cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘పొడిచెయ్ పోటు’?

‘పొడిచెయ్ పోటు’?

నిన్న నేడు రేపు.. కాలం మారుతున్నా.. టెక్నిక్‌ ఒక్కటే!

ఎత్తుగడలు ఎప్పుడూ కొత్తగా ఉండాలి. పాత ఎత్తుగడల్లోని మర్మాఘాతాల గురించి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అదే టెక్నిక్‌తో మళ్లీకొడితే.. అందరూ అప్రమత్తమైపోయి ఉంటారు. కాబట్టి చావుదెబ్బ కొట్టాలనుకున్నప్పుడు పాత ఎత్తుగడలు పనికిరావు. అలాగని ప్రతిసారీ కొత్త ఎత్తుగడలు ఎన్ని తయారుచేయగలం? కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎంతకైనా సమర్థులు. పాత ఎత్తుగడలను కూడా సరికొత్త రూపంలో ఆయన ఆచరణలో పెట్టగలరు. ప్రత్యర్థి తన దెబ్బను ఊహించి.. దానికి విరుగుడు ఆలోచించేలోగానే.. పోటు పొడిచేయగలరు!

'కాల్‌ ది డాగ్‌ మ్యాడ్‌.. ఇఫ్‌ యూ వాంట్‌ టూ కిల్‌ ఇట్‌' ఎంత పాత సామెత ఇది. ప్రపంచంలో కుట్రలు, కూహకాలు, ఎదుటివాళ్లను దెబ్బతీయడాలూ ప్రారంభమైన నాటినుంచి బహుశా ఈ సామెత అమల్లోనే ఉండి ఉంటుంది. 'ఓ కుక్కను చంపదలచుకుంటే.. ముందు అది పిచ్చిది అని ప్రచారం చెయ్‌' అనే కుయుక్తిని నేర్పుతుంది ఈ సామెత!

కానీ చంద్రబాబు నాయుడు తాజా పరిణామాల్లో ఈ సామెతకు ఒక వేల్యూ ఎడిషన్‌ చేశారు. పాత కుయుక్తితో వెళితే వర్కవుట్‌ కాదనుకుని.. దాన్ని కొత్తరకంగా మార్చారు. 'కాల్‌ ది డాగ్‌ మ్యాడ్‌.. బట్‌, హగ్‌ ఇట్‌. ఎనీ హౌ పీపుల్‌ విల్‌ కిల్‌ ఇట్‌. నో వన్‌ విల్‌ బ్లేమ్‌ యూ!'' అనేది కొత్త పద్ధతి. అంటే- 'కుక్క పిచ్చిది అని ముద్ర వేసేయ్‌.. కానీ దాన్ని ప్రేమించినట్లుగా కౌగిలించుకో. ప్రజలే దాన్ని చంపేస్తారు. కానీ నిన్ను ఎవరూ నిందించరు'' ఇది చంద్రబాబు సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్నే ఆయన భారతీయ జనతా పార్టీ విషయంలో అమలు చేస్తున్నారు. వాళ్లు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసేశారని.. ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. కానీ.. ఇంకా ఎన్డీయేనే అంటిపెట్టుకుని ఉన్నారు. కాగల కార్యం, తనచేతికి మరక అంటకుండా 'పోటు' పడిపోతుందని ఆయనకు తెలుసు.

వాహ్‌.. చంద్రబాబూ సాబ్‌.. క్యా చాలూ హై ఆప్‌.. !
మీ 'పోటు'కు సాటి లేదు సాబ్‌!!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా అనుసరిస్తున్న వ్యూహం చూస్తే చాలామందికి అనుమానం కలుగుతోంది. కేంద్రమంత్రుల్ని రాజీనామా చేయించిన తర్వాత.. ఎన్డీయేలో తెదేపా ఇంకా ఎందుకు ఉన్నట్లు?.. ఈ సందేహం చాలామందికి కలుగుతోంది. దేశంలో మూడోఫ్రంట్‌ పేరుతో గానీ మరో రకమైన పేరుతో గానీ.. రాజకీయ పునరేకీకరణల గురించి అనేకానేక చర్చలు జరుగుతూ ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ఇంకా తమ పదవులు ఉడిగించుకుని అదే ఎన్డీయేలో ఎందుకు కొనసాగుతున్నారు? అనేది ప్రజల సందేహం. రెండు రోజులుగా ఈ సందేహం రాని వ్యక్తిలేరు. ఇలాంటి అనేక సందేహాలకు సమాధానం పైన మనం చెప్పుకున్నదే.

