cloudfront

Advertisement


Home > Politics - Gossip

మమ్మల్ని గెలిపించండి.. మిమ్మల్ని ఓడిస్తాం

మమ్మల్ని గెలిపించండి.. మిమ్మల్ని ఓడిస్తాం

తెలంగాణ ఎన్నికల బరిలో మహాకూటమి ముసుగులో ఒక  జట్టుకు పెత్తనాన్ని చేతబుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంతటి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నదో తెలియడానికి ఇదే నిదర్శనం. వారు భాగస్వామ్య పక్షాలకు పెడుతున్న డీల్ ఎలా ఉంటున్నదంటే.. ‘మీరు కష్టపడి పనిచేసి.. మేం పోటీచేసే స్థానాల్లో మమ్మల్ని గెలిపించండి... మేం మావంతు, మా మార్కు కృషిచేసి మీరు పోటీచేసే స్థానాల్లో మిమ్మల్ని ఓడిస్తాం’ అని ప్రతిపాదిస్తున్నట్లుగా ఉంది. అవును మరి.. తెలంగాణ జనసమితితో సీట్ల బేరాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఆఖరివిడత చర్చల్లో కాంగ్రెస్ మాటలు ఇలాగే ఉంటున్నాయి.

తెలంగాణ జనసమితి కూటమిలోకి ప్రవేశించిన నాటినుంచి ఇప్పటిదాకా అంచెలంచెలుగా చాలామెట్లు దిగి వచ్చింది. తొలుత 39 స్థానాల వద్ద ఉన్న కూటమి నిదానంగా 19 సీట్ల వరకు బేరానికి వచ్చింది. కోదండరాం అనేక సందర్భాల్లో మాకు 19 సీట్లు ఇచ్చి తీరాల్సిందే.. లేకుంటే మేం ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం... మా దారి మేం చూసుకుంటాం అని వెల్లడించారు. కానీ మంగళవారం తుదివిడత చర్చలు జరిగే సమయానికి 11 సీట్ల వరకు తెజస దిగివచ్చింది. వారికి 3-4 సీట్లు ఇవ్వడానికి తొలుత మొగ్గు చూపించిన కాంగ్రెస్ పార్టీ.. చివరికి 9 సీట్లు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ కోదండరాం తమకు 11 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని, గట్టిగా పట్టుపట్టడంతో కాంగ్రెస్ ఓ ప్రత్యామ్నాయం సూచించిందట.

అదేంటంటే.. ఆ రెండు మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా స్నేహపూర్వకంగా పోటీచేస్తారట. ఇదీ వారి ప్రతిపాదన! కొండంత రాగం తీసి లొల్లాయి  పాట పాడినట్లుగా... తొలిరోజే 105 సీట్లను ప్రకటించిన కేసీఆర్ కు వ్యతిరేకంగా.. ఆ తర్వాతి రెండు రోజుల్లో కూటమిని ప్రకటించిన ఈ పార్టీలు నెలరోజులకు పైగా మంతనాలను సాగదీసి.. చివరికి తేల్చింది ఇదన్నమాట.. అని ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

స్నేహపూర్వకంగా అయినా సరే.. బ్యాలెట్ లో హస్తం గుర్తు కూడా ఉంటే.. కొత్తగా వచ్చిన అగ్గిపెట్టె గెలిచేదెలాగ? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని ఏ ఎజెండాతో అయితే.. సిద్ధాంత సారూప్యత లేని ఈ పార్టీలన్నీ జట్టుకట్టాయో.. ఆ ప్రమాదం పొంచి ఉంటుంది కదా!

11 సీట్లు ఇచ్చి 2-3 చోట్ల కాంగ్రెస్ స్నేహపూర్వకంగా పోటీచేస్తే..  వారి 95 సీట్లలో తెజస ఓ 20 సీట్లలో ‘ స్నేహపూర్వకంగా’ పోటీచేస్తే.. అందరూ కలసి ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుని కేసీఆర్ కు అసామాన్య విజయం కట్టబెడతారని అంతా అనుకుంటున్నారు.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్