Advertisement


Home > Politics - Gossip
ఉన్నది ఉన్నట్లుగా.. వెంకయ్య కు చెక్?

మనవాడు, మన తెలుగు వాడు ఉపరాష్ట్రపతి అవుతారంటే ఆనందంతో చిందేయ్యాలి. కానీ అలా జరగలేదు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అవుతారన్న వార్త గుప్పుమనగానే మరిన్ని అనుబంధం వార్తలు పుట్టుకువచ్చాయి.

దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందని, ట్రబుల్ షూటర్ లేకుండా పోతారంటూ ఓవార్త.

ఆంధ్ర ప్రాజెక్టులు అనాధలైపోతాయని, ఇక ఆంధ్రకు అంతటా అన్యాయమే మిగుల్తుందంటూ మరోవార్త.

అసలు ఉపరాష్ట్రపతి పదవికి వెళ్లాలన్న ఆసక్తి వెంకయ్యనాయుడికి లేదు. అది స్పష్టం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి అన్నది అలంకారప్రాయం తప్ప వేరుకాదు. పైగా దానికి సవాలక్ష పరిమితులు వుంటాయి. ఆ పరిమితుల్లోనే వ్యవహరించాల్సి వుంటుంది. కానీ కేంద్ర మంత్రి పదవి అంటే అలా కాదు. తెల్లారితే విశాఖ, మధ్యాహ్నం విజయవాడ వస్తూ పోతూ వుండొచ్చు. అన్ని వ్యవహారాలు నడిపించుకొవచ్చు.

అన్నింటికి మించి ఇఫ్పటి వరకు దశాబ్ధాల కాలంగా ఆంధ్ర భాజపా కానీ, భాజపా వ్యవహారాలు కానీ అన్నీ వెంకయ్యనాయుడి కనుసన్నలలోనే నడిచాయి. ఇకపై అది అస్సలు సాధ్యం కాదు.

పార్టీ పరిస్థితి ఏమిటి ?

ఇదిలా వుంటే అసలు వెంకయ్యనాయుడు లేకపోతే ఆంధ్ర భాజపా అనాధైపోతుందా? అన్నది అసలు అనుమానం. ఎందుకంటే భాజపా అభిమానుల మనస్సులో వున్నది వేరు. అసలు ఆంధ్ర భాజపా ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి వెంకయ్యనాయుడే అని చాలా మంది అభిప్రాయం. ఆయన ఆ పార్టీని స్వంతకాళ్ల మీద ఎదగనీయకుండా చేసారన్నఅభియోగం వుంది. కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే, దాంట్లోకి సరైన నాయకులు రాకుండా అడ్డంగా వున్నారని అంటారు.

మోడీ వచ్చిన తరువాత ఎందరో ప్రముఖులు భాజపాలోకి రావడానికి మొగ్గు చూపారు. కానీ ఎవ్వరూ రాలేదు. దానికి కారణం వెంకయ్య మంత్రాంగమే అని అంటారు. మరి అలాంటది వెంకయ్య వెళ్లిపోతే రాష్ట్ర భాజపాకు పూర్తి స్వేచ్ఛ వస్తుందని అనుకోవచ్చు కదా? చకచకా కొత్త నీరు వచ్చి, భాజపా స్వతంత్రంగా ఎదిగే చాన్స్ వస్తుందని అనుకోవచ్చు కదా?

ఎపి ప్రాజెక్టులు

విభజన సమయంలో వెంకయ్యను హోదా హీరోను చేసింది మన మీడియానే. ఆ హీరోచిత ప్రచారంతోనే భాజపా, తేదేపా జోడీ జనం ముందుకు వెళ్లగలిగాయి. నిజానికి కాంగ్రెస్ కు విభజన పాపంలో ఎంత వాటా వుందో, భాజపాకు కూడా అంతే వాటా వుంది. అయితే ఈ హోదా ప్రచారంతో కాంగ్రెస్ ను మాత్రం బలి చేసి, భాజపాను వదిలేసేలా చేసింది మన మీడియానే.

ఆ తరువాత హోదా మీద నాలుక మడతేసిన వారిలో వెంకయ్యనాయుడు కూడా వున్నారు. ఇక్కడ వెంకయ్యనాయుడు తప్పిదం ఏమీ లేదు. కేంద్రానికి హోదా ఇవ్వడం ఇష్టం లేదు. కేంద్రాన్ని కాదని వెంకయ్య ఏమీ చేయలేరు. అదీ సమస్య. కేంద్రానికి ఇష్టం లేకుండా వెంకయ్య ఏమీ లేరని అనుకున్నపుడు, ఆయన లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టుల అన్యాయం అయిపోతాయని అనడం ఏమిటో?

అమిత్ స్ట్రాటజీ

నిజానికి దక్షిణాదిలో భాజపాను విస్తరించాలని పార్టీ చీఫ్ అమిత్ షా డిసైడ్ అయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాజపా విసర్తణకు ప్రధాన అడ్డంకి వెంకయ్యనాయుడే అన్నది ఆయన గ్రహించేసారు. దక్షిణాదిలోని నాలుగు కీలక రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో భాజపాను ను ముందుకు నడపాలంటే, ఆ అడ్డంకి వుండకూడదని అమిత్ భావిస్తున్నట్లు వుంది. అందుకే వెంకయ్యనాయుడిని క్రియాశీలక రాజకీయాల్లోంచి తప్పిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తోంది. అదే కరెక్ట్ అయితే ఇకపై ఆంధ్ర భాజపాలోకి కొత్త నెత్తురు గ్యారంటీ. ఇలా వచ్చే కొత్త నెత్తురుతో తెలుగుదేశం పార్టీకి కాస్త కష్టంగానే వుండే అవకాశం కూడా గ్యారంటీ.

నార్త్ సౌత్

ఇటీవల కొంత కాలంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు ఉత్తరాది, దక్షిణాది పక్షపాతం వంటి కాలం చెల్లిన నినాదాలను బయటకు తీసి ఉతికి ఆరవేసి, కొత్తగా చూపించే పనిలో పడ్డారు. ఈ నార్త్ సౌత్ అన్యాయం లాంటి పదాలు ఇకపై వినిపించినా కౌంటర్ రెడీగా వుంటుంది. ఉత్తరాదికి రాష్ట్రపతి, దక్షిణాదికి ఉపరాష్ట్రపతి. ఖేల్ ఖతమ్.

మొత్తం మీద అమిత్ షా-మోడీల వ్యూహం వెంకయ్య నాయుడు అభిమానులకు గొంతులో వెలక్కాయ పడేలా చేసినట్లు కనిపిస్తోంది.

అందుకే వెంకయ్యనాయుడు ఇప్పుడేమీ మాట్లాడొద్దు, సంయమనం పాటించండి అని ముందుగా హింట్ ఇచ్చారు. అంటే వార్త వెలువడిన దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే వరకు మిగిలిన కొద్ది గంటల్లో మాగ్జిమమ్ ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఆ ప్రయత్నాలు బెడసి కొట్టకుండా వుండాలంటే ఎవరు తొందరపడి ఏ ప్రకటనలు చేయకూడదు. కావాలంటే ఆ ప్రయత్నాలకు మద్దతుగా ఇలాంటి ఎపి పథకాలకు అన్యాయం, భాజపాకు ట్రబుల్ షూటర్ వుండకపోవడం వంటి వార్తలు అయితే వండివార్చుకొవచ్చు.