Advertisement

Advertisement


Home > Politics - Gossip

పోలవరం నుంచి కేంద్రం తప్పుకుంటుందా?

పోలవరం నుంచి కేంద్రం తప్పుకుంటుందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి పక్కకు తప్పుకోవడానికి కేంద్రం కొత్తగా వ్యూహరచన చేస్తున్నదా? రాష్ట్ర విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. నిధులు కేటాయించడంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త భయాలను రేకెత్తించేలా చేస్తున్న మోడీ సర్కారు.. పూర్తిగా కాడి పక్కన పడేయనుందా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇటీవలే భాజపాలోకి ఫిరాయించి, ప్రస్తుతం ఏపీలో కీలక కమల నాయకుల్లో ఒకరిగా వెలుగుతున్న సుజనాచౌదరి మాటలు అలాగే కనిపిస్తున్నాయి.

సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి భాజపాలోకి మారిన తర్వాత.. ఏపీలో క్రియాశీలంగా కనిపిస్తున్నారు. అక్కడ భాజపాను గేరప్ చేసే బాధ్యతను ఆయన కొంతవరకు భుజానికెత్తుకున్నట్లుగానే కనిపిస్తోంది. పార్టీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన విజయవాడలో అడుగుపెడితే చాలు.. ఆయనకంటె ఎంతో సీనియర్ లు అయినా కమల నాయకులు కూడా.. దడికట్టి స్వాగతించి మరీ ఆయన ప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నారు.

తాజాగా కూడా సుజనా చౌదరి జగన్ ప్రభుత్వం పాలన మీద మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతున్నదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ జగన్ ప్రభుత్వం తెచ్చిన నిబంధన పట్ల రాష్ట్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతోంటే... ఇటు సుజనా మాత్రం.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీనివలన వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కు వెళతారని అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

వీటిని మించి పోలవరం గురించి ఆయన చెబుతున్న మాటలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. కాంట్రాక్టరును మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనినవల్ల నిర్మాణం మీద ప్రభావం పడుతుందని.. జగన్ సర్కారుకు ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే ఆలోచన లేదని విమర్శించారు. పోలవరం విషయంలో కేంద్రం కూడా ఆలోచన చేస్తున్నదని, వారంలోగా ఓ నిర్ణయం తీసుకుంటుందని కూడా సుజనా చౌదరి వెల్లడించారు. సుజనా మాటలను బట్టి.. పోలవరం నిర్మాణం నుంచి కేంద్రం పక్కకు తప్పుకుంటుందేమో అనే భయాలు కలుగుతున్నాయి.

కాంట్రాక్టరును మార్చడం సరికాదు అని భాజపా భావిస్తే... మరో రకమైన నిర్ణయం తీసుకోడానికి కూడా అవకాశం ఉంది. నిజానికి మోడీ సర్కారుకు ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ ఉంటే గనుక.. రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేకుండా పూర్తి నిర్మాణ బాధ్యత తామే తీసుకుంటామని ప్రకటించవచ్చు. కానీ.. అలా జరుగుతుందా అనేది సందేహం. ఈ విషయంలో వారంలోగా కేంద్ర భాజపా సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. 

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?