Advertisement


Home > Politics - Gossip
ఓటుకి 5 వేలు: ఔనా.? నిజమేనా.?

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు సర్కార్‌ ముందే జాగ్రత్తపడింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 'పిల్లిమొగ్గలు' వేసేసింది నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ప్రకటన వచ్చాక హంగామా గురించి కొత్తగా చెప్పేదేముంది.? 

గతంలో చంద్రబాబు, నంద్యాల వెళ్ళినప్పుడు 'ఓటుకు ఐదు వేలు నేను ఇవ్వలేనా.?' అంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఏదో యధాలాపంగా చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారనుకోవడానికి వీల్లేదు. జనాన్ని చంద్రబాబు ఆ స్థాయిలో అంత తక్కువగా అంచనా వేశారన్నది నిర్వివాదాంశం. ఓ పక్క ఓటుకు ఐదు వేలని సంకేతాలు ఇవ్వడం, ఇంకోపక్క నాకు ఓటెయ్యకపోతే నేను వేసిన రోడ్ల మీద నడవొద్దు, నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకోవద్దని ఓటర్లను బెదిరించడం.. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగింది. 

బతిమాలడం, బెదిరించడం.. ఇవేవీ కాకపోతే ప్రలోభపెట్టడం.. ఇలా సాగుతోంది నంద్యాలలో అధికార పార్టీ వ్యవహారం. ఇంతకీ, నంద్యాలలో ఓటుకు పలికే మేగ్జిమమ్‌ రేటెంత.? చంద్రబాబు చెబుతున్నట్లు ఐదు వేలు మాత్రమేనా.? అంతకు మించి వుంటుందా.? మొన్నామధ్య రాజధాని అమరావతి పరిధిలో జస్ట్‌ ఓ వార్డు మెంబర్‌ పోస్ట్‌ కోసం ఓటుకు ఏడు వేలు ఖర్చు చేసింది అధికార తెలుగుదేశం పార్టీ. దాంతో పోల్చితే, నంద్యాలలో ఓటు ఖరీదు ఏడు వేలు అంతకు మించి పలకొచ్చన్నది ఓ అంచనా. 

పోనీ, ఓటుకు పది వేల చొప్పున అనుకున్నా.. అది రెండేళ్ళ కాలానికి కూడా కాదు.! 2019లో మళ్ళీ ఎన్నికలొచ్చేస్తాయి. ఏడాదికి ఐదు వేలు.. నెలకి 4 వందల రూపాయలన్నమాట. రోజుకి అటూ ఇటూగా పదమూడు రూపాయలు మాత్రమే. ఈ తరహా లెక్కలతో సోషల్‌ మీడియాలో, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద రచ్చే జరుగుతోంది. 'చంద్రబాబు అండ్‌ టీమ్‌ డబ్బు సంచులతో వస్తున్నారు జాగ్రత్త.. ఇక్కడే మీరు లౌక్యం ప్రదర్శించాలి..' అంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. 

'వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మీకు నచ్చినవారికి వెయ్యండి..' అంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడం ఈ మధ్య కొత్త ట్రెండ్‌గా మారింది. ఊరకనే ఇచ్చేస్తారేంటి.? దేవుళ్ళ మీదా, పిల్లల మీదా ఒట్లు వేయించడం వంటివి కూడా జరుగుతుంటాయి. అన్నట్టు, ఒక్కోసారి డబ్బులిస్తామని చెప్పి, దొంగనోట్లు పంచే మహానుభావులూ కన్పిస్తారండోయ్‌. ఎన్నికల సిత్రాలు ఇలాగే వుంటాయి. చెప్పుకుంటే అదో పెద్ద ప్రసహనం.

ఒక్కటి మాత్రం నిజం.. ఓటర్ల లెక్కలు ఓటర్లకు వుంటాయి. ఓటుకి ఐదు వేలు పంచినా, పదివేలు పంచినా.. ఎవర్ని గెలిపించాలని ఓటర్లు డిసైడ్ అయితే వాళ్ళే గెలుస్తారు.. డబ్బు సంగతంటారా.? దాని ప్రభావం లేదని, వుండబోదని చెప్పలేంగానీ, ఆ ప్రభావం చాలా తక్కువే.