Advertisement


Home > Politics - Gossip
నిర్మలా సీతారామన్‌ అంటే మోడీకి ఎందుకంత ఇష్టం?

నిర్మలా సీతారామన్‌. ఆమె విద్యాధికురాలు. ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఉన్నవారు. ఆమె తండ్రి తమిళనాడులో రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. జెఎన్‌యులో భారత యూరప్‌ వ్యాపారంపై ఎంఫిల్‌ చేశారు. స్వేఛ్చా మేధావుల సంఘం ఏర్పర్చి క్రియాశీలకంగా పనిచేశారు. అక్కడే ఆమెకు పరకాల ప్రభాకర్‌తో పరిచయం అయింది. పరకాల ప్రభాకర్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు ఆమె కూడా లండన్‌ వెళ్లి చిన్నాచితక ఉద్యోగాల్లో పనిచేశారు.

బీబీసీలో కూడా కొంతకాలం పనిచేశారు. ప్రభాకర్‌ హైదరాబాద్‌కు వచ్చి కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు వారిద్దరూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో అమె ప్రణవ అనే స్కూలును కూడా నడిపారు. బీజేపీ హయాంలో ఆమె జాతీయ మహిళా సభ్యురాలిగా పనిచేశారు. కమిషన్‌లో ఉన్నప్పుడు ఆమెకు సుష్మా స్వరాజ్‌తో పరిచయం ఏర్పడింది. సుష్మా స్వరాజ్‌ ప్రేరణతోనే ఆమె 2006లో బీజేపీలో చేరారు. అక్కడితోనే ఆమెదశ తిరిగింది.

బీజేపీలో ఆమె అరుణ్‌ జైట్లీకి సన్నిహితమయ్యారు. రెండు సంవత్సరాల్లోనే ఆమె  బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌లో మోడీ పాలనపై తీవ్ర విమర్శలు రేకెత్తుతున్న సమయంలో ఆమె వాటిని దీటుగా ఎదుర్కొన్నారు. దీనితో మోడీ దృష్టిని ఆకర్షించారు. అరుణ్‌ జైట్లీకి నోట్స్‌ అందించడం, మోడీ, అమిత్‌ షాలకు ఇంగ్లీషులో నివేదికలు, ప్రసంగాంశాలు అందించడం ద్వారా ఆమె వారికి సన్నిహితులయ్యారు. మోడీ 2014లో ప్రధానమంత్రి కాగానే ఆమె వాణిజ్య మంత్రిగా నియామకం అయ్యారు. గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి ఏర్పర్చిన థింక్‌టాంక్‌లో అమిత్‌ షా ఆమెను సభ్యురాలిగా నియమించారు.

వాణిజ్యమంత్రిగా ఆమె పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయం అడుగుజాడల్లో నడిచారు. కీలకనిర్ణయాలన్నీ ప్రధానిని సంప్రదించి తీసుకున్నారు. వాణిజ్యమంత్రిత్వ శాఖలో అవినీతికి తావులేకుండా చూశారు. వాణిజ్య వర్గాలు ఆమె చేసిన కృషిని ప్రశంసించాయి. వాణిజ్య మంత్రిగా అమె ప్రతిఫైలును క్షుణ్ణంగా చదివేవారు. డబ్ల్ల్యూటీవో, జీ-20లపై ఆమె తీవ్రంగా అధ్యయనం చేసారు. ఆయా చర్చల్లో భారత వాదనను సమర్థవంతంగా సమర్పించే స్థితికి ఎదిగారు. ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లేటప్పుడు ఆయా దేశాల వాణిజ్య సంబంధాలపై ఆమె క్లుప్తంగా, చక్కటి నోట్స్‌ తయారు చేసి ఇచ్చేవారు.