చంద్రబాబునాయుడుకు సమకాలీన రాజకీయాల్లో చాలా దృఢమైన అపకీర్తి ఉంది.  ప్రత్యర్థులు ఆయనను వెన్నుపోటు దారుడు అని పదేపదే ప్రచారం చేశారు. 'వెన్నుపోటు' అనేది చంద్రబాబు అనే పేరుకు పర్యాయపదం లాగా ప్రజల్లో నాటుకుపోయింది.

ఈ తరహాలో చంద్రబాబు ఏ చిన్న పనిచేసినా.. సరే.. ప్రజలు ఆ పేరుతో వ్యవహరించడం ప్రారంభిస్తున్నారు. అందుకే చంద్రబాబునాయుడుకు ఆ అపకీర్తిని తుడిచేసుకోవడం అనేది చాలాముఖ్యం. తాజా పరిణామాల్లో ఆయన అందుచేతనే ఇంకా ఎన్డీయేలో ఉండడానికి మొగ్గు చూపించారు. కానీ ఒకసారి అంత స్ట్రాంగుగా వచ్చిన పేరు అంత సులువుగా పోయేది కాదు. ఇలాంటి సమయంలో.. తొలినుంచి చంద్రబాబుకు అంతటి ఘనమైన కీర్తి రావడం ఎలా సాధ్యమైంది? అని తెలుసుకోవాలంటే.. ఓసారి చరిత్రలోకి ట్రాక్‌ రికార్డును పరిశీలించాల్సిందే.

ఆయన ఎదిగిన క్రమంలో ప్రతి దశలోనూ ఒక వెన్నుపోటు కనిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబునాయుడు తన నీడను కూడా నమ్మరు అనే ఘనమైన కితాబు ఉన్న వ్యక్తి. అలాంటి నాయకుడిని నమ్మి ఒకసారి పొత్తు పెట్టుకున్న వారు.. మళ్లీ ఆయనతో పొత్తులకు ప్రయత్నించిన సందర్భాలు లేవు. అలాగే ఆయన చేతి 'పోటు' దెబ్బ పడకుండా మిగిలిఉన్న వారు కూడా చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీకి ఇది రెండోసారి. ఇలాంటి సమయంలో 'పోటు' చరిత్రను అవలోకించుకోవడం అవసరం.

బాబు 'పోటు'ది కూడా నలభయ్యేళ్ల సీనియారిటీ!

కొన్ని రోజుల కిందటే.. నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం నలభయ్యేళ్ల మైలురాయిని పూర్తిచేసిన ఘనమైన సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరో కోణంలోంచి చూసినప్పుడు ఆయన తనదైన ముద్రతో పరిణతి సాధించిన 'పోటు' కూడా అంతే సీనియారిటీని కలిగి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన నాటినుంచి ఇదే పనిలో ఉన్నారు. ఇదే టెక్నిక్‌ ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజానికి 'సక్సెస్‌' సాధించడానికి, రాజకీయ సమరాంగణంలో విజయం దక్కించుకోవడానికి చంద్రబాబు వద్ద ఉన్న అనేకానేక అస్త్రాల్లో అత్యంత ముఖ్యమైన బ్రహ్మాస్త్రం ఇదే.

తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెస్‌ పార్టీనే ఆయన తొలిపోటును రుచిచూసింది. చాలా చిన్న వయసులో చంద్రబాబునాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అయి.. మంత్రి కూడా అయ్యారు. అప్పటికి ఎన్టీఆర్‌ ఇంకా తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. చంద్రబాబు తన ఇంటర్వ్యూల్లో.. ఆ సమయంలో రాజకీయ పార్టీ స్థాపించాల్సిందిగా ఎన్టీఆర్‌కు తానే చాలాసార్లు సలహా ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. అది నిజమే కావొచ్చు. ఈ సంగతిని ఆయన స్వయంగా టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పి ఇంకా రెండు వారాలు కూడా గడవలేదు.

