cloudfront

Advertisement


Home > Politics - Gossip

యడ్డీ పీఠాన్ని ఎగరేసుకు పోయేదెవరు?!

యడ్డీ పీఠాన్ని ఎగరేసుకు పోయేదెవరు?!

కర్నాటకలో ఇదివరకు భాజపా తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.... కేవలం యడ్యూరప్ప అవినీతినే ప్రధాన అస్త్రంగా చేసుకుని.. కాంగ్రెస్ ఎడాపెడా చెలరేగుతూ భాజపా మీద విమర్శల జడివాన కురిపించినప్పటికీ... పార్టీ మాత్రం ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ కన్నడ ఎన్నికల సమారంగణంలో ముందుకు వెళ్లింది. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేయడం వలన కులపరమైన ఓట్లు కీలకంగా దక్కుతాయని భాజపా వేసిన పాచిక పారింది.

కానీ.. పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండాపోయిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. యడ్యూరప్ప సీఎం పోస్టును త్యాగం చేయాల్సి వస్తుందనే ఊహాగానాలు కన్నడనాట సాగుతున్నాయి. యడ్డీ సీఎం పోస్టు త్యాగానికి సిద్ధపడితేనే.. భాజపా ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమం అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. భాజపా అధిష్టానం యడ్యూరప్పకు కబురుపెట్టి.. ఢిల్లీలో జరిగే పార్టీ పార్లమెంటరీ భేటీకి హాజరు కావాల్సిందిగా పురమాయించడం కూడా.. ఆయనను బుజ్జగించడానికేననే పుకార్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

భాజపా తన పేరును అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిపోయినట్లుగానే ఊహించుకున్నారు. భాజపా ఏనాడూ ఆయన గురించి తేడాగా మాట్లాడకపోవడంతో అంతా నిజమే అని కూడా అనుకున్నారు. కానీ, ఇప్పుడు అధికార పీఠానికి కొన్నిసీట్ల దూరంలో ఆగిపోయిన నేపథ్యంలో, ఇతరులు కూడా రెండు స్థానాల్లో గెలిచి ఉన్న సందర్భంలో కొద్దిగా ఖర్చుకు వెనకాడకుండా.. పావులు కదిపితే గనుక.. భాజపా సర్కారు ఏర్పడడానికి అవకాశం పుష్కలంగా ఉంది. అయితే.. కొద్దిమంది ఎమ్మెల్యేల కోసం ఆ ఖర్చును భరించడానికి సిద్ధపడేది ఎవరు?

అదే ఇప్పుడు కీలకం. సాధారణ పరిస్థితుల్లో అయితే.. ఇలాంటి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే... బాజపా ప్రభుత్వం అంటూ ఏర్పడితే గనుక.. యడ్యూరప్పే ముఖ్యమంత్రి అవుతారని భాజపా అధిష్టానం ఈపాటికే ప్రకటించి ఉండాలి. కానీ, అలా జరగలేదు. యడ్యూరప్పను ఢిల్లీ పిలిపించడం అంటేనే.. ఏదో తెరవెనుక మంత్రాంగం జరుగుతున్నదని పలువురు అనుమానిస్తున్నారు.

యడ్యూరప్పకు దక్కవలసిన ముఖ్యమంత్రి పీఠాన్ని ‘గాలి’ కోటరీ చేజిక్కించుకోవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. యడ్డీ పేరును ప్రకటించినా.. పూర్తి మెజారిటీ రాలేదు గనుక.. ఆయన సీఎం పదవిపై ఆశలు తగ్గించుకోవాలని పార్టీ నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. అయితే అదే జరిగితే.. యడ్యూరప్ప వర్గం అగ్రహోదగ్రులవుతారనే సంకేతాలు కూడా ఉన్నాయి. అలాంటి సాహసానికి పాల్పడితే.. భాజపా ముసలాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుందా? లేదా, దేశవ్యాప్తంగా మోడీ హవా ప్రబలంగా ఉన్నదనే విశ్వాసంతో యడ్యూరప్ప అధిష్టానం మాటలకు తలొగ్గవలసి వస్తుందా? అనేది వేచిచూడాలి.