Advertisement


Home > Politics - Gossip
కాంగ్రెస్‌కు జాకీలేస్తున్న పచ్చమీడియా..!

అవతల ఏడెనిమిది నెలలుగా ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తున్నారు.. ఆయనతో ఒక్క ఇంటర్వ్యూ చేసిన పాపనపోలేదు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీ వాళ్లతో.. వ్యక్తిగతమైన చిన్న ఇంటర్వ్యూ ప్రచురించిన దాఖలాలు లేవు. తాము తెలుగుదేశం అనుకూల వార్తలు మాత్రమే రాస్తాం, తెలుగుదేశం అనుకూల వార్తలనే జనాల్లోకి తీసుకెళ్తాం.. ఇక మీ ఇష్టం. అన్నట్టుగా పచ్చి బరి తెగింపుతో వ్యవహరిస్తున్నాయి రెండు ప్రధాన పత్రికలు.

జనాలు నవ్వుతున్నా, ఇదేం బరితెగింపు అని పేపర్లను తీసి పక్కన కొడుతున్నా.. ఆ పత్రికలు మాత్రం నిస్సిగ్గుగా ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడి శ్రేయస్సు తప్ప తమకు ఇంకేం అవసరం లేదు, రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు, ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చి, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఆయననే సమర్థిస్తాం తప్ప అంతకు మించి ఇంకేం చేయమని, అదే తమ అజెండా అని ప్రధాన పత్రికలు నిస్సిగ్గుగా ప్రకటించుకొంటున్నాయి. తమ తీరుతో ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఇంత బరితెగించి వ్యవహరిస్తున్న ఈ మీడియా వర్గాలు.. ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి జాకీలు వేస్తూ ఉండటం విశేషం. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే.. చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. గత ఎన్నికల్లో అయినా ఒక్కో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సగటున వెయ్యి, రెండు వేల ఓట్లను తెచ్చుకుంది.. బలమైన నేతలున్న చోట మూడో స్థానంలో అయినా నిలవగలిగింది.. వచ్చేసారి కాంగ్రెస్ కు ఆ ఓట్లు కూడా రావని చిన్నపిల్లలు కూడా చెప్పేస్తున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ కు టిడిపి అనుకూలపత్రికలు జాకీలు వేస్తూ ఉండటం విశేషం. ఏపీ నూతన వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్‌చాందీతో టిడిపి అనుకూలపత్రికలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏం చేస్తారో ఈ పత్రికలు వివరించి చెప్పాయి. ఈ చాందీది కేరళ. అక్కడే కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడుతోంది. కేరళ సీఎంగా కూడా వ్యవహరించిన ఈయన అక్కడ కాంగ్రెస్ ను మళ్లీ కాపాడే యత్నం చేయడంలేదు. మొన్నటి బైపోల్ ఒకదాంట్లో కేరళలో బీజేపీ స్థాయిలో నిలిచింది కాంగ్రెస్ పార్టీ. అంతటి దయనీయమైన స్థితికి జారిపోతోంది.

అక్కడ ఉద్ధరించలేని చాందీ కాంగ్రెస్ ను ఉద్ధరిస్తాడట.. అది కూడా ఏపీలో! విభజన పాపం మూటగట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఏపీలో దుంపనాశనం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల చరిత్ర చిరిగిపోయే వరకూ ఏపీలో మళ్లీ కాంగ్రెస్ లేచే అవకాశం లేదు. అయితే చంద్రబాబుకు ఇప్పుడు కాంగ్రెస్ తో అవసరం ఏర్పడింది. అందుకే టిడిపి అనుకూలపత్రికలు కూడా చంద్రబాబుకు అవసరం కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు జాకీలు వేస్తోంది. వెనుకటికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దన్నుగా ఉన్నట్టుగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు జాకీలేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని!