Advertisement


Home > Politics - Gossip
వెంకయ్య శుభవార్త... ద్రాక్ష అందినట్లేనా...!

ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటమే జీవితమనుకుంటే అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. 'విరహము కూడా సుఖమే కాదా' అని ఆయన పాడుకోవడంలేదు. ఆయన విరహం ప్రేమకు సంబంధించింది కాదు. పదవికి సంబంధించింది. గవర్నర్‌ పదవి రాలేదని ఆవేదన చెందుతున్న ఆయనకు మరోసారి ఆనందం కలిగించే మాట వినబడింది. ఇది పలికింది అశరీరవాణి కాదు. సాక్షాత్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఆయన మోత్కుపల్లిని ఉద్దేశించి 'కాబోయే గవర్నర్‌' అని టీడీపీ నాయకుల సమక్షంలోనే అన్నారు. చాలాకాలం క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముళ్ల సమక్షంలోనే మోత్కుపల్లిని కాబోయే గవర్నర్‌ అని చెప్పారు. కాని ఇప్పటివరకు నెరవేరలేదు. తాజాగా వెంకయ్య నాయుడు అనడం విశేషం. ఆయన ఇప్పుడు సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆషామాషీగా ఊరించే మాటలు మాట్లాడకూడదు. ఉబ్బించే పని చేయకూడదు.

మోత్కుపల్లిని కాబోయే గవర్నర్‌ అని వెంకయ్య ఇప్పటివరకు అన్న దాఖలాలు లేవు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అనని వెంకయ్య ఉప రాష్ట్రపతి అయ్యాక ఆ మాట అన్నారంటే దానికి విలువ ఉన్నట్లే కదా. ఉప రాష్ట్రపతి అయ్యాక పలుచోట్ల ఆయనకు సన్మానాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నాయకులూ ఆయన్ని కలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వారు ఆనందంగా తనతో సమావేశమైన సందర్భంలోనే 'త్వరలోనే మీరు మోత్కుపల్లికి సంబంధించి శుభవార్త వింటారు' అని చెప్పారు. అంటే మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇచ్చే విషయంలో వెంకయ్యకు సమాచారం ఉందనుకోవచ్చు. వెంకయ్య ఈ మాట అనడం ఆలస్యం వెంటనే టీడీపీ నేతలు, మోత్కుపల్లి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అభినందనల వర్షం కురిపించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక తరువాత కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించే విషయమై దృష్టి సారిస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీంతో మళ్లీ మోత్కుపల్లి పదవీ భవిష్యత్తుపై తెలంగాణ టీడీపీలో చర్చలు జరిగాయి. గత మూడేళ్లుగా ఊరిస్తున్న గవర్నర్‌ పదవి అందని ద్రాక్ష చందంగా ఉండటంతో ఇంకేం వస్తుందిలే అనుకున్నారు. ఈ దశలో వెంకయ్య ఆశలు చిగురింపచేశారు. ఈ నెలలో (ఆగస్టు) 7 రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించబోతున్నట్లు వార్తలొచ్చాయి.

ప్రస్తుతం ఈ రాష్ట్రాలకు తాత్కాలిక గవర్నర్‌లు (వేరే రాష్ట్రాల గవర్నర్‌లు ఇన్‌చార్జిలుగా) ఉన్నారు. వీరి స్థానంలో కొత్త గవర్నర్‌లను నియమిస్తారు. ఇదివరకే కొందరి పేర్లు కూడా వినబడినా మోత్కుపల్లి పేరు లేదు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉంటూ తమిళనాడు బాధ్యతలు చూస్తున్న విద్యాసాగర్‌రావును తమిళనాడుకు పంపి మహారాష్ట్రకు గుజరాత్‌ మాజీ సీఎం ఆనంది బెన్‌ను నియమిస్తారని సమాచారం వచ్చింది. ఆమె ఆంధ్రాకు వస్తారని కొందరన్నారు.

మొన్నటివరకు బిహార్‌ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి అయ్యారు కాబట్టి ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌, మధ్యప్రదేశ్‌కు గుజరాత్‌ గవర్నర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌కు నాగాలాండ్‌ గవర్నర్‌, అస్సాం గవర్నర్‌ మేఘాలయాకు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఏడాది మే 2వ తేదీతో రెండో టర్మ్‌ ఆయన పదవీ కాలం అయిపోయినా ఇంకా కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోత్కుపల్లికి అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా బీజేపీ నాయకులనే చేసిన ప్రధాని మోదీ కొత్త గవర్నర్‌లుగా బీజేపీ నాయకులనే నియమించాలని ఆలోచిస్తున్నారట...! మోత్కుపల్లి  కోరిక తీరబోతున్నట్లు గత ఏడాది నవంబరులో వార్తలొచ్చాయి. ఆయన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌కు గవర్నరుగా పంపుతారని బీజేపీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని అప్పట్లో తెలంగాణ టీడీపీ నాయకులు సంబరపడ్డారు. కాని తరువాత ఎలాంటి కబురూ కాకరకాయ లేకపోవడం షరా మామూలుగా మారింది.

మోత్కుపల్లి గవర్నర్‌ అయిపోయినట్లేనని చంద్రబాబు పలుమార్లు చెప్పారు.  ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని, ఫలానా వాళ్లను రాష్ట్రపతిని చేశానని, ఫలాన వాళ్లను ప్రధానిని చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఒక్క గవర్నర్‌ పోస్టు సాధించడం కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రధాని మోదీ దగ్గర ఆయన 'పలుకుబడి' ఏమిటో తెలియచేస్తోంది.

గవర్నర్‌ పోస్టు ఇస్తే మోత్కుపల్లికి సంతోషం. అంతకంటే ముఖ్యమైంది తెలంగాణ టీడీపీలో చంద్రబాబు పరువు నిలబడుతుంది. హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాల తరువాత (ఉమ్మడి రాజధానిలో చివరి సమావేశాలు)  తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన బాబు ''సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్‌ అవుతున్నారంటే బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ తీసుకున్న చొరవే కారణం''.. అని చెప్పారు. కాని ఆ తరువాత ఏ సమాచారమూ లేదు. త్వరలోనే శుభవార్త తెలుస్తుందా?

-నాగ్‌ మేడేపల్లి