cloudfront

Advertisement


Home > Politics - Gossip

నిజం ఒప్పుకోకుంటే భవిష్యత్తు ఉండదంతే!

నిజం ఒప్పుకోకుంటే భవిష్యత్తు ఉండదంతే!

రాహుల్.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా గెలిచిపోతాం అనే నమ్మకంతో.. విపరీతంగా పర్యటించి ఎన్నికల సభలు నిర్వహిస్తే.. మరీ దారుణంగా, చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఓడిపోవడం గురించి ఆయన వారిని గట్టిగానే అడిగారు. నాయకులు కూడా తలా ఒక కారణం చెప్పారు. అయితే.. వాస్తవాన్ని అంగీకరించకపోతే గనుక.. తమకు భవిష్యత్తు కూడా ఉండదని మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని మభ్యపెట్టే ధోరణిలోనే మాటలను వండి వారుస్తున్నారు.

అసలే కాంగ్రెస్ పార్టీ.. అక్కడ ముఠాలు మస్తుగా ఉంటాయి. ఆపై ఓడిపోయారు... ఇక ప్రతివాడికీ.. తన ప్రత్యర్థిని బద్నాం చేయడానికి సవాలక్ష కారణాలుంటాయి. రాహుల్ చేసిన సమీక్షలో కూడా అచ్చంగా ఇదే కనిపించింది. టికెట్ల కేటాయింపు ఆలస్యం అయిందని కొందరు, నాయకత్వ లోపం అన్న వారు కొందరు! ఆలస్యం మాటెత్తిన వారు పొత్తుల మీద నెపం రుద్దేయాలనుకున్నారు.

నాయకత్వలోపం అన్నవారు ఉత్తమ్ ను ఇరికించాలనుకున్నారు. మొత్తానికి ఉత్తమ్, ఆశలు వమ్ముచేశాను క్షమించండి.. అని సారీచెప్పి చేతులు దులుపుకున్నారు. గంటకు పైగా సాగిన సమావేశంలో వాళ్లంతా అధికార దుర్వినియోగం అని, ధన ప్రభావం అని.. రకరకాల సాకులు చెప్పి బయటపడే ప్రయత్నాలు చేశారు.

అయితే నిజం చెప్పాలంటే.. డబ్బు ఖర్చు చేసే విషయంలో కాంగ్రెస్ ఏమీ తక్కువ తినలేదు. విచ్చలవిడిగా వీరు కూడా డబ్బు వెదజల్లారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. కేసీఆర్ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమపథకాలతో.. ఇవాళ దేశంలోని తతిమ్మా అన్ని పార్టీలు కాపీ కొట్టడానికి ఎగబడుతున్న రైతుబంధు వంటి పథకాలతో వారికి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఏర్పడిందనే నిజాన్ని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు ఈగో అడ్డు వచ్చినట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని వైఫల్యాలున్నా, కేవలం ప్రజల్లో పుష్కలమైన ఆదరణ వల్లనే మళ్లీ గద్దె ఎక్కిందనేది స్పష్టం. దాన్ని ఒప్పుకుని తదనుగుణంగా, వారికి భిన్నంగా- వారిని మించి, తాము పనిచేయగలం అని నిరూపించుకోకుండా.. ఇలాంటి సాకులు వెతుక్కుంటూ కాంగ్రెస్ భవిష్యత్తును కూడా చెడగొట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?