Advertisement


Home > Politics - Gossip
వైసీపీని చంపేస్తున్నారు!

పార్టీలోనే పగవాళ్లు
ఉన్న కొమ్మనే నరికేస్తున్న వైనం
మీడియా బేబీలే నేతాశ్రీలు

విశాఖ జిల్లాలో వైసీపీకి గెలిచే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఏజెన్సీలోని పాడేరు అసెంబ్లీ సీటు. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలు. మన్యసీమలో వైసీపీకి జవజీవాలు కల్పించడమే కాకుండా, పార్టీలోనూ బలమైన గొంతుకగా అవతరించిన ఈశ్వరి కలలో సైతం ఊహించని నిర్ణయం తీసుకోవడానికి సొంత పార్టీ నేతల పోకడే కారణమని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. పార్టీలో వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారు జగన్‌ సామాజికవర్గం పేరు చెప్పుకుని కీలకమైన పదవులలో కూర్చున్నారు.

అంతటితో చాలదన్నట్లుగా జిల్లా పార్టీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉబలాటపడుతున్నారు. ఫలితంగా ప్రజలలో ఉంటూ పార్టీకి నమ్మకంగా ఉండే ఈశ్వరి లాంటి వారు దూరం అయ్యేందుకు వీరి రాజకీయం ఎంతగానో ఉపకరిస్తోంది. విశాఖ నగరంలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు ఎపుడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచిన పాపాన పోలేదు, నాడు వైఎస్‌ఆర్‌ పుణ్యమాని నామినేటెడ్‌ కోటాలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను వెలగబెట్టిన ఈ నేతలు వైసీపీ అధినాయకత్వానికి ఎందుకు నచ్చుతున్నారో తెలియదు కానీ, వారి వికృత చేష్టల కారణంగా పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది.

2014లో విశాఖ నగరం, జిల్లాలో ఎక్కడా తిరగని ఫ్యాన్‌ అనూహ్యంగా ఏజెన్సీలో ఎదురులేని శక్తిగా అవతరించింది అరకు పార్లమెంట్‌ సీటుతో పాటు, పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగిరింది. గిరిజనులకు ఎన్టీఆర్‌ తరువాత అంతగా నచ్చిన నేత వైఎస్‌ఆర్‌ కావడమే ఈ అపూర్వ విజయానికి ప్రధాన హేతువు. వైఎస్‌ఆర్‌ కుమారునిగా జగన్‌కు సైతం ఏజెన్సీలో మంచి ప్రజాదరణ లభిస్తూ వచ్చింది. వీటన్నిటి వెనుక ఏజెన్సీలో పార్టీకి మూల స్తంభాలుగా ఈశ్వరి వంటి నేతలు ఉండడమూ ఇంకో కారణం.

పార్టీ కోసం గత మూడున్నరేళ్లుగా ఎంతగానో కష్టపడిన ఈశ్వరి బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా అధినేత జగన్‌ను రప్పించి భారీ సభను నిర్వహించారు. నాటి సభలో చంద్రబాబును ఉద్దేశించి గిరిజనుల జోలికి వస్తే తల నరుకుతామంటూ ఆవేశంతో రగిలిపోయారు. అటువంటి ఈశ్వరి అదే చంద్రబాబు చేత కండువా కప్పించుకునే పరిస్థితిని ఆమె సైతం ఊహించకపోవచ్చును. కానీ, జిల్లా వైసీపీలో ఉన్న అంగుష్టమాత్రులైన నాయకుల పుణ్యమాని ఆమె చివరికి పార్టీ మారాల్సివచ్చింది. 2019 ఎన్నికలలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలన్నది జగన్‌కు సంబంధించిన విషయం.

