cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాషాయానికి పచ్చరంగు !

కాషాయానికి పచ్చరంగు !

ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎటూ కమలదళానికి రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండాపోయేలాగా చంద్రబాబునాయుడు ప్రతికూల పరిస్థితులను చాలా సమర్థంగా సృష్టించేశారు. రాష్ట్రంలోని నాయకులు.. తాము భాజపా పార్టీకి చెందిన వారం అని చెప్పుకోడానికే ఇష్టపడని పరిస్థితిని ఆయన సృష్టించారు. ఆ పార్టీ రాష్ట్రానికి ఎనలేని ద్రోహం చేస్తున్నదంటూ పదేపదే బురద చల్లడం ద్వారా.. ఈ ఎత్తుగడతో చంద్రబాబు సక్సెస్ సాధించారు.

చూడబోతే.. ఈ ప్లాన్ లో ఆయన నెక్ట్స్ స్టెప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. తమకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదేమో అనే ఆందోళనలో ఉన్న భాజపా నాయకులను తెలుగుదేశంలోకి ఆకర్షించి.. తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా తెలుగుదేశం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాలు ఆ పార్టీ నాయకుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.

ఎక్కడ ఏం జరిగినా.. విజయవాడలో స్పందిస్తూ ఉండే తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ విషయంలోనూ తన ఒపీనియన్ చెబుతున్నారు. సాయం అందకుంటే.. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకుల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నదని బుద్ధా వెంకన్న అంటున్నారు. మొత్తానికి అధిష్టానం నిర్ణయాల పట్ల రాష్ట్ర భాజపాలోని పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారని.. వారంతా తిరుగుబాటు చేయబోతున్నారని ఆయన సంకేతాలు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి భాజపాలో తిరుగుబాటు చేసేంత సీన్ ఉన్న నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూలేరు. తిరుగుబాటు అంటే.. అధిష్టానాన్ని ధిక్కరించి.. చీలిక వర్గంగా ఏర్పడడమో.. సొంత పార్టీ పెట్టుకోవడమో జరగాలి. అంత సీన్ ఏపీ నాయకులకు ఉందనుకోవడం భ్రమ. కాకపోతే.. ఇప్పుడు తెదేపా నాయకుడు ఆ రేంజిలో బిల్డప్ ఇవ్వడాన్ని చూస్తోంటే తిరుగుబాటు కాకపోయినా.. కమలదళం నుంచి కనీసం ఫిరాయింపులు అయినా ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.

భాజపాలో అంతో ఇంతో ప్రజాబలం ఉన్న నాయకుల్ని.. తెదేపా ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకుంటుందని.. వారి ద్వారా.. రాగల ఓట్ల మీద ఆశ కంటే.. కేంద్రంలోని భాజపా మీద బురద చల్లడానికి వారికి మరింత ఆస్కారం దొరుకుతుందని, అలాగే భాజపాతో భవిష్యత్తులో వైకాపా జతకడితే గనుక.. ఆ పార్టీ మీద బురద చల్లడానికి కూడా ఇలా కాషాయ దళానికి పచ్చరంగు పూయడం అనేది ఉపయోగపడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.