cloudfront

Advertisement


Home > Politics - Gossip

వైసీపీలో అయోమయం..!

వైసీపీలో అయోమయం..!

విశాఖజిల్లా వైసీపీలో అంతటా అయోమయం కనిపిస్తోంది. ఓ వైపు టీడీపీ టికెట్లను ఇచ్చేసింది. పదిమంది వరకూ అభ్యర్ధులను జిల్లాలో ప్రకటించారు. దాంతో వారంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు వైసీపీకి అభ్యర్ధి ఎవరో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పటికే ప్రతీ అసెంబ్లీ సీటుకు ఎక్కువమంది ఆశావహులు ఉన్నారు. దాంతో ఒకరికి ఇస్తే మిగిలినవారు ఎలా స్పందిస్తారో చూడాలి. అసమ్మతి సెగలను దాటుకుంటూ వైసీపీ ఎన్నికల సమరంలోకి వెళ్ళాలంటే పుణ్యకాలం దాటిపోయేలా ఉంది.

ఇప్పటికైతే పలుచోట్ల ఇంచార్జిలను మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఇపుడు ఉన్నవాళ్ళు అయితే టీడీపీ అభ్యర్ధుల మీద తేలిపోతారని హైకమాండ్ అంచనా వేస్తోంది. విశాఖ తూర్పులో ఇప్పటికి రెండుమార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఈసారితో హ్యాట్రిక్ కొట్టాలని ఉరుకుతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ అభ్యర్ధి వంశీక్రిష్ణ దూకుడు రాజకీయం చేయలేకపోతున్నారు. ఇప్పటికి రెండుసార్లు ఈ ఇద్దరి మధ్యనే పోటీ జరిగింది. ప్రజారాజ్యం తరఫున మొదటిసారి పోటీచేసిన వంశీ వెలగపూడి చేతిలో కేవలం మూడువేల ఓట్లతేడాతో ఓడిపోయారు.

ఇక 2014 నాటికి వైసీపీలో చేరిన వంశీ గట్టిపోటీ ఇస్తారనుకుంటే ఏకంగా 45 వేల ఓట్ల భారీ మెజారిటీ వెలగపూడికి దక్కింది. ఇపుడు కూడా వంశీకి టికెట్ ఇస్తే గెలుపు కష్టమని భావిస్తున్న అధినాయకత్వం వంశీని మార్చాలనుకుంటోంది. దాంతో ఇక్కడ అపుడే గొడవలు మొదలయ్యాయి. ఇక విశాఖ ఉత్తరం సీటు కూడా అలాగే ఉంది. ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చి ఇక్కడ పోటీచేస్తున్నారు. ఆయన్ని ఢీకొట్టలంటే బలమైన అభ్యర్ధి కావాలని అంటున్నారు. దాంతో ఇక్కడ వైసీపీ ఇంచార్జి కేకే రాజు డీలా పడుతున్నారు.

అదేవిధంగా విశాఖ దక్షిణంలో కూడా కొలా గురువులు, ప్రస్తుతం ఇంచార్జి రమణమూర్తి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. పెందుర్తి సీటుని కూడా మారుస్తారని అంటున్నారు. అలాగే కొణతాల రామక్రిష్ణ పార్టీలో చేరితే రూరల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం తేడా వస్తుంది. మొత్తానికి ఇపుడు వైసీపీలో అంతటా అయోమయం కనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతుంటే టికెట్ల గొడవ తేలకపోవడం పట్ల క్యాడర్లో కూడా నిరాశ కమ్ముకుంటోంది.