Advertisement


Home > Politics - Gossip
ప్రజల్ని క్యాంపుల్లో పెడ్తారా అహ్మద్ జీ!

మొత్తానికి చచ్చీ చెడీ గుజరాత్ లో అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీగా విజయం సాధించారు. దీంతో సోనియా కోటరీ మొత్తం సంబరాల్లో మునిగిపోయినట్టే లెక్క. తన రాజకీయ కార్యదర్శిని అహ్మద్ పటేల్ ను అయిదోసారి రాజ్యసభకు పంపాలని పట్టుదలగా అనుకున్న సోనియా, అందుకోసం పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి.. గుజరాత్ ఎమ్మెల్యేలు అందరినీ క్యాంపులకు తరలించి.. మరోవైపు ఎన్సీపీ జేడీయూ ఓట్లకు కూడా ఎరవేసి, పోలింగ్ తర్వాత కూడా పెద్ద హైడ్రామా నడిపించి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు రెండు క్యాన్సిల్ చేయించి... ఎలాగోలా అహ్మద్ పటేల్ గట్టున పడ్డారు. ఊపిరి పీల్చుకుని సత్యమేవ జయతే అంటూ ట్వీట్ కూడా పెట్టారు. 

కానీ ఆయన విజయం అనంతరం మరో కామెడీ మొదలవుతున్నది. ఈ విజయం తరువాత తన తర్వాతి టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అని అహ్మద్ పటేల్ అంటున్నారు. అలాగే.. ఇప్పుడు తాను సాధించిన  విజయం సాధారణమైంది కాదని కూడా సెలవిస్తున్నారు. ఆ మాట మాత్రం నిజమే. ఈ విజయానికి పడినన్ని కష్టాలు, ప్రయాస బహుశా కాంగ్రెస్ చరిత్రలో మరే ఎన్నికకూ పడి ఉండకపోవచ్చు. 44మంది ఎమ్మెల్యేలను క్యాంపుల్లో బంధించి... వారి సెల్ ఫోన్లు కూడా లాగేసుకుని, వారి నియోజకవర్గల్లో ప్రజలు వరదల్లో అవస్థలు పడుతోంటే.. కనీసం పరామర్శకు కూడా వారిని వెళ్లనివ్వకుండా ఆపేసి.. నానా పాట్లు పడితే.. అప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్  చేశారు. ఇతర పార్టీల ఓట్లు కూడా వేయించుకోబట్టి.. మొత్తానికి అహ్మద్ ఎన్నికల సంఘం సహకరించిన పుణ్యమాని.. మ్యాజిక్ ఫిగర్ 44 ఓట్లతో గట్టున పడ్డారు. 

అయితే ఈ విజయం ద్వారా.. కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రజలు బ్రహ్మరథం పట్టేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. ‘నా తర్వాతి టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే’ అని అహ్మద్ చెప్పడం మాత్రం కామెడీగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అంటే.. 44 మందిని రిసార్టుల్లో నిర్బంధించినట్లు కాదని ఆయనకు అర్థమౌతున్నదో లేదోనని జనం అనుకుంటున్నారు. లేదా ఓటర్లందరినీ కూడా.. తీసుకెళ్లి బెంగుళూరు క్యాంపుల్లో పెడతారా అని జోకులేసుకుంటున్నారు. 

ఈ ఎన్నికలో విజయం సాధించి ఉండవచ్చు గానీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుజరాత్ లో విపరీతమైన అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ ఒక్క రాజ్యసభ ఎంపీ సీటుకోసం.. రాష్ట్రంలో వరదలు వస్తే.. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఇక్కడ లేకుండా.. క్యాంపుల్లో ఉంచి తమ స్వార్థాన్నే చూసుకున్నారనే అపప్రథ ఉంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పరువు దక్కించుకోవాలంటే.. ఇలాంటి అపకీర్తిని చెరిపేసుకుని, ఆ తరువాత.. జనాదరణను కూడా పెంచుకోవాలి. ఇప్పటికే 57 మంది ఎమ్మెల్యేల బలం తమకు మొన్నటివరకు ఉండగా.. ఇవాళ కేవలం సొంత ఓట్లు 42 మాత్రమే దక్కాయంటేనే అక్కడికే కాంగ్రెస్ కు కొంత క్లారిటీ రావాలి. మరైతే.. నెక్ట్స్ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికల విజయమే అని స్టేట్ మెంట్లు ఇవ్వడం ఎందుకు అని జనం ఆశ్చర్యపోతున్నారు.