అయితే నిర్మలా సీతారామన్‌ ప్రధాని, అమిత్‌ షాల అండతో పార్టీలో సీనియర్లను పెద్దగా పట్టించుకోలేదు. తాను  బీజేపీలోకి రావడానికి కారణమైన సుష్మాను కూడా ఆమె లెక్క చేయలేదు. ఒకదశలో తెలంగాణ అంశంపై ఆమె సుష్మా స్వరాజ్‌తోనే విభేదించారు. నిర్మలా సీతారామన్‌ వంటి అధికార ప్రతినిధి ఉంటే వేరే శత్రువు అక్కర్లేదని సుష్మా స్వయంగా వ్యాఖ్యానించారు. అద్వానీ వర్గాన్ని అసలు ఆమె పరిగణనలోకి తీసుకోలేదు.

రాజకీయ వివాదాల్లోకి దిగలేదు. వెంకయ్యనాయుడు వంటి సీనియర్‌ ఆంధ్రా నేతను కూడా పట్టించుకోలేదు. వెంకయ్య ఎదురుగా వచ్చినా పక్కకు తప్పుకునేవారు. నిర్మలా సీతారామన్‌ మౌనంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదుగుతున్న వైనాన్ని ఒక్క అరుణ్‌ జైట్లీ తప్ప మిగతా నేతలు గమనించలేదు. ఆమెను రాజకీయాలతో సంబంధంలేని సామాన్య నేతగానే వారు భావించారు. ఆమె తమను పట్టించుకోకపోవడాన్ని పొగరుబోతుతనంగా భావించారు తప్ప దానివెనుక మోడీ, అమిత్‌ షాల ప్రోద్బలం ఉన్నదని గమనించలేదు.

నిజానికి గత మంత్రివర్గ విస్తరణ జరిపేటప్పుడు  మోడీ, అమిత్‌ షా సీనియర్‌ నేతలు కొందరి మనోభావాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. మనకు నిర్మలా సీతారామన్‌ రాజకీయంగా ఉపయోగపడదు కదా. ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగానే కొనసాగిస్తే మంచిదని వెంకయ్య, సుష్మా తదితరులు చెప్పారు. ఆమెను తొలగిస్తారన్న ప్రచారం చివరి రోజుల్లో ఉదృతమైంది. కాని సీనియర్‌లు అందరూ ఊహించని విధంగా నిర్మలా సీతారామన్‌ను కేంద్ర రక్షణమంత్రిగా నియమించారు. భారత ప్రభుత్వంలో ప్రధానమంత్రి తర్వాత హోంమంత్రి, ఆర్థికమంత్రి, రక్షణ మంత్రులకు ప్రాధాన్యత ఉంటుంది.

అంటే మొదటి నలుగురు ముఖ్యమైన నేతల జాబితాలో ఆమె చేరారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన అంశాలన్నిటిపై ఆమె ద్వారా మోడీ డీల్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాక దేశ భద్రతా వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీలో ఆమె ప్రధానమంత్రి, హోంమంత్రి, విదేశాంగమంత్రితో పాటు సభ్యురాలయ్యారు. ఆమెకు లభించిన అవకాశం వెంకయ్యకు కూడా లభించలేదు.

గతంలో టెక్నోక్రాట్‌ అయిన మనోహర్‌ ఫరిక్కర్‌ను రక్షణమంత్రిగా నియమించి రక్షణశాఖలో మోడీ అనేక ప్రక్షాళనా కార్యక్రమాలను అమలు చేశారు. కాని ఆరునెలల క్రితం ఆయన రాజకీయ కారణాల వల్ల గోవా వెళ్లాల్సి రావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే నిజాయితీ గల నేత మోడీకి కనిపించలేదు. ఒకదశలో వెంకయ్యనాయుడు పేరు కూడా రక్షణమంత్రిగా పరిశీలనలోకి వచ్చినప్పటికీ పబ్లిసిటీ మోహం ఉన్న వెంకయ్య ఆ శాఖకు వస్తే తనకు పబ్లిక్‌లోకి వెళ్లే అవకాశం ఉండదని గ్రహించి దాన్ని వద్దని చెప్పారు. దీనితో వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపించారు. సుష్మాస్వరాజ్‌ పేరు కూడా రక్షణమంత్రి పదవికి వినపడింది. కాని ఆమె కూడా ససేమిరా అన్నట్లు సమాచారం.

