cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ పిచ్చి పవన్ కు ఎవరు ఎక్కించారో గానీ..!

ఈ పిచ్చి పవన్ కు ఎవరు ఎక్కించారో గానీ..!

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అనేది ఒకప్పటి సామెత. ట్వీట్లు చేస్తే ఓట్లు రాలుతాయా అనేది నేటి సామెత. అవును మరి... ట్వీట్లను చాలా అందంగా వండి వార్చినంత మాత్రాన... సదరు ట్వీట్లను వండడానికి, వాటికి చాలా ప్రత్యేకమైన హ్యాష్ ట్యాగ్ లు (#)  పెట్టడానికి నిపుణులైన... ఆ విధమైన సోషల్ మీడియా అనుభవం ఉన్న కుర్రాళ్లను పెట్టుకుని, వారిద్వారి పొడి భాషలో తమ అభిప్రాయాలను రాయించి పోస్టు చేయించినంత మాత్రాన ఏం జరుగుతుంది? మహా అయితే ఆప్తులు కొందరు రీట్వీట్లు చేస్తారు! లైకులు, షేర్లను హోరెత్తిస్తారు! అంతేతప్ప.. ఆ లైకులు ఓట్లుగా మారవ్ కదా! ఈ సంగతి జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుసో లేదో అనుకోవాల్సిన పరిస్థితి.

పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ట్వీట్ చేయమని పిలుపు ఇచ్చి.. దానికి స్పందనగా 24 గంటల్లో 74 లక్షల ట్వీట్లు వచ్చేశాయని ఇదో అద్భుతం అని జనసేన చాటుకుంది. ఈ వెర్రి ఇలా ఉన్నదేమిటా అని ఆశ్చర్యపోతుండగానే.. ఆ స్పందన చూసి హుషారెక్కిన పార్టీ నేతలు సభ్యత్వ నమోదు కోసం కూడా అలాంటి పిలుపే ఇచ్చారు.

పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ సభ్యత్వ నమోదుల్ని హోరెత్తించాలనేది ఆ పిలుపులోని సారాంశం. వారు కోరుకున్న ప్రకారం.. ప్రతి కాలేజీ విద్యార్థి తన స్మార్ట్ ఫోనులో యాప్ డౌన్ లోడ్ చేసుకుని, ఓటరు కార్డు నమోదుతో సహా సభ్యుడుగా మారాలి. కాలేజీలోని సహ విద్యార్థులందరితోనూ (ఒక్కొక్కరూ వందమందిని చేర్చాలన్నమాట) అలా సభ్యత్వాలు చేయించాలి. ఈ పని ‘లంచ్ బ్రేక్ లో’ చేయాలని పవన్ కల్యాణ్ సూచించినట్లుగా సదరు పిలుపులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

అనగా.. తమ్ముళ్ల చదువులు పాడైపోకూడదని పవన్ అన్నయ్య ప్రత్యేకశ్రద్ధ పెడుతూ.. అలా కోరుకుంటున్నారన్న మాట. ఆ తర్వాత.. సాయంత్రం ఇంటికెళ్లిపోయి.. మళ్లీ స్మార్ట్ ఫోను పట్టుకుని ఇరుగు పొరుగు ఇళ్లన్నింటికీ వెళ్లి.. వారందరితోనూ సభ్యత్వాలు నమోదు చేయించాలట. పైగా రాష్ట్రమంతా.. కుర్రాళ్లు వాళ్ల ఇళ్ల దగ్గర ఓ జెండా దిమ్మెలు కట్టి.. పార్టీ జెండాలు ఎగరేయాలంట. రాష్ట్రంలో అలా వెయ్యి జెండాలు ఉండాలట.

8, 9 తేదీల్లో 10 లక్షలు చేసేయాలనేది వారి టార్గెట్! 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటలలోగా ఆ పని ఫినిష్ చేయమని సూచించారు. ఆ రకంగా అత్యల్ప వ్యవధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించినట్లు రికార్డు సృష్టించేద్దాం అని అనుకున్నారు. మొత్తానికి జనసైనికుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు. వారంతా జెండా దిమ్మెలు కట్టారో లేదో, గడపగడపకూ తిరిగి సభ్యత్వాలు చేశారో లేదో తెలియదు.

గడువు పూర్తయింది. అనుకున్నట్లు 10లక్షల సభ్యత్వాలు వచ్చి ఉంటే.. ఈ 10వతేదీ మధ్యాహ్నం లోగానే  ప్రెస్ నోట్ వచ్చి ఉండాల్సింది. కానీ పార్టీ వర్గాలు కిమ్మనకుండా ఉన్నాయి. అంతా కంప్యూటర్ లో వ్యవహారమే గనుక.. చేసిన ప్రకటనకు ఆధారాలు చూపించమని అడిగే దిక్కు ఉండదు గనుక... అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం అని ఒక ప్రకటన వచ్చేసినా రావచ్చునని పరిశీలకులు అనుకుంటున్నారు.