cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు పంచన చేరి.. ఆయన మీదే విమర్శలా!

బాబు పంచన చేరి.. ఆయన మీదే విమర్శలా!

కొత్తపల్లి గీత... రికార్డుల ప్రకారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అరకు ఎంపీ. కానీ ఇటీవలి కాలంలో ‘‘నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పాలనను మెచ్చి’’ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె అలా చెప్పారు గానీ.. అనేక రకాల కేసులు, రియల్ ఎస్టేట్ తగాదాల నేపథ్యంలో అధికార పార్టీ అండకోసమే అటువైపు వెళ్లారనే పుకార్లు చాలానే ప్రచారంలో ఉన్నాయి. వైసీపీ కూడా ఆమెను తమ పార్టీ ఎంపీ కింద పరిగణించడం మానేసి.. అనర్హత వేటు గురించి స్పీకరుకు ఫిర్యాదు కూడా చేసేసింది.

అలాంటి కొత్తపల్లి గీత.. తాను చంద్రబాబు పంచన చేరినప్పటికీ.. తాజాగా ఆయన ప్రభుత్వం మీద, కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఆయన చేస్తున్న ప్రయత్నాల మీద ఎడాపెడా విమర్శలు గుప్పిస్తుండడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. వైసీపీని  కూడా దూరం చేసుకుని బాబు వద్దకు వచ్చాక.. ఆయన పాలననే తిట్టేస్తున్నదేమిటా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రత్యేక ప్యాకేజీ వస్తే నాయకులు మాత్రమే లాభపడతారని కొత్తపల్లి గీత అనడం చూస్తోంటే.. చంద్రబాబు మీద నమ్మకం సడలి మళ్లీ ఆమె వైసీపీ ముద్రకోసం తహతహ లాడుతోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

తన నియోజకవర్గంలో పర్యటించిన ఆమె విభజన చట్టం, ప్యాకేజీకి సంబంధించి నిధులు సకాలంలో రాకపోవడంలో కేంద్రం తప్పేమీలేదని అనడం ఒక ట్విస్టు అయితే.. ఇచ్చిన డబ్బు గురించి పెట్టిన ఖర్చు వివరాలను రాష్ట్రప్రభుత్వం చెప్పకపోతే నిధులెలా వస్తాయ్..? అంటూ బాబువైఖరినే కార్నర్ చేయడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

విశాఖ రైల్వేజోన్ ఆలస్యం కావడానికి కూడా కేంద్రం కారణం కాదన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నారు. రైల్వేజోన్ కేంద్రంగా విజయవాడను చేయాలని కొందరు నాయకులు పైరవీ చేస్తున్నందువల్లనే... జోన్ ప్రకటన ఆలస్యం అవుతోందని అంటున్నారు.

ఈ మాటలన్నీ గమనిస్తే.. ఆమెను చంద్రబాబు నీడలోకి ఫిరాయించిన ఎంపీ అనుకోవడం కష్టం. అందుకే.. మొన్న పార్లమెంటు ఆందోళనల్లో ఏ పార్టీ తరఫునా నిలవకుండా మౌనంగా ఉండిపోయిన గీత.. తాజాగా.. తిరిగి వైసీపీ గూటికి చేరుకోవాలనుకుంటున్నారా? అనే సందేహాలు ఈ మాటలు గమనించిన వారికి కలుగుతున్నాయి.