కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో బీజేపీకి ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా లేడు. అయితే ఏపీ కోటాలో ఆ పార్టీకి రాజ్యసభలో బలముంది!
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఆ మధ్య బీజేపీలో విలీనం అయ్యారు. వారిలో టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి ఉన్నారు. ఇక అంతకన్నా మునుపు టీడీపీ-బీజేపీ సంకీర్ణంలో ఎన్నికైన సురేష్ ప్రభు ఏపీ కోటాలో ఉన్నారు. ఇక జీవీఎల్ తెలుగువాడే అయినప్పటికీ ఆయన యూపీ కోటాలో రాజ్యసభకు ఎన్నికయిన వ్యక్తి.
ఇప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేతకు ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్టుగా జాతీయ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఒక్కరు ఎవరు? అనే విషయంలో జీవీఎల్ కానీ, టీజీ వెంకటేష్ కానీ అనే ఆ రూమర్ సారాంశం. వీరిలో జీవీఎల్ కు ఛాన్సెస్ ఎక్కువ అనుకోవాలి. పార్టీలో దశాబ్దాల కాలంగా పని చేస్తున్న వ్యక్తి. బీజేపీ వ్యవస్థ నుంచి ఎదిగొచ్చిన వ్యక్తి. ఇక టీజీ కేవలం పార్టీ మారిన వ్యక్తి. తెలుగుదేశం, కాంగ్రెస్, మళ్లీ తెలుగుదేశం.. ఇలా సాగింది టీజీ రూటు. టీడీపీ అధినేత చంద్రబాబు వీళ్లను బీజేపీలోకి పంపారనే ప్రచారం ఉండనే ఉంది. ఇలా పార్టీలు మారి వచ్చిన వారికి గతంలో అయితే బీజేపీలో పదవులు దక్కేవి కావు.
అయితే ఇప్పుడు బీజేపీకి పాత సిద్ధాంతాలు లేవు. అధికారమే పరమావధి. ఎవరు వచ్చినా వారికి పదవులు దక్కుతాయి, పార్టీ పదవులు అయినా, మంత్రి పదవులు అయినా.. ఏదైనా సరే. ఈ లెక్కన టీజీ వెంకటేష్ కు కేంద్రమంత్రి పదవి దక్కినా దక్కొచ్చు. అయితే.. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలాన్ని బట్టి చూస్తే.. ఆయనకు మంత్రి పదవి దక్కబోతోందనడం జోక్ గా అనిపించవచ్చు. వచ్చే ఏడాది జూన్ తో టీజీ రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది.
2016లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022 జూన్ తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అంటే మరో 11 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మోడీ చేయబోయే కేబినెట్ మార్పు చేర్పులు బహుశా మిగిలి ఉన్న రెండున్నరేళ్ల పాలనకు కావొచ్చు. పదే పదే మార్పు చేర్పులకు మోడీ అంత ఇష్టపడరని స్పష్టం అవుతోంది ఇప్పటికే. ఇలాంటి నేపథ్యంలో కేవలం 11 నెలల పదవీ కాలం మిగిలి ఉన్న రాజ్యసభ సభ్యుడికి కేంద్రమంత్రి పదవి దక్కుతుందా? అనే సందేహం జనిస్తుంది. ఒకవేళ ఏపీ నుంచినే టీజీని మరోసారి రాజ్యసభకు పంపేంత బలం బీజేపీకి ఉండి ఉన్నా..ఆ చేరి వచ్చిన నేతకు కమలం పార్టీ ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలుండేవేమో!
టీజీని మంత్రిని చేస్తే..11 నెలల తర్వాత ఆయనను మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలి. జీవీఎల్ వంటి బీజేపీ లోనే పుట్టిపెరిగిన నేతకు అలాంటి అవకాశం లభించినట్టుగా ఉంది. అందులోనూ ఇప్పుడు బీజేపీలో కూడా ఇలాంటి రచ్చలు ఎక్కువయ్యాయి. వెంకయ్యనాయుడు వంటి సీనియర్ ను రాజ్యసభ సభ్యుడిగా వరసగా కర్ణాటక నుంచి పంపినప్పుడే అక్కడ నిరసనలు వ్యక్తం అయ్యాయి. వెంకయ్య.. సాకయ్య.. అంటూ కన్నడీగ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.