cloudfront

Advertisement


Home > Politics - Gossip

తిట్టించుకోవడానికి కూడా పవన్ పనికిరాలేదా?

తిట్టించుకోవడానికి కూడా పవన్ పనికిరాలేదా?

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత మోడీని బాగా తిడుతున్నారు చంద్రబాబు. దీనికి ప్రతిగా మోడీ కూడా గుంటూరు సభలో బాబును బాగానే ఏకి పారేశారు. అదేవిధంగా మొన్నటివరకు మోడీ-బాబుతో కలిసున్న పవన్ కల్యాణ్ కూడా వాళ్లిద్దర్నీ బాగా విమర్శిస్తున్నారు. కానీ గుంటూరు సభలో మోడీ మాత్రం పవన్ ను పట్టించుకోలేదు. విమర్శల మాట అటుంచి కనీసం పవన్ పేరు కూడా ప్రస్తావించలేదు.

పాచిపోయిన లడ్డూలిచ్చారు, దక్షిణాది సత్తాచూపుతా, కేంద్రం మెడలు వంచుతా.. ఇలా రకరకాల డైలాగులతో మోడీని టార్గెట్ చేశారు పవన్. దీంతో మోడీ కూడా పవన్ పై సెటైర్లు వేస్తారని అంతా భావించారు. కానీ గుంటూరు వచ్చిన మోడీ, చంద్రబాబుని చెడామడా తిట్టి పవన్ ని మాత్రం వదిలేయడం ఆశ్చర్యకరం. విమర్శించడానికి కూడా పనికిరాడని పవన్ ను మోడీ లైట్ తీసుకున్నారా లేక పవన్ ను ఇప్పటికీ తనవాడిగా ప్రధాని ఫీల్ అవుతున్నారా?

ఏపీలో బీజేపీ కాపు ఓట్లకు గాలం వేస్తోందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాపు నాయకులందర్నీ కమలదళంలో కలుపుకొనే ఎత్తుగడ కొంతమేరకు వర్కవుట్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కాపు వర్గానికి వెన్నుదన్నులా ఉన్నారు. పవన్ ని తిట్టి ఆ వర్గాన్ని దూరం చేసుకోవడం ఎందుకనే ఆలోచన కూడా మోడీకి ఉన్నట్టుంది. పవన్ పేరెత్తకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు.

కేంద్రాన్ని చులకన చేసి మాట్లాడుతూ, నిజ నిర్థారణ కమిటీలతో లెక్కలు తీస్తున్న పవన్ కల్యాణ్ ని కూడా మోడీ ఓ రౌండ్ వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు లాగే పవన్ కూడా రంగులు మార్చారని, అప్పుడు మద్దతు తెలిపి, ఇప్పుడు తమకు దూరంగా వెళ్లాడని అనాలి. కానీ అంచనాలకు భిన్నంగా మోడీ అసలు పవన్ ఊసే ఎత్తలేదు.

పవన్ ని లైట్ తీసుకున్నాడని అనుకోలేం కానీ, జనసేనానితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందం మాత్రం ఈ మీటింగ్ తో బైటపడిందని చెప్పొచ్చు. ఏదేమైనా జనసేనకి, పవన్ ప్రచార కార్యక్రమాలకి ఆర్థిక అండదండ బీజేపీయేననే ప్రచారం ఏపీలో ఉంది. మోడీ గుంటూరు పర్యటనతో ఈ ప్రచారానికి మరంత బలం చేకూరినట్టయింది.