cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీలో.. ఎవరు ఎవరితో కలవబోతున్నారు?

ఏపీలో.. ఎవరు ఎవరితో కలవబోతున్నారు?

అప్పుడెప్పుడో కమ్యూనిస్టులు పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకుని కనిపించారు.. సినీ గ్లామర్ తో నాలుగు ఓట్లు రాల్చుకుందామని మార్క్సిస్టులు ఆశపడటం వారి భావదారిద్ర్యం. రాష్ట్ర విభజనతో ప్రాతినిధ్యం కోల్పోయిన వాళ్లు ఉనికి పాట్లు పడుతూ ఉన్నారు. ఈ పాట్ల మధ్యన పవన్ కల్యాణ్ వాళ్లకు ఆశాకిరణంలా కనిపించాడు. దీంతో పవన్ తరఫున వకల్తాపుచ్చుకుని టీవీల్లో వాదించారు.

అయితే వాళ్లకు పీకే ఝలక్ ఇచ్చాడు. మళ్లీ చంద్రబాబుతో సన్నిహితంగా మెలగడంతో కమ్యూనిస్టులు డైలమాలో పడిపోయారు. అయితే.. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు చేతులు కలిపేలా కనిపిస్తూ ఉన్నారు. అయితే.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సీట్ల చర్చ చేశాడని, పవన్ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి బాబు నిరాకరించడంతోనే పవన్ బాబుకు వ్యతిరేకంగా మారుతున్నాడు అనేది ఇన్ సైడ్ టాక్.

ముప్పై ఎమ్మెల్యే సీట్లు అడిగిన పవన్ కు అన్ని సీట్లు ఇవ్వమని.. ఐదారు సీట్లు ఇస్తామని చంద్రబాబు అన్నారట.. మరీ అంత చీప్ గా తీసేయడంతో పవన్ కు కోపం వచ్చిందని సమాచారం. మరి చంద్రబాబు పీకేని ఇలా వదిలేస్తాడా? లేక మళ్లీ సీట్ల బేరం కొనసాగించి.. 15సీట్ల స్థాయికి తెగ్గొట్టి మళ్లీ తన వైపుకు తిప్పుకుంటాడా? అనేది ముందు ముందు తేలే అంశం.

మరి అప్పుడు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఏమిటో మరి. అప్పుడు తమకూ చంద్రబాబు వీరముష్టిగా రెండు మూడు సీట్లు ఇస్తే.. కిమ్మనకుండా కూర్చోగలరా? బీజేపీతో బాబు తెగదెంపులు చేసుకున్నాడు కాబట్టి.. రెండు మూడు సీట్లు ఇచ్చినా చాలని అనగలరా? లేక.. అంతిమంగా పవన్ చంద్రబాబుతో సీట్ల బేరం కుదుర్చుకుని వెళితే.. కమ్యూనిస్టులు కామ్ గా ఉండిపోగలరా? ముందు ముందు తేలుతుంది వీళ్ల పరిస్థితి ఏమిటో.

ఇక భారతీయ జనతా పార్టీ.. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు ఈ పార్టీని విలన్ గా చేస్తున్నాడు. తన నాలుగేళ్ల వైఫల్యాలు అన్నింటికీ బీజేపీనే కారణం అని చూపించాలని బాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ పరిణామాలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. రామ్ మాధవ్ వస్తున్నాడు అంటున్నారు.. స్థూలంగా అయితే, ఏపీపై మోడీ, షాలకు పెద్దగా ఆశల్లేవు, అయితే ఇటీవల యూపీ వంటి రాష్ట్రాల్లో తగిలిన షాక్ లతో బీజేపీ చాలా రిపేర్లే చేసుకోవాలి.

అందులో భాగంగా.. ఏపీలో కూడా మళ్లీ సర్దుబాటు రాజకీయాలు చేసుకోవచ్చు. బీజేపీకి ఏ స్ట్రాటజీ కూడా లేదు.. అంటే, నమ్మలేం. ఇక ఇతర పార్టీలతో పొత్తుకు ఇష్టపడకపోవచ్చు జగన్ మోహన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీతో అస్సలు జత కట్టే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఎన్నికల ముందే హోదాను అనౌన్స్ చేస్తే.. అప్పుడు కొంత మేర ఛాన్సులున్నాయి. అప్పటికీ ఇది దుర్లభమైన అంశమే. కాంగ్రెస్ పార్టీ.. వీళ్లకూ ఇప్పుడు ఆశలు మొలకెత్తాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, పవన్ కల్యాణ్.. కలిసివెళ్లే స్కెచ్ వీళ్లది.

అయితే.. పవన్ ను చంద్రబాబు అలా వెళ్లనిస్తాడా? అనే దానిపై కాంగ్రెస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పది నుంచి ముప్పై వేల ఓట్లను తెచ్చుకున్న వాళ్లు కూడా ఇప్పుడు వైకాపా వైపువెళ్లిపోయారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ తో పొత్తు కూడా వీళ్లను రక్షిస్తుందనే నమ్మకం లేదు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది తర్వాతి అంశం. ప్రస్తుతానికి అయితే ఎవరు ఎవరితో కలిసి సాగుతారో ఊహించడం కూడా కష్టమే!