ఒక్కసారి ఆ పరిస్థితిని గుర్తు చేసుకుంటే.. చంద్రబాబునాయుడు మనఃస్థితి, ప్రవృత్తి అంటే భయం కలుగుతాయి. ఆ సమయానికి ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి గెలిచిన 28 ఏళ్ల మంత్రి. ఏదో పార్టీలో అప్పటికే కొన్ని దశాబ్దాలుగా ఉండి, ఢక్కామొక్కీలు తిన్న నాయకుడు అయితే గనుక.. పార్టీ రాజకీయాలకు విసిగి వేసారి.. పిల్లనిచ్చిన మామకు రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవడానికి అలాంటి సలహా ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అదే చంద్రబాబునాయుడు చాణక్యం.

ఒకటోసారి ఎమ్మెల్యే కాగానే మంత్రిపదవి ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా మామతో పార్టీ పెట్టించారు. తాను మాత్రం ఆ పార్టీలో చేరలేదు. ఆ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజాస్పందనను బట్టి అర్థమైనప్పటికీ.. ఆయన పార్టీ మారలేదు. ఎందుకంటే.. తనకు చెడ్డపేరు రాకూడదు. (ఇప్పుడు అనుసరిస్తున్న టెక్నిక్‌ మాదిరిగానే).

తీరా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామానాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అదే తెలుగుదేశంలో తాను చేరి.. కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని చక్రం తిప్పడం ప్రారంభించారు. తనను ఓడగొట్టిన మేడసాని వారి పొడ కూడా రాజకీయాల్లో లేదు. ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ అడగరాదు. ఆ రకంగా చంద్రబాబునాయుడు తొలిపోటును ఆయనకు తొలి అవకాశం ప్రసాధించిన కాంగ్రెస్‌ చవిచూసింది. తల్లి లాంటి కాంగ్రెస్‌ను తొలిదెబ్బ కొట్టిన తర్వాత.. మలిదెబ్బ మామకే పడిందని చెప్పుకోవాలి...

నామమాత్రపు అధినేతగా...

తెలుగురాష్ట్రపు రాజకీయాలలోనే ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర. తన సినిమా క్రేజ్‌ ద్వారా రాజకీయ రంగంలో ప్రవేశించి.. అతి స్వల్పకాలంలో అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా, అనేక విషయాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన చరిత్ర ఎన్టీఆర్‌ది. అలాంటి ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తే.. ఆరేళ్లలోనే ఉత్సవ విగ్రహం లాంటి అధినేతగా మారిపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు.

1989లో తెదేపా ప్రతిపక్షానికి పరిమితం అయినప్పుడు.. ఎన్టీఆర్‌లోని అహంభావాన్ని తట్టిలేపి.. ఆయనను అసెంబ్లీకి దూరం ఉంచి.. తద్వారా ఆయనను మొక్కుబడి అధినేతగా మార్చేసి.. పార్టీ పగ్గాలను మొత్తం తన చేతిలోకి తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక విజయం సాధించారు. అలా మలిపోటు మామకు దక్కింది.

అది 1994. ఎన్టీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కానీ పార్టీలో పరిస్థితులు మారాయి. పగ్గాలు చంద్రబాబు చేతిలో స్థిరంగా ఉండలేకపోయాయి. అధికార కేంద్రాలు పెరిగాయి. ఆ రకంగా ఎన్టీఆర్‌ అలర్ట్‌ కావడం అనేది చంద్రబాబు సహించలేకపోయారు. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని బాబు సహించలేకపోయారు. మంచోచెడో తర్వాతి సంగతి.. అసలు తన ప్రమేయం లేకుండా అడుగు వేయగల స్థితిలో ఎన్టీఆర్‌ స్వయం చాలితంగా ఉండడమే ఆయనకు కిట్టలేదు. భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయంగా మిగిలిపోయే అసలు 'పోటు'కు అప్పుడే పథక రచన జరిగింది. ఇప్పుడున్నంత సాంకేతిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు లేకపోవడం ఆయన కౌటిల్య ఉపాయాలకు దన్నుగా నిలిచింది.

