cloudfront

Advertisement


Home > Politics - Gossip

వైసీపీతో 'టచ్‌'లోకి వచ్చిన టీజీ వెంకటేష్‌.?

వైసీపీతో 'టచ్‌'లోకి వచ్చిన టీజీ వెంకటేష్‌.?

టీడీపీనేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వచ్చారట. ఇదంతా, కర్నూలుజిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటీవల చోటు చేసుకుంటున్న మార్పులే కారణమని, సాక్షాత్తు టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. 'చినబాబు' నారా లోకేష్‌, కర్నూలు జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. జిల్లాకి సంబంధించి ఇప్పటిదాకా ముగ్గురికి 2019 ఎన్నికలే టార్గెట్‌గా చేసుకుని, టిక్కెట్లను ఖరారు చేసేశారు. వీరిలో సిట్టింగ్‌ ఎంపీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే వుండడం గమనార్హం.
 
అయితే, 2019 ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్‌ని ఆశిస్తున్నారు టీజీ వెంకటేష్‌. కానీ, టీజీ వెంకటేష్‌ కోరికని నారాలోకేష్‌ లైట్‌ తీసుకున్నారు. దాంతో, టీజీ వెంకటేష్‌ సహజంగానే అలకపాన్పు ఎక్కడం జరుగుతోంది. 'జిల్లాలో పార్టీ భ్రష్టుపట్టిపోవడం ఖాయం..' అంటూ టీజీ వెంకటేష్‌, నారా లోకేష్‌ తీరుపై సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా వైఎస్సార్సీపీ ముఖ్య నేతల చెవిన పడింది.

అయితే, గత అనుభవాల దృష్ట్యా.. టీజీ వెంకటేష్‌తో మంతనాలు జరిపేందుకు వైఎస్సార్సీపీ నేతలు ముందడుగు వేయలేకపోయారు. అదే సమయంలో, టీజీ వెంకటేష్‌ సన్నిహితులు.. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలకు, 'టీడీపీలో టీజీ అసహనంపై' సమాచారాన్ని 'ప్రత్యేకంగా' చేరవేశారట. ప్రస్తుతం 'బంతి' వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కోర్టులోకి మారింది. ఆయన 'సానుకూలంగా' స్పందిస్తే, వైఎస్సార్సీపీ ముఖ్యనేతల టీమ్‌, టీజీ వెంకటేష్‌తో చర్చించేందుకు ముందుకురావొచ్చు. పరిస్థితుల్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలద్వారా పసిగట్టిన టీడీపీ అధినాయకత్వం, టీజీ వెంకటేష్‌ని బుజ్జగించే చర్యలూ చేపట్టిందట.
 
అన్నట్టు, అత్యంత వ్యూహాత్మకంగా రాజ్యసభ టిక్కెట్‌ని దక్కించుకున్న (కొనుక్కున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు) టీజీ వెంకటేష్‌, తిమ్మిని బమ్మిని చేసి అయినా తన కుమారుడికి టిక్కెట్‌ ఇప్పించుకోలేరా.? అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. పార్టీ నుంచి నేతలు జారిపోకుండా వుండేందుకోసం.. చినబాబు అత్యుత్సాహంతో అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారనీ, చివరి నిమిషంలో చంద్రబాబు రాజకీయాలు ఎలాగైనా ఈక్వేషన్స్‌ని మార్చేయొచ్చనీ టీడీపీలో టీజీ సన్నిహిత వర్గం అభిప్రాయపడ్తోంది.
 
ఒకవేళ టీడీపీ గనుక తన కుమారుడి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే, టీజీ వెంకటేష్‌ వైసీపీలోకి వెళ్ళిపోవడం ఖాయమేనన్నది కర్నూలుజిల్లాలో ప్రముఖంగా విన్పిస్తోన్న మాట. మరి, జగన్‌ అందుకు సానుకూలత వ్యక్తం చేస్తారా.? వేచి చూడాల్సిందే.