cloudfront

Advertisement


Home > Politics - Gossip

ప్రతి హెచ్చరికకూ మడమ తిప్పేస్తారా పవన్ జీ!

ప్రతి హెచ్చరికకూ మడమ తిప్పేస్తారా పవన్ జీ!

‘నేను మడమ తిప్పను.. నేను ఎవ్వరికీ భయపడను.. నేను వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. ఏదైనా చేయదలచుకుంటే దానిని సాధించే వరకు పోరాడి తీరుతాను..’ ఇలాంటి డైలాగులు రాజకీయనాయకులకు చాలా సహజం. కానీ పవన్ కల్యాణ్ వంటి నాయకులు వీటిని పలికినప్పుడు అవి చాలా రక్తి కడతాయి. అసలే హీరో ఇమేజి ఉన్న నాయకుడు, సినిమాల్లో పంచ్ డైలాగుల్ని వల్లించినంత శ్రద్ధగా నాటకీయంగా ఈ మాటలు అంటుంటే.. పవన్ సభల్లో ఎన్ని వేల ఈలలు పడ్డాయో.. చప్పట్లు మోగాయో లెక్క ఉండకపోవచ్చు.

తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అలాగే అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా డైలాగుల్ని చెప్పినట్టుగా ప్రిపేర్ అయిన ప్రసంగాలను వల్లించారే తప్ప.. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉండడం కల అనిపిస్తోంది. దమ్ము, ధైర్యం, తెగింపు పుష్కలంగా ఉన్న నాయకుడు జగన్ అని నాకు బాగా తెలుసు- అన్న జగన్ మాటలు.. మనస్ఫూర్తిగా అన్నారో వెటకారంగా అన్నారో ఇప్పుడు అప్రస్తుతం. కానీ తనకు మాత్రం ఆ లక్షణాలు లేవని పవన్ స్పష్టంగా చాటుకుంటున్నారు. 

పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలను గురించి తెలుసుకునేందుకు వారి సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తా అని గతంలో హామీ ఇచ్చేశారు. తన సెకండిన్నింగ్స్ టూర్లు ప్రారంభించినప్పుడే ఈ షెడ్యూలు కూడా ప్రకటించారు. ఆ మేరకు... బుధవారం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటన జరగాల్సి ఉంది. అయితే ఆ పర్యటన ప్రస్తుతం రద్దయినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

మత్స్యకారుల దీక్షలకు వ్యతిరేకంగా అక్కడ దాడులకు దిగుతున్న ఆదివాసీలనుంచి హెచ్చరిక రావడంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఇదేం చోద్యం.. హెచ్చరికలు రాగానే.. రాజకీయ నాయకుడు తన టూరు మానేసుకోవడం ఈ దేశంలో అసలుందా?

పవన్ వేలు పెట్టిందే వివాదాస్పద విషయంలో. తనను మత్స్యకారులు సంప్రదించారు గనుక.. వారి తరఫు.. వారిని ఎస్టీల్లో చేర్చడం సబబైన హామీ అని ఆయన మాట ఇచ్చారు మంచిదే. శ్రీకాకుళంలో దీక్ష చేస్తున్న వారి వద్దకు వచ్చి పరామర్శిస్తా అన్నారు. ఇంకా మంచిదే. మరి.. తీరా సమయం ఆసన్నం అయ్యేసరికి.. ‘నాకు బెదిరింపులు వస్తున్నాయ్.. నన్ను నేను కాపాడుకోవడం చాలా ముఖ్యం.. నా అవసరం జాతికి చాలా ఉంది’ అన్నట్లుగా ఆయన ముసుగు వేసుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు. నాయకత్వ లక్షణం అంటే ఇదేనా?

హెచ్చరికలు, బెదిరింపులు వస్తాయ్.. అని రాజకీయాల్లో అడుగుపెట్టే ముందు తెలియదా? రాజకీయం అంటే కేవలం విజిల్సూ చప్పట్లూ మాత్రమే అని పవన్ అనుకున్నారా? ఎన్ని హెచ్చరికలు వచ్చినా సరే.. ఎన్ని దాడులు జరిగినా సరే.. మీకోసం నేను వస్తున్నా.. మీకు అండగా నేనుంటా.. మీ న్యాయబద్ధమైన డిమాండుకోసం దన్నుగా నేను నిలబడతా.. అనే భరోసా ఇవ్వడం.. వారికి ఉపశమనపు డైలాగులు అప్పజెప్పిన ఈ నాయకుడికి లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

బెదిరింపు రాగానే పర్యటన క్యాన్సిల్ చేసుకునే రాజకీయ నాయకుడు సమకాలీన ప్రపంచంలో పవన్ ఒక్కడే కనిపిస్తున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి తన పలాయనవాదం గురించి పవన్ కనీసం ఆత్మ విమర్శ చేసుకుంటారో లేదో చూడాలి.