ఒక్క హోటల్‌ గది.. ఒక్క పత్రిక... రకరకాల మాయోపాయాలు.. వెరశి పార్టీ మీద అధికారం చంద్రబాబునాయుడు చేతికి వచ్చింది. అంతటి అసహాశూరుడైన ఎన్టీఆర్‌ నడిరోడ్డు మీద వ్యాను ఎక్కి దీనారావాలు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆడిన మైండ్‌ గేమ్‌ ఆరోజునాటికి నాయకుల మీద ఎలా పనిచేసిందంటే.. ఇవాళ్టికి కూడా ఎన్టీఆర్‌ బొమ్మ కనిపిస్తే.. సభక్తికంగా దణ్నం పెట్టుకునే అనేకమంది నాయకులు.. ఆ రోజున మాత్రం.. బాబును వీడి ఆయనకు అండగా నిలవలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

ఆ ఒక్క ఎపిసోడ్‌ చంద్రబాబుకు ఎన్నటికీ చెరగిపోని కీర్తిని ఇచ్చింది. ఒక పార్శ్వంలో వెన్నుపోటు కీర్తి అయితే.. మరో పార్శ్వంలో తెలుగు రాష్ట్రానికి అతిసుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కీర్తికూడా ఆయనకే దక్కింది. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి.. ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొలిపే వరకు ఈ హవా నడిచింది.

ఈమధ్యలో కొన్ని పోట్లు!

1996లో పార్లమెంటు ఎన్నికలు జరిగిన సందర్భంలో కేంద్రంలో చంద్రబాబునాయుడు చక్రం తిప్పారు. అప్పటికే చాణక్య తెలివితేటలు అనేకం నిరూపణ అయి ఉండడంతో.. ఆయన చాలా సునాయాసంగా కొన్ని చిన్న జాతీయ పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీల సమాహారం అయిన నేషనల్‌ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా అయ్యారు. ఆ క్రమంలోనే దేవేగౌడ, ఐకె గుజ్రాల్‌లను ప్రధానమంత్రులను చేశారు.

తాను ఫ్రంట్‌ కన్వీనర్‌గా తప్పుకోకుండానే.. ఆ ఫ్రంట్‌ అధికారాన్ని కుప్పకూల్చిన ఘనత చంద్రబాబునాయుడుది. 1998లో ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. వాజ్‌పేయి సర్కారు ఏర్పడింది. ఒకసారి కూలిపోయి.. మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2004దాకా అదే ఎన్డీయేలో ఉండిన చంద్రబాబు.. ఆ సమయంలో.. భాజపాకు హవా పడపోయిందని అర్థమైన తర్వాత.. ఆ భారాన్ని చాలా సునాయాసంగా దించుకున్నారు.

భాజపాతో జట్టుకట్టి చారిత్రక తప్పిదం చేశానని ప్రకటన చేసి.. ఆ కూటమినుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఊహించినట్టే.. 2004 ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. కానీ.. భాజపాకు తన పోటును రుచి చూపించిన ఆ సందర్భంలో... చంద్రబాబు కుయుక్తుల్ని తెలుగు ప్రజలు గమనించారు. ఆయన సారథ్యంలోని తెలుగుదేశాన్ని కూడా దారుణంగా ఓడించారు. ఆ దెబ్బనుంచి చంద్రబాబు ఒక పట్టాన కోలుకోలేకపోయారు. వైఎస్‌ పాలన ప్రారంభం అయ్యాక.. 2009 ఎన్నికల్లో కూడా నిలదొక్కుకోవడం ఆయనకు సాధ్యంకాలేదు.

తన పబ్బం గడవడమే ముఖ్యం!

చంద్రబాబునాయుడుకు తన పబ్బం గడవడం ఒక్కటే ముఖ్యం..! ఇందుకు ప్రబల నిదర్శనం 2009 ఎన్నికలు. అప్పటికే ఆయన అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. ఎలాగైనా వైఎస్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ను ఓడించాలి. అందుకు సిద్ధాంత సారూప్యతలు, భావజాలాలు వీటితో నిమిత్తం లేకుండా.. రాష్ట్రాన్ని రెండుముక్కలు చేయడానికి పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఘనంగా గెలవగలం అనుకున్నారు. కానీ ఆ ప్రయోగం వికటించింది. రెండు పార్టీలూ ఘోరంగా ఓడిపోయాయి. ఆ వెంటనే తెరాసను చంద్రబాబు ఒక్కపోటు పొడిచారు. ఓటమి దక్కిన వెంటనే వారిని వదిలించుకున్నారు. ఆ సందర్భంలో తెరాసకు ఉన్న క్రేజ్‌ను వాడుకుని, వారి ఓటు బ్యాంకును కూడా దక్కించుకోవడానికి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఒక 'డీల్‌' కుదుర్చుకున్నారని.. ఓడిపోయిన తర్వాత.. ఆ డీల్‌ కూడా నెరవేర్చకుండా మోసం చేశారని కూడా రాజకీయ వర్గాల్లో ఒక పుకారు ఉంది.

