cloudfront

Advertisement


Home > Politics - Gossip

డైలాగ్ పార్ట్ మాత్రమేనా.. కార్యాచరణ ఉండేనా?

డైలాగ్ పార్ట్ మాత్రమేనా.. కార్యాచరణ ఉండేనా?

చంద్రబాబునాయుడు దృష్టిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. రాష్ట్రం కోసం పోరాడుతున్నది తాము ఒక్కరం మాత్రమే అని చంద్రబాబునాయుడు.. తన టీమ్ గురించి చాలా సార్లు ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

కేంద్రం మోసం చేసింది.. వారికి బుద్ధి చెప్పాలి.. భాజపాకు ఓట్లు వేయొద్దు అంటూ నినదించడం తప్ప.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగేలా... ఇప్పటిదాకా వీరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉక్కు, జోన్ దీక్షలు కూడా పార్టీ ప్రచారానికి ఉపయోగపడేవే తప్ప.. వాస్తవంలో కేంద్రం మీద ఒత్తిడి పెంచగలిగేవి కాదు.  ఆ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు మళ్లీ మొదలు కాబోతున్న తరుణంలో తెలుగుదేశం ఎంత పోరాట పటిమను ప్రదర్శిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం ‘ఎన్డీయే సర్కారు చేసిన మోసంపై గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీశాం.. ఇదే విధానాన్ని మరోసారి కొనసాగిస్తాం’ అని మాత్రం అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో బోధపడడం లేదు. గత పార్లమెంటు సమావేశాల నాటి పోరాటాన్నే ఇప్పుడు  పునరావృతం చేస్తే.. మళ్లీ అప్పుడు దక్కిన ఫలితాలే మళ్లీ దక్కుతాయి తప్ప.. యింకో ఉపయోగం ఏముంటుంది?

గతంలోకంటె భిన్నమైన, మరింత తీవ్రమైన పోరాట పంథాను ఆశ్రయించడానికి తెలుగుదేశం ప్రయత్నించాలి. గత సమావేశాల్లో రెండు పార్టీలూ అవిశ్వాస తీర్మానం పెట్టి సభను సాగనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇప్పుడు లోక్ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ఒక్కటే చేయాలి. ఈ అవకాశాన్ని  వారు ఎలా వినియోగించుకుంటారో చూడాలి.

మోడీ సర్కారుపై మళ్లీ అవిశ్వాసం పెట్టడానికి తెలుగుదేశం సిద్ధంగానే ఉందా? అందుకోసం వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్ధంగానే ఉన్నారా? లేదా, అంతా కలిసి.. కేవలం పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా కేంద్రం మోసం చేసింది అంటూ మీడియాతో నాలుగు డైలాగులు వల్లించి.. అక్కడితో చేతులు దులుపుకునే ఉద్దేశంతో ఉన్నారా? అనేది వారే నిర్ణయించుకోవాలి.