Advertisement


Home > Politics - Gossip
జగన్ కు మద్దతుగా పవన్ ట్వీట్ చేస్తాడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అత్యావశ్యకం. తమంతగా చొరవ తీసుకుని.. కేంద్రంతో పోరాడి దాన్ని సాధించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా.. అదేమీ జిందా తిలిస్మాత్ కాదని సెటైర్లు వేస్తున్నా.. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందనేది ప్రజలు ఎరిగిన సత్యం.

అయితే ఈ రాష్ట్రంలో రాజకీయంగా హోదా కోసం పోరాడడం అనే మాటను బలంగా వినిపిస్తున్నది వైసీపీ జనసేన మాత్రమే. వైసీపీ తొలినుంచి హోదా కోసం ఇదే పోరాట పటిమ చూపిస్తుండగా, ఇటీవల కాలంనుంచి బహిరంగసభలతో యాక్టివేట్ అవుతున్న జనసేన అధినేత కూడా ప్రసంగాల్లో హోదా గురించి మాట్లాడుతున్నారు. అయితే వారు ఇప్పటిదాకా ఎలాంటి ప్రత్యక్ష పోరాటం కూడా ప్లాన్ చేసినట్లుగా కనిపించడంలేదు. 

కొన్నిరోజుల కిందట జనసేన పార్టీ ప్రతినిధులు.. ప్రత్యేకహోదాకోసం అవసరం అయితే జగన్ తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమేనంటూ ప్రకటించడం ఒక మంచి పరిణామం. రాష్ట్రంలో రెండు బలమైన శక్తులు కలిసి కట్టుగా ఒకే ప్రయోజనం కోసం పోరాడినట్లయితే ఫలితం తేలుతుందేమోననే ఆశ ప్రజల్లో కలగడం కూడా సహజం. అయితే పవన్ కల్యాణ్ క్రియాశీల పోరాటంలోకి ఎప్పటికి వస్తారో తెలియదు గానీ.. ప్రస్తుతం జగన్ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తారా లేదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

తొలినుంచి హోదాకోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్మోహన రెడ్డి మంగళవారం కూడా అనంతపురంలో యువభేరిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే పోరాటం సీమాంధ్రలో జరిగినప్పుడు అనంతపురం జిల్లా ఎంత చురుగ్గా పాల్గొన్నదో అందరికీ తెలుసు. అలాంటి అనంతపురంలో యువతరానికి ప్రత్యేక హోదాతో రాగల ఎడ్వాంటేజీల గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే ప్రత్యేకహోదా కోసం వైసీపీ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటిస్తారు.

నిపుణులతో ప్రసంగాలను కూడా ఇందుకోసం ఏర్పాటుచేస్తున్నారు. ఈ రకంగా జగన్ తన హోదా పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. జగన్మోహనరెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారనగానే.. ఇక హోదా పోరాటాన్ని పక్కకు పెట్టేశారనే విమర్శలకు కూడా ఇది సమాధానం కాబోతోంది. పాదయాత్ర ఎజెండాలో హోదా గురించిన అంశం కూడా అనివార్యంగా ఉంటుందనే సంకేతాలను జగన్ ఇవ్వబోతున్నారు. 

ఇదంతా ఒకఎత్తు అయితే.. హోదా విషయంలో వైసీపీతో కలిసి పోరాడడానికి సిద్ధం అని ప్రకటించిన జనసేన, తన చిత్తశుద్ధిని ఏ రూపంలో నిరూపించుకోబోతున్నదనేది చర్చనీయాంశంగా మారుతోంది. జగన్ మంగళవారం యువభేరి నిర్వహిస్తుండగా, ఇందులో హోదా గురించిన పోరాటానికి పవన్ కల్యాణ్ కనీసం ట్వీట్ ద్వారా అయినా మద్దతు తెలియజేస్తే బాగుంటుందని జనసేన కార్యకర్తలే అనుకుంటున్నారు.

వైసీపీకి అనుకూలంగా ఒక్కవాక్యం కూడా చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ప్రయత్నానికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లుగా పవన్ ట్వీట్ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందని అనుకుంటున్నారు. తెలుగుదేశం స్కెచ్ ప్రకారమే పవన్ కల్యాణ్ నడుస్తూ ఉంటారనే అపోహలను ప్రజల్లోంచి దూరం చేయాలంటే.. జగన్ సాగిస్తున్న హోదా ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమే మంచిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.