మధ్యలో ఆయన వామపక్షాలతోనూ స్నేహం నెరపారు. 2014 వచ్చేసరికి.. దేశంలో మోడీ హవా విపరీతంగా ఉన్నట్లు అర్థమైంది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో.. మోడీకి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్లు చేసిన చంద్రబాబు.. 2014లో వామపక్షాలను చాలా సునాయాసంగా వదిలించుకుని.. మోడీని నెత్తిన పెట్టుకున్నారు. (అయితే ఆ ఎన్నికల్లో భాజపా వల్ల ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి రాలేదని ఇప్పుడు అంటుండడం విశేషం).. పవన్‌ కల్యాణ్‌ను కూడా సమానంగా వాడుకుని.. కేవలం రెండున్నర శాతం ఓట్ల ఆధిక్యంతో అధికారం దక్కించుకున్నారు. మోడీ హవా, పవన్‌ కల్యాణ్‌లలో ఏ ఒక్కటి లేకున్నా.. చంద్రబాబు పరిస్థితి ఏమిటో ఊహించుకోవడానికే సాధ్యంకాని సంగతి.

రోజులు గడిచేకొద్దీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రసర్కారు అందించే సాయం సంగతి తర్వాత.. తాను ఎన్నిమాటలు చెబుతున్నా.. రాష్ట్రంలో పురోగతి.. రాజధాని, పోలవరం అనేవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయనే సంగతి ఎన్నికల నాటికి బయటపడిపోతుందని చంద్రబాబుకు స్పష్టత ఉంది. అందుకే.. సకాలంలో మేలుకున్నారు. ఈసారి పోటు భాజపాకు పడింది.

ఈ పార్టీ ద్రోహం చేసింది.. మోసం చేసింది.. అంటూ పొలికేకలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం శవాసనం వేసినందుకు  అసలు కారణం మోడీ మరియు కేంద్ర ప్రభుత్వమే తప్ప తనకేమీ సంబంధంలేదని.. తనెంత కష్టపడుతున్నా వారు ద్రోహంచేసి ముంచేశారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకరకంగా చంద్రబాబు పోటు రుచిచూడడం భాజపాకు ఇది రెండోసారి.

గతంలో భాజపాను పోటు పొడిచిన సందర్భంలో చంద్రబాబు కూడా ఏమీ బావుకోలేదు. ఆయన భాజపా మీద ఇదేస్థాయిలో నిందలు వేసినా.. పాపంలో ఆయనకు కూడా వాటా ఉందని ప్రజలు నమ్మి దారుణంగా ఓడగొట్టారు. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుందా? మోడీ సర్కారు మీద ఆయన ఎంతగా నిందలు వేసినా.. జరిగిన పాపంలో.. అభివృద్ధి స్తంభించిపోవడంలో.. చంద్రబాబు చేతగానితనం యొక్క వాటా కూడా పుష్కలంగా ఉన్నదని జనం నమ్ముతున్నారా? లేదా? అనే సంగతి మరి కొన్నాళ్ల తర్వాత తేలుతుంది.

ఈసారి 'పోటు'కు కూడా స్కెచ్‌ సిద్ధం!

