Advertisement


Home > Politics - Gossip
గెలుపు సరే.. టికెట్‌ దక్కుతుందా?

నంద్యాల్లో గెలిచాం.. మనకేంటి తిరుగులేదు, కాకినాడలో గెలిచాం.. ఇక ఎదురులేదు.. అని అనుకూల మీడియా వర్గాలు మసాజ్‌ చేస్తున్నా, చంద్రబాబు కూడా అలాగే గెలిచేస్తాం... అని ప్రకటించేస్తున్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం ప్రశాంతత లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతి ఎలాఉన్నా.. టికెట్‌ దక్కుతుందా? అనేదే తెలుగుదేశం పార్టీలోని నేతల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేకించి రాయలసీమ, గ్రేటర్‌ రాయలసీమ పరిధిలో ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఒకవైపు ఫిరాయింపుదారులు, మరోవైపు పనితీరు పరంగా ప్రశంసలు పొందలేని సిట్టింగులు.. ఇలా చూసుకుంటే.. చాలామంది సిట్టింగుల మెడకు కత్తి వేలాడుతోంది. వీరిలో ఎవరికి టికెట్లు దక్కుతాయి? ఎవరికి దక్కవు? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రత్యేకించి ఇటీవల జరిగిన పార్టీ మీటింగులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సిట్టింగుల్లో మరింత భయాన్ని పెంచాయి. తనకు ఎంత సన్నిహితులు అయినా, పార్టీలో ఎంత సీనియర్లు అయినా.. సర్వేల్లో పాజిటివ్‌ రిజల్ట్స్‌ పొందిన వాళ్లు మాత్రమే టికెట్‌ పొందుతారు, అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. దీంతో.. చాలామందిలో టెన్షన్‌ మొదలైందని సమాచారం.

పెద్ద తలనొప్పి ఫిరాయింపుదారులకే..?

ఫిరాయింపుదారులు.. వీళ్లు రాజకీయంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉండవచ్చు కానీ, వీరు బాగా చులకన అయ్యారు. జనాల సంగతెలా ఉన్నా.. రాజకీయ పార్టీల్లోనే వీరు చులకన అయ్యారు. వీళ్లు గేటుదాటడం వల్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీళ్లను తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్లైనా వీరిని దగ్గరకు తీసుకుంటారా? అంటే.. అక్కడా సానుకూలత లేదు.

ఆల్రెడీ ఆయా నియోజకవర్గాలకు పార్టీలో పాతుకుపోయిన వాళ్లు ఉండటంతో ఫిరాయింపుదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీ అయ్యింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు వీళ్లపై నమ్మకం ఉంచుతాడా? అనేది కూడా సందేహమే. జగన్‌ పార్టీ తరఫున గెలిచి తన పార్టీలోకి వచ్చిన వీళ్లు.. రేపు మళ్లీ ఇటు గెలిచి అటు వెళ్లినా వెళ్లవచ్చు కదా? అనేడౌట్‌ కలగకమానదు. సామాన్యుడికే ఇన్ని డౌట్లుంటే.. చంద్రబాబు ఫిరాయింపుదారులను నమ్ముతాడా? వాళ్లకు టికెట్‌ ఇస్తాడా? అనేది మిస్టరీనే.

నంద్యాల్లో ఫిరాయింపే నెగ్గింది కదా?

నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచింది ఫిరాయించిన రాజకీయ కుటుంబమే. అలాగే ఇక్కడ కాలికి బలపం కట్టుకుని తిరిగింది కూడా ఫిరాయింపుదారులే. జగన్‌ పార్టీ తరపున గెలిచి.. జగన్‌ను విమర్శిస్తూ చేసిన ప్రచారానికి మంచి ఫలితం దక్కింది. దీంతో.. ఫిరాయింపులకు రాజముద్ర పడినట్టే.. అనే కొంతమంది వాదింవచ్చు. అయితే నంద్యాల బైపోల్‌ ఒకింత ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నాటికి.. ఫిరాయింపుదారులకు విలువ ఉంటుందా? అంటే.. ఉండదనే మాటే వినిపిస్తోంది.

వీళ్లకు షాక్‌ తప్పదా?

అనంతపురం జిల్లా కదిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చాంద్‌ భాషా, కర్నూలు టౌన్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గాల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. వీళ్లందరికీ బాబు చెక్‌ చెబుతాడని.. ఫిరాయింపుల సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ గ్యారెంటీ అని బాబు హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదనే విషయాన్ని బాబు కుండబద్ధలు కొట్టి చెబుతున్నాడని స్పష్టం అవుతోంది.  రాయలసీమ నాలుగు జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో ఫిరాయింపులు బాగానే జరిగాయి.

వీరిలో చాలా మందికి టికెట్లు దక్కవని.. ఈ జిల్లాలకు సంబంధించిన వారిలో మంత్రి పదవులు చేపట్టిన ముగ్గురికి మినహాయించి.. మిగతా వారికి మొండిచెయ్యేనని ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పాత కాపులున్నారు. వాళ్లంతా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో ఓడిన వాళ్లు. వారిపై బాబుకు ఇంకా కొంత మమకారం ఉంది. అందుకే ఫిరాయింపుదారులను పక్కన పెట్టి పార్టీ పాతకాపులకే ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొన్నటి వరకూ ఊరడించారు..

సీట్లు పెరుగుతాయని మొన్నటి వరకూ బాబు ఊరడించారు. అయితే అది జరగని పని క్లియర్‌ కట్‌గా అర్థం అయ్యింది. ఈ నేపథ్యంలో.. యథాతథంగా పాత నియోజకవర్గాలకే ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ సీట్ల సంఖ్య పెరిగి ఉంటే.. అటు ఫిరాయింపుదారులకు, ఇటు పార్టీ పాతకాపులకు టికెట్లు లభించేవి. అయితే.. అది జరగదని స్పష్టం అయ్యింది. దీంతో.. ఇప్పుడు బాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశాడు. అందరికీ టికెట్లు దక్కవు.. అని స్పష్టం చేశారు. 

ఏం చేస్తారు..?

టికెట్లు ఇవ్వకపోతే వీళ్లు ఏం చేస్తారనేదే ప్రశ్న. ఇప్పటికే కొన్ని సీట్ల విషయంలో లొల్లి మొదలైంది. సీమ వరకూ తీసుకుంటే.. జమ్మలమడుగులో ఇద్దరు పోటీలో ఉన్నారు. కదిరిలో ఇద్దరు. కర్నూలులో ఇద్దరు. ఇక మిగతా ఫిరాయింపు నియోజకవర్గాల్లో కూడా దాదాపు పరిస్థితి ఇలానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ.. ఒకరికి టికెట్‌ దక్కడం, మరొకరికి దక్కకపోవడం.. రాజకీయ రణరంగానికే దారితీస్తుందని అనడానికి సందేహించనక్కర్లేదు. ఆ పోరాటం రంజుగా ఉంటుందని చెప్పవచ్చు.