cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘ఎర్ర గులాబీలు’ : ఓకే! ఓడుతాం... మాకేమిస్తారు?

‘ఎర్ర గులాబీలు’ : ఓకే! ఓడుతాం... మాకేమిస్తారు?

తెరాస రాజకీయాల్లో ఇది విచిత్రమైన పరిస్థితి. 119 స్థానాల్లో వంద గెలుస్తాం అని ఒకవైపు గంభీరంగా ప్రకటిస్తూనే... నిజానికి 112 స్థానాల్లో తెరాసకు మొగ్గు ఉన్నదని గులాబీబాస్ చంద్రశేఖర రావు అంటున్నారు. మిగిలిన ఏడు స్థానాల్లో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు.. అని కూడా ఆయన అసెంబ్లీ టికెట్లు ప్రకటించినప్పుడే తెగేసి చెప్పేశారు. అంటే టికెట్లు ఇవ్వవచ్చుగాక... తమ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని ఆయన ముందుగానే దీవిస్తున్నారన్నమాట.

అయితే ఇతర పార్టీల పట్ల అంత చులకనగా వ్యవహరిస్తూ ఉండే కేసీఆర్ ఏడు సీట్లలో గెలిచే పార్టీగా ఎవరికి కితాబిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అది మజ్లిస్ పార్టీనే. మజ్లిస్ తో మాకు స్నేహబంధం ఉంది అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. మా మీద ప్రతిపక్షాలు కుట్ర చేసినప్పుడు వారు మాకు అండగా నిలిచారు. అయినా సరే.. వారి నియోజకవర్గాల్లో మా తరఫు నుంచి స్నేహపూర్వక పోటీ మాత్రమే కొనసాగుతుంది... అని ఆయన చెప్పారు.

సదరు మజ్లిస్ స్థానాల్లో కొన్నింటికి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశారు. మిగిలిన స్థానాలకు... ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉన్న, అత్యంత బలహీనమైన అభ్యర్థుల కోసం కేసీఆర్ వెతుకులాడుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో మజ్లిస్ ను గెలిపించే అసమర్థులే ఆయనకు ఇప్పుడు కావాలి.

ఏడే నియోజకవర్గాలు కావొచ్చు.. టికెట్ తీసుకుంటున్నప్పుడే ఓడిపోవడానికి సిద్ధపడి వచ్చే వారి గురించి ఏం అనుకోవాలి? ఎమ్మెల్యేగా పోటీచేయడం అంటే.. ఎంత పరిమితంగా ఖర్చుపెట్టినా.. కోటిరూపాయలకు పైగా వ్యయం చేరుకుంటుంది. మరి ఓడిపోయి పరువు నష్టం కలిగించుకోవడానికి అంత డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడి వచ్చే వారెవరుంటారు?

ఇక్కడే ప్రస్తుతం బేరాలు నడుస్తున్నాయి. ‘‘పార్టీ ఆదేశాల మేరకు ఆ ఏడు నియోజకవర్గాల్లో మేం పోటీచేసి ఓడిపోతాం సరే... దానివల్ల మాకు లాభమేంటి?’’ అనే ప్రశ్న వినిపిస్తోంది. తమకు ఏ రకంగా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తారో చెబితే.. నిల్చుని ఓడిపోవడానికి సిద్ధం అంటూ అభ్యర్థులు గులాబీ అధిష్టానానికి బేరం పెడుతున్నారట.

ముందే ఓ మాట అనుకుంటే.. ఓడిపోయిన తర్వాత.. కాంట్రాక్టులు ఇస్తారా.. ఎమ్మెల్సీ లాంటి పదవి ఇస్తారా? అనేది బేరాలాడుకునే పనిలో ఉన్నారట... సదరు ‘ఓటమి గుర్రాలు’!