకను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆకలి అనేది అనంతం.

ఒకటి పూర్తయితే మరొకటి. అలాగే తెలుగు తమ్ముళ్లు తమకు అందిన అధికారం అండతో సంపాదన మార్గాల అన్వేషణ ప్రారంభించారు. కనిపించిన పోరంబోకు, బంజర్లకు అనుభవ పట్టాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. ఇవీ చాల లేదు. దాంతో తప్పుడు పట్టాల దందాలు ప్రారంభమయ్యాయి.

విపక్షం కోసం

తమ్ముళ్ల దందాలను విపక్షం బయటపెట్టడమే సమస్య అయింది బాబుకు. వాళ్లపై చర్య తీసుకుంటే విపక్షం నెగ్గినట్లు అవుతుంది. విపక్షం ప్రచారాన్ని నిజం చేసినట్లు అవుతుంది.

అందుకే లోపాయికారీగా కాస్త మందలించడం, వదిలేయడం వంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. పైగా బాబు పార్టీ కార్యక్రమాల ఇటు లోకేష్ అటు బాబు మధ్య దోబూచులాడడం కూడా తమ్ముళ్లకు కలిసివచ్చింది.

ఒకటేమిటి విజయవాడ కాల్ మనీ, చింతమనేని దందాలు, కేశినేని ఆర్టీఎ వివాదం, విశాఖలొ అయ్యన్న-గంటా గొడవలు, రాయలసీమలో అధికారులపై దాడులు ఇలా ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ, ఏదో ఒకటి.

అన్నింటినీ బాబు క్షమిస్తూ వచ్చారు. ఆయన అనుకూల మీడియా కవర్ చేసుకుంటూ వచ్చింది.  కానీ ఇక్కడ బాబు కానీ ఆయన అనుకూల మీడియా కానీ మరిచిపోయింది ఒక్కటే.

ఈ జిల్లా గొడవలు పక్క జిల్లాకు తెలియక పోవచ్చు. ఆ జిల్లా సంగతులు మరో జిల్లాకు వెళ్లకపోవచ్చు. కానీ లోకల్ గా జనాల్లోకి వెళ్తాయని, జనం అంతా గమనిస్తారని మరిచిపోయారు.

ఒక్క జిల్లాలో వివాదం, దందా, అక్రమాలు అయితే ఓకె. ప్రతి జిల్లాలో ఏదో ఒకటి అయితే, జనాల్లోకి వెళ్లిపోదా? జరిగింది అదే, ప్రతి గ్రామం, పట్టణం, జిల్లాలో జనం తమ కళ్ల ముందే మూడేళ్ల స్వల్ప కాలంతో కొద్ది మంది ఎలా కోట్లకు పడగలెత్తుతున్నారో గమనించారు. గమనిస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలిట జనాల్లో అసంతృప్తిగా గూడు కట్టుకుంటోంది.

అధికారులు కూడా

ఎప్పుడైతే తమ్ముళ్లు సంపాదనా మార్గం పట్టారో, దానికి అధికారుల సహాయం అన్నది అనివార్యం అయింది. ఎప్పుడైతే తమ్ముళ్లకు తాము సహాయం చేస్తున్నారో, వాళ్ల అండతో వీళ్లు కూడా సంపాదించుకోవడం ప్రారంభించారు. దీంతో చంద్రబాబు పాలనలో దేనికి ఎన్ని మార్కులు వేసినా అవినీతికి మాత్రం ఫుల్ మార్కులు పడిపోయే పరిస్థితి దాపురించింది.

మూడేళ్ల తరువాత ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకోవాల్సిన తరుణం వచ్చాక, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేవలం అవినీతిపై దాడితోనే క్రెడిబులిటీ సంపాదించడం చూసాక, చంద్రబాబు కూడా ఆ బాట పట్టాలని డిసైడ్ అయ్యారు.

ఎసిబిని అప్రమత్తం చేయడం, టోల్ ఫ్రీ నెంబర్ ఇలాంటివి అన్నీ అందులో మార్గాలే. కానీ  ఇవేవీ జనాల అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నాయి. కారణం, తమ్ముళ్ల వ్యవహారాలు యధేచ్ఛగా సాగుతూ వుండడమే.