ఇప్పటిదాకా ప్రతిసారీ.. ఒక్కొక్కరిని పోటు పొడుస్తూ చంద్రబాబునాయుడు.. దేశంలో ఉన్న దాదాపు అన్ని ముఖ్య రాజకీయ పార్టీలనూ తలోసారి వంచించి.. తనకు మెట్లుగా వాడుకుంటూ.. నలభయ్యేళ్ల ప్రస్థానం పూర్తిచేశారు. ఆయన చేతిలో ఈసారి దెబ్బతినేది ఎవరు? ఈ డౌటు సహజంగానే వస్తుంది. ఆ స్థానంలో ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఆయన పార్టీ జనసేన కూడా ఉంది. చంద్రబాబు సరిగా పనిచేయలేదని అంటూనే.. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశంతో కలిసి పోటీచేయాలని తెగ కుతూహలంగా ఉన్నారు. ఆ డీల్‌ ఆల్రెడీ కుదిరిపోయింది. అది తథ్యం కూడా!

కాకపోతే ఆ తర్వాత.. ఎన్నాళ్లకు పవన్‌ కల్యాణ్‌కు 'చంద్రపోటు' రుచి స్వానుభవంలోకి వస్తుంది? అనేది ఇక్కడ ప్రశ్న. కాపువర్గంలో పవన్‌కు స్థిరమైన సాలిడ్‌ ఓటు బ్యాంక్‌ లేదని తెలిసినా, ఆయన సభల్లో కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ, హాహాకారాలు చేస్తూ ఉండే కుర్రకారు.. ఓట్లుగా పార్టీకి విజయం అందించేంత సత్తాగల వారు కాదు.. అనే సత్యం బోధపడినా.. చంద్రబాబు చిటికెలో పవన్‌ కల్యాణ్‌ను పోటు పొడవగలరు. (అదేదో తేలేదాకా పవన్‌ కల్యాణ్‌ ఆర్భాటాలకు పోయి.. 'ఇక సినిమాలు చేయను' లాంటి దండగమాలిన ప్రకటనలు చేయకుండా... ఆ ట్రాక్‌ను సజీవంగా ఉంచుకుంటే మంచిది. లేకుంటే రెంటికి చెడినట్లు అవుతుంది.)

అంతిమ పోటు ఎవరికి?

చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయాల వల్ల ఆయన పోటు రుచిచూడని వారు.. దేశంలో లేరని అర్థమౌతోంది. మరి అంతిమ పోటు ఎవరికి.? మరెవ్వరో కాదు.. ఆ దెబ్బ ప్రత్యేకంగా కేటాయించబడి ఉన్నది తెలుగుప్రజల కోసమే. చంద్రబాబునాయుడు ప్రతిసారీ.. తన నలభయ్యేళ్ల సీనియారిటీని ప్రస్తావిస్తుంటారు. సీనియారిటీది ఏముంది.. చెట్టుచేమలకు, రాళ్లు రప్పలకు కూడా సీనియారిటీ ముదిరిపోతుంటుంది. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు జనసామాన్యానికి సంఘహితానికి ఎంత ఉపయోగపడ్డాం.. అనేది కీలకంగా భావించాలి. తాను టెక్నాలజీకి ఎలా ఉపయోగపడ్డాను అని కాదు.. తాను ప్రజల కన్నీళ్లను తుడవడానికి, వారి కడుపులు నింపడానికి ఏం చేశాను అని చెప్పుకోవడానికి తనకంటూ ఒక ట్రాక్‌ రికార్డును సష్టించుకోవాలి. 

చంద్రబాబుకు ఒక వినతి.. నలభయ్యేళ్ల ప్రస్థానంలో మైలురాళ్లు అంటే.. 

దాటివచ్చిన సంవత్సరాలు.. దశాబ్దాల కేలండర్‌ పుటలు కాదు!
ఏయే పార్టీలు, కూటములు పతనం కావడానికి కారణభూతమైన మన పోటు దెబ్బలు కూడా కాదు!!
అచ్చంగా సంఘహితానికి, సామాన్యులకు ఉపయోగపడిన.. మీదైన ముద్రగల సేవలు మాత్రమే. 
గుండెల మీద చేయి వేసుకుని.. ఓసారి వాటిని సమీక్షించుకోండి. 
68ఏళ్ల వార్ధక్యం వచ్చినా.. ఇంకా మీకు ఒక ఏడాది గడువుంది. 
అలాంటి వాటిని సృష్టించుకుని.. 
రియల్‌ టైం గవర్నెన్స్‌ గదిలో మాయా కంప్యూటర్‌ తెరలమీద కాదు.. 
ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోండి. 

-కపిలముని
-Kapilamuni.a@gmail.com