నిర్మలా సీతారామన్‌ను రక్షణమంత్రిగా నియమించడం ద్వారా మోడీ పార్టీలో సీనియర్‌లకు మీరింక అవసరం లేదనే స్పష్టమైన సంకేతాలు పంపించారు. తాను తనకు అవసరమైన టీమ్‌ను ఏర్పాటు చేసుకోగలనని వారికి చెప్పారు. ఇప్పటికే సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లకు పార్టీలో పెద్దగా ఉనికి లేకుండా పోయింది. 2019 నాటికి వారిని మోడీ కొనసాగించబోరన్న విషయం స్పష్టం అయింది. సుష్మా స్వరాజ్‌కు 65 సంవత్సరాలు, రాజ్‌నాథ్‌ సింగ్‌కు 66 సంవత్సరాలు ఉండగా, అరుణ్‌ జైట్లీకి 64 సంవత్సరాలే. ప్రభుత్వంలో 70 సంవత్సరాలు దాటిన వారిని చేర్చుకోబోమని ఇప్పటికే మోడీ పలుసార్లు సీనియర్లకు చెప్పారు. ఈ రీత్యా అరుణ్‌ జైట్లీ అందరికన్నా చివరిగా రిటైర్‌ అవుతారు.

నిర్మలా సీతారామన్‌ రక్షణ మంత్రి కావడం చైనా, పాకిస్తాన్‌లకు కూడా సంకేతాలు పంపినట్లయింది. మిమ్మల్ని ఎదుర్కోవడం మాకు కష్టంకాదని మోడీ ఆ దేశాలకు చెప్పకనే చెప్పారు. ఏమైనా నిర్మలా సీతారామన్‌ నియామకం చాలామంది మంత్రులకు, ఎంపీలకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పకతప్పదు. ఏమిటి ఆమె ప్రత్యేకత? అసలెందుకు ఆమెకు మోడీ, అమిత్‌ షా అంత విలువ ఇస్తున్నారు? ఆమె వల్ల ఆంధ్రాలో కాని, తమిళనాడులో కాని ఒక్కఓటు కూడా వస్తుందా? 283 మంది నేరుగా ఎన్నికైన లోక్‌సభ ఎన్నికల్లో లేని ప్రత్యేకత నిర్మలా సీతారామన్‌లో ఏమున్నది? టీవీ తార అయిన స్త్మతీ ఇరానీలో ఉన్న ఆకర్షణ కూడా నిర్మలా సీతారామన్‌లో లేదే? ఈ ప్రశ్నలకు వారికి సమాధానం లభించడం లేదు.

బీజేపీలో సరైన సమర్థత గల, మచ్చలేని నాయకులు లేనందువల్లే నిర్మలా సీతారామన్‌ వంటి మేధో నేపథ్యం, పరిజ్ఞానం, భాషా పాటవం ఉన్న నేతలు మోడీకి కనిపించారు. అందుకే ఆయన తన ఎంపీలపై కాక నిర్మలా సీతారామన్‌ వంటి నోట్స్‌ రాయగల నేతలపై, ఐఏఎస్‌ అధికారులపై ఆధారపడుతున్నారు. కాని ఇది  బీజేపీలో రాజకీయ నాయకులకు అసంతృప్తి కలిగించదా? రాజకీయాలకు అతీతంగా ఉన్న వారితో ఒక పార్టీని, ప్రభుత్వాన్ని తమ ఇష్టారాజ్యంగా నడపడం సాధ్యమా? 2019 ఎన్నికలపై ఇది ప్రభావం చూపించదా? వేచి చూడాల్సిందే.