cloudfront

Advertisement


Home > Politics - Gossip

వర్ల పోలీసు కేసు : ఇదీ వెటకారం అంటే!

వర్ల పోలీసు కేసు : ఇదీ వెటకారం అంటే!

అసలు విచారణకే మీ పోలీసుల్ని నమ్మడం లేదంటే.. అదే పోలీసుల వద్ద మరో పంచాయతీ పెడితే మాత్రం ఎవరు నమ్ముతారు? కానీ ఇలాంటి లాజిక్ ఆయనకు స్ఫురించినట్లు లేదు. అందుకే తమ మీద వచ్చిన ఆరోపణల్ని కప్పి పుచ్చుకోవడానికి ఏకంగా పోలీసు కేసుపెట్టి మరీ చోద్యం చూస్తున్నారు. వర్ల రామయ్య గతంలో పోలీస్ ఆఫీసర్ గా పని చేసినప్పటికీ, వైసిపి నాయకులపై పోలీస్ కేసులు పెట్టడం చూస్తే ఈయన పేరు కాస్తా వెటకారం రామయ్యగా మార్చుకుంటే సరిపోతుందని ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఏపి ప్రతిపక్ష నేత జగన్ పై వైజాగ్ లో హత్యా ప్రయత్నం జరిగిన తరువాత వెంటనే రాష్ట్ర డిజిపి స్పందించిన తీరు, తరువాత భాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్ర బాబు ప్రెస్ మీట్ లో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బాధితుడైన జగన్ మీదనే ప్రత్యారోపణలు చేయడంతో జగన్ అభిమానులకు, వైసిపి నాయకులకు జగన్ మీద జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు బలపడ్డాయి.

మరీ ముఖ్యంగా డిజిపి ఎటువంటి విచారణ జరగకుండానే స్టేట్ మెంట్లు ఇచ్చేయడంతో ఆగ్రహానికి లోనైన జగన్ తనపై జరిగిన హత్యా ప్రయత్నంపై స్వతంత్ర సంస్ధ చే విచారణ కొరకు కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు కూడా. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారి విచారణ పై తమకు నమ్మకం లేదని, పదే పదే వైసిపి నాయకులు చెపుతున్నప్పటికీ, అదే పోలీసులకు వైసిపి నాయకులపై కేసులు పెట్టడం, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా పని చేసి, రాజకీయాల లోనికి వచ్చిన వర్ల రామయ్యకు ఎలా సహేతుకంగా అనిపించిందో ఆయనకే తెలియాలి.

దాడిచేసిన శ్రీనివాస్ తెదేపా సభ్యుడంటూ వైకాపా నాయకులు ఆధారాలు చూపిస్తే, అవి నకిలీ ఆధారాలంటూ ఇవాళ వర్ల కేసులు పెట్టారు. ప్రతిపక్ష నాయకునిపై జరిగిన హత్యాయత్నంపై ఇలా వెటకారంగా కేసులు వేసుకుంటూ తమ తప్పులను కప్పి పుచ్చుకోవాలని చేసే ప్రయత్నాలు ఎల్లకాలం సఫలం కాలేవు. పైగా ఇటువంటి చిల్లర రాజకీయాల వలన అధికార పార్టీ ప్రజల దృష్టిలో చులకనకాక తప్పదు.

నిజం చెప్పాలంటే.. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థల మీద రాష్ట్ర ప్రజల్లో ఒక అనుమానం పొడసూపిన ఈ వాతావరణంలో.. తెదేపా తమ సచ్ఛీలతను నిరూపించుకోవాలంటే.. మరో స్వతంత్ర సంస్థకు విచారణ అప్పగించడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఆ విషయాన్ని తెదేపా గుర్తించినా.. ఆ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదని పలువురు అంటున్నారు.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్