తమని కాదని జనం జగన్ కు ఓటు వేసారని ఒక బాధ. అలా గెలిచిన జగన్ మంచి పనులు చేస్తూ పాతుకుపోతున్నాడని ఇంకో బాధ. తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, అప్పులు బకాయి పెట్టి అప్పగించినా, ఏదోలా నెట్టుకొచ్చేస్తున్నాడని మరీ బాధ. ఇలా నాలుగేళ్లు వదిలేస్తే, ఆ తరువాత జనం తమను గుర్తు పెట్టుకుంటారా? అన్నది మరీ మరీ బాధ.
ఇన్ని బాధలు వున్నాక, ఫ్రస్టేషన్ కాక ఏమిటి వస్తుంది. నీటిలో మునిగిపోతున్నవాడు గడ్డి పోచను చూసినా, పట్టుకుని గట్టెక్కోదాం అనుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అను'కుల' మీడియా బాధ ఇలా వుంది. ప్రజలకు జగన్ ను చేరువ చేస్తున్న ప్రతి పథకంలోనూ లొసుగులు వెదకాలని చూస్తున్నారు.
ఇళ్లస్థలం లేని వాడు వుండకూడదు రాష్ట్రంలో అని జగన్ సంకల్పిస్తే, ఎక్కువకు కొని నాయకులు లాభం చేసుకుంటున్నారు. కొండలు గుట్టల్లో స్థలం ఇస్తున్నారు. ఇలా రకరకాలుగా. కానీ ఇక్కడ వాళ్లు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నది ఒకటి వుంది. జగన్ జనాలకు స్థలం ఇవ్వడం అన్నది వాస్తవం అని. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కొండలు కావా? కొండలు, బంజర్లు చదును చేయకుండా స్థలాలు ఎక్కడి నుంచి పుట్టిస్తారు? జనం నివసించడం మొదలు పెడితే, అవి సిటీలుగా మారిపోవా?
బిసి లకు, కాపులకు పథకాలు ఇస్తుంటే, ఇవ్వడం లేదు అనడం లేదు. ఆస్కీము, ఈ స్కీము కలిపేస్తున్నారు అంటున్నారు. ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్స్ లు అందిస్తున్నారు. అవి కళ్లకు కనిపిస్తున్నాయి. రెండు వందల కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో వందల కోట్ల మతలబు అంటున్నారు.
ఇలా ప్రజలకు పనికి వస్తున్న ప్రతి స్కీము అమలు జరగడం లేదని తెలుగుశం అనుకుల మీడియా కూడా అనడం లేదు. దాని బాధ వేరు. జనాలుకు లాభం చేస్తున్న ఈ సీముల వల్ల అయితే జగన్ లాభం పొందుతున్నాడో లేదా ఈ స్కీములు డొల్ల అనో చెప్పాలనుకుంటోంది.
కానీ పట్టా తీసుకున్న జనానికి తెలుసు. ఊళ్లో విత్తనాలు, ఎరువులు అందుకుంటున్న రైతులకు తెలుసు, ఊరిలో స్కూలు ఎలా బాగు అవుతోందో తెలుస్తోంది. ఊళ్లకు తిరుగుతున్న 108/104 వాహనాలు చెబుతాయి. ఊళ్లో కనిపించే స్కూళ్లు అందంగా మారడం కనిపిస్తుంది. రైతు వికాస కేంద్రాల భవనాలు కనిపిస్తాయి. కరోనా ను ఎలా కట్టడి చేస్తున్నారో అర్థం అవుతోంది.
మరి ఇవన్నీ కలిసి జనాలకు జగన్ ను దగ్గర చేస్తుంటే, దేశం అను'కుల' మీడియా మాత్రం ఇలా ఫ్రస్టేట్ అవుతూ, రంధ్రాన్వేషణ చేస్తూ వార్తలు రాసుకోవడం మినహా మరేమీ వుండదు. కానీ దాని వల్ల కూడా అంత ప్రయోజనం వుండదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తున్నారు. జనం మాట్లాడుకుంటున్నారు. అన్నీ పాజిటివ్ గా వుండి, ఈ ఒక్క మీడియా మాత్రం రంధ్రాన్వేషణ చేస్తుంటే ఏం లాభం? ఇప్పటికే జనం కరోనా విషయంలో, అంబులెన్స్ ల విషయంలో జేజేలు పలుకుతున్నారు కదా?