cloudfront

Advertisement


Home > Politics - Gossip

వారెవ్వా.. ఏం స్క్రిప్ట్.. ఏం స్క్రిప్ట్

వారెవ్వా.. ఏం స్క్రిప్ట్.. ఏం స్క్రిప్ట్

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైకాపా, జనసేన ఇలా ఏ పార్టీ అయినా సరే, అంతిమ లక్ష్యం ఏమిటి?

అధికార సాధన. అందుకోసం ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? వ్యూహాలు రచిస్తుంది. ఎత్తుగడలు వేస్తుంది.

ఇది కాదనలేని సత్యం. జనతా ప్రయత్నం 70వ దశకంలో ఎందుకు జరిగింది? ఇందిరా గాంధీని ఒంటరిగా ఓడించలేక, అన్ని పార్టీలు కలిసి ఏకమై, అధికారం సాధించేందుకు.

ఓడిపోయిన ఇందిరా గాంధీ మళ్లీ గెలిచేందుకు ఏం చేసింది? ఏకమైన నాయకులను చీల్చి, జనతా ప్రయోగం విఫలమయ్యేలా చేసింది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎందుకు స్టార్ట్ చేసారు. అధికారం చేపట్టడానికేగా? ఆంధ్రుల ఆత్మగౌరవం రెచ్చగొట్టడం అనే స్కీముకు ఎందుకు తెరతీసారు? ప్రజలను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికేగా?

చంద్రబాబు కొంత కాలం ఓపిగ్గా వుండి. సమయం చూసి విశాఖలో తిరుగుబాటు బావుటా ఎగరవేసి, వైస్రాయ్ లో ఎమ్మెల్యేలను పెట్టి, ఎన్టీఆర్ ను గద్దె దింపింది ఎందుకు? అధికారం చేపట్టడానికేగా?

జగన్ కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి, తన పార్టీ తాను పెట్టుకుని, కిందా మీదా అవుతున్నది ఎందుకు? అధికారం కోసమేగా?

ఎవ్వరూ, ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా ప్రజల కోసమో, ప్రాంతం కోసమో, దేశం కోసమో కాదు, అంతిమ లక్ష్యం అధికారం కోసమే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..

ఓ సినిమా నటుడు ఈ ఉదయం ఓ టీజర్ వదిలారు. సాయంత్రానికి బ్రహ్మడమైన రహస్యం వెల్లడిస్తానని. సాయంత్రం సినిమా చూపించేసారు. ఓ అద్భుతమైన స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ నెరేట్ చేసారు. దాని అంతిమ లక్ష్యం ఒక్కటే, పేర్లు వెల్లడించకపోయినా, భారతీయ జనతా పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీని అన్ని విధాలా నాశనం చేసి, ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ఆపరేషన్ గరుడ అన్నది ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ముందు జగన్, పవన్ ల ద్వారా, తమ చేతిలో వున్న అధికారం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టి, ఆపైన జగన్ ను జైల్లో తోసి, పవన్ ను సినిమాల్లోకి తోసి, తాము అధికారం తీసుకుంటుంది.  ఇదీ ఆయన అన్యాపదేశంగా చెప్పింది.

దీనికి ఆయన సొగసైన సెంటిమెంట్ ను బలంగా అద్దే ప్రయత్నం చేసారు. తెలుగు జనులు మోసపోవద్దని, తెలుగువాళ్లు కష్టాల పాలవ్వద్దని, తెలుగు వాళ్లు కొట్టుకోవద్దని ఇలా రకరకాలుగా. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఆ జాతీయ పార్టీ ఇంతా చేసిన తరువాత అధికారం చేపట్టేది తెలుగు వాడేనా? లేక నార్త్ వాళ్లు వచ్చి ముఖ్యమంత్రి అవుతారా?

చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ, దాని నాయకులు, కుల గురువులు, మీడియా మేధావులు కలిసి 2014లో హోదా, రాజధాని, విభజన అనే సెంటిమెంట్లు రగిలించవచ్చు. దానికి ఏ ఆపరేషన్ పేరూ లేదు. కానీ దిగ్విజయంగా అందరూ కలిసి వ్యూహరచన చేసి అధికారం చేపట్టవచ్చు.

మళ్లీ 2019 వచ్చేసరికి ఇన్నాళ్లు పక్కన పడేసిన హోదా, అస్సలు హోదా ముఖ్యమే కాదన్న సంగతి మరిచిపోయి, హోదా నా ప్రాణం, హోదా నా లక్ష్యం అంటూ కొత్త సెంటిమెంట్ రగులుస్తూ, అడ్డం తిరిగిన పవన్ కళ్యాణ్ పై వీలయినంత బురద జల్లుతూ, ఇన్నాళ్లు తాము అంటకాగిన భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కొత్తగా జగన్ కు అక్రమ సంబంధం అంటగడుతూ, అదో ఘోరాపరాధం అన్న కలరింగ్ ఇస్తూ, వ్యూహాలు రచిస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? ఇదంతా అధికార సాధన కోసం కాదా? ఈ ఆపరేషన్ లో బదనామ్ అవుతున్న పవన్, జగన్ తెలుగువారు కాదా?

ఆపరేషన్ గరుడ, ద్రవిడ, రావణ, కుమార ఇలా పేర్లు చెబుతూ, అసలు పేర్లు చెప్పనంటూనే సరైన, పక్కా క్లూస్ ఇస్తూ, మొత్తం మీద చెప్పినదేమిటి?

రెండే విషయాలు ఒకటి తెలుగుదేశం పార్టీని కూలదోస్తారు. ఆపై జగన్ ను, పవన్ ను పక్కకుతోసి, భాజపాలోని ఆంధ్ర కీలక నాయకుడు ఒకరు సిఎమ్ అవుతారు.

ఇదంతా రాజకీయం కాదా? చంద్రబాబు చేస్తేనే రాజకీయం. చతురత. వ్యూహ రచన. మిగిలిన వారు చేస్తే ద్రోహం. ప్రజా ద్రోహం. తెలుగు వారికి ద్రోహం. అంతనా? చెప్పదలుచుకున్నది?

ఎంత గొప్ప స్క్రీన్ ప్లే రాశారు. ఎంత గొప్ప స్క్రిప్ట్ అల్లారు. శహభాష్. తెలుగుదేశం పార్టీకి బోలెడు సెంటిమెంట్ రప్పించేందుకు, తెలుగువాళ్లను రెచ్చగొట్టేందుకు, భాజపాను బదనామ్ చేసేందుకు ఎంత గొప్ప రచనా చమకృతి..

సూపర్.. సూపరంతే.