తత్వం తెలిసిపోయింది

పైకి కామెంట్ చేయకపోవచ్చు, పైకి మాట్లాడకపోవచ్చు, మీడియా ముందు బుకాయించవచ్చు. కానీ రాజధాని వ్యవహారాలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నింటిలో జరుగుతున్నదేమిటో తెలుగు తమ్ముళ్లకు కూడా తెలియని వైనం కాదు. బాబుగారి అవసరం తమకు, తమ అవసరం బాబుగారికీ వున్నదన్న సంగతి వాళ్లకు క్లియర్ అయిపోయింది.

అందుకే కాస్త గట్టిగానే గొంతులు వినిపించడం ప్రారంభించారు. తేడా వస్తే తాము దేనికైనా రెడీ అనే ఇన్నర్ మీనింగ్ వచ్చేలా అయ్యన్న, గంటా, కేశినేని లాంటి వాళ్లు మాట్లాడడం ప్రారంభించారు. ఇది చూసి మిగిలిన వాళ్లకు కూడా ధైర్యం వచ్చింది.

పార్టీలో వున్నవాళ్లను కాదని, వైకాపా నుంచి వచ్చిన వాళ్లకు పీట వేస్తుంటే, ప్రకాశం, నంద్యాల లాంటి ఉదంతాలు తెరపైకి వస్తన్నాయి. నియోజక వర్గాల పెంపు వుంటుంది, ఫరవాలేదు అన్న సర్దుకుంటాయనుకున్న బాబుకు అక్కడా వ్యవహారం బెడిసి కొట్టింది. దీంతో లుకలుకలు బాహాటం కావడం ప్రారంభమయింది.

కింకర్తవ్యం?

ఇప్పుడు బాబు ఏమంటున్నారు? తాను కడుతుంటే తమ్ముళ్లు కూలుస్తున్నారు అంటున్నారు. కానీ తమ్ముళ్లకు తాను ఎందుకు బ్రేక్ వేయలేకపోతున్నాను అన్నది మాత్రం చెప్పడం లేదు. ఆలోచించడం లేదు. ఎందుకంటే ఆ బలహీనత ఆయనకూ అర్థం అయింది.

కొంతమంది తన మనుషులు. కొంతమంది లోకేష్ మనుషులు. మరి కొంతమంది స్థానికంగా బలమైన వారు. ఇంకెవరిని కట్టడి చేయగలరు? ఒకపక్క తాను తన వాళ్లకు కట్టబెట్టాల్సినవి కట్టబెడుతూ, మిగిలిన వాళ్లను ముట్టుకోవద్దు, తినొద్దు అని ఎలా చెప్పగలరు? అదే అసలు సమస్య.

ఎన్నికల టికెట్ ల కేటాయింపు, తన అనుకూల మీడియా ద్వారా బదనామ్ చేయడం ఒక్కటే ఇప్పుడు బాబు దగ్గర మిగిలిన అస్త్రాలు. వాటిలో మీడియాను ఇప్పుడు వాడుతున్నారు.

టికెట్ లను ఇవ్వకపోవడం అన్న అస్త్రాలు ఎన్నికల వేళ వాడతారు. కానీ వీటివల్ల లుకలుకలు తగ్గవు, పార్టీ పరువు బజార్నపడడం తగ్గదు. అన్నింటికి మించి తాను మొదలంటా నరికేసాను, ఇక చిగురించదు వైకాపాను ఇవే మరింత బలోపేతం చేస్తాయి.

ఒకప్పుడు కాంగ్రెస్ ను అనేవారు. ఆ పార్టీని ఎవరో ఓడించనక్కరలేదు. వాళ్లలో వాళ్లే ఓడించుకుంటారు.

ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. వైకాపా పెద్దగా కష్టపడక్కరలేదు. కాగల కార్యం తెలుగుతమ్ముళ్లే తీరుస్తారు.

-ఆర్వీ