మరి, పార్టీలో ఉన్న పస లేని నాయకులు దీనిపై లీకులు ఇస్తూ తామే బీ ఫారం ఇచ్చేసినంతగా కలరింగ్‌ ఇవ్వడమే ఈశ్వరి టీడీపీ తలుపు తట్టడానికి కారణం. జూనియర్లు, అంగుష్టమాత్రుల చేతిలో పడిన విశాఖ వైసీపీకి ఆరేళ్ల వయసుకే నూరేళ్లు నిండిపోతున్నాయి. దీక్షా దక్షతలు లేని నాయకుల పుణ్యమాని పార్టీ రోజురోజుకూ క్షీణ దశకు చేరుకుంటోంది. ఓ వైపు అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూంటే, మరోవైపు వైసీపీ సైతం తన విచిత్ర రాజకీయ విన్యాసాలతో ప్రజలలో చులకన పాలవుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి ఉన్న వేళ ఉత్సాహమంతా ఆవిరై చాప చుట్టేసే దశకు చేరుకుంటోంది.

పార్టీతోనే పుట్టి ఇంతకాలం నడచిన వాళ్లే వైరి పార్టీ పంచన చేరేలా సొంత నాయకులే దారి చూపిస్తున్న రాజకీయ సన్నివేశం బహుశా దేశంలో మరే పార్టీలో ఉండదేమో. ఈ రోజుకు చూసుకుంటే విశాఖ వంటి అతి పెద్ద నగరంలో వైసీపీకి ఫేస్‌ వాల్యూ ఉన్న నాయకుడు ఒక్కడంటే ఒక్కరు లేరన్నది పచ్చి నిజం. ఇక, 2014 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ కాంబోకు తోడైన పవన్‌ గాలిని కూడా ఎదురొడ్డి జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో వైసీపీ తక్కువ ఓట్లతోనే ఓటమి పాలైంది.

పార్టీ పటిష్టం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న నేపధ్యంలో అటు అధినాయకత్వం ఉదాశీనత, ఇటు స్ధానికంగా ఉన్న లోపాలు వెరశి వైసీపీని తమకు తాముగానే జనం నుంచి దూరం చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌ ఎంత కష్టపడితే ఏం లాభం, జిల్లాలో పార్టీని దిగువ స్ధాయి వరకూ తీసుకుపోయే నాయకత్వ పటిమ లేని చోట టీడీపీ మీసం మెలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నగరంలో ఇరవై లక్షల జనాభా పైగా ఉంటారు, మేధావులు, చదువుకున్న వారే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగా, వ్యాపారవర్గాల సమ్మేళనం ఈ నగరం.

ఇక్కడ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తారని పేరుంది. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల జనంలో ఎంతటి ఆక్రోశం, ఆగ్రహం ఉంటేనేమి, వైసీపీ లాంటి అసమర్ధ విపక్షం ఉండడం వల్ల జనం వేరే దిక్కు లేని పరిస్థితులలో పడుతున్నారు. విశాఖ జిల్లా పార్టీలో ఏం జరుగుతుందన్న కనీస అవగాహన, ఆలోచన అధినాయకత్వానికి లేదన్న దానికి గిడ్డి ఈశ్వరి తాజా ఎపిసోడ్‌ ఓ ఉదాహరణ. పార్టీలో ఉన్న వారందరికీ ఏదో పదవిని ఇచ్చేసి ఇక తమ పని అయిపోయిందని అధినాయకత్వం అనుకుంటోంది.

ఆ పార్టీ పదవులతో తమ పేరును తగిలించుకుని మీడియాకు ప్రెస్‌ నోట్లు, అపుడపుడు ప్రెస్‌ మీట్లు పెట్టేసి మహా నాయకులమని మురిసిపోతున్న మీడియా బేబీల నేతృత్వంలో జిల్లా వైసీపీ ఇపుడు పయనిస్తోంది. పార్టీని ఒక్క త్రాటిపై నడిపించే సమర్ధుడైన నాయకుడు లేని చోట పొరుగు జిల్లా నుంచి ఓ బొత్స సత్యనారాయణ, జగన్‌ తరఫున వచ్చీ పోతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దిక్కు అవుతున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు టీడీపీని ఢీకొట్టడం మాట అటుంచి అసలు పార్టీలో ఉన్న అయోమయాన్ని సైతం తొలగించలేని నిస్సత్తువలో నాయకత్వం నిండా మునిగిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అధినాయకత్వం లోతుగా సమీక్షించుకుని ప్రజా క్షేత్రంలో పోరాటాలకు తెర తీయాలి. లేని పక్షంలో మరో మారు టీడీపీ చేతిలో శృంగభంగం తప్పదేమో.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