cloudfront

Advertisement


Home > Politics - Gossip

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇన్‌చార్జిల ఖో.. ఖో..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇన్‌చార్జిల ఖో.. ఖో..!

రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలతో ఖో.. ఖో.. ఆట ఆడిస్తున్నాడు ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇన్‌చార్జిల మార్పు అనేది అక్కడ నిత్యం అయిపోవడం గమనార్హం. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో అయితే.. ఎవరికి టికెట్‌ దక్కుతుంది? ఎవరు సైడైపోతారు అనేది అంతుబట్టని అంశంగా మారింది.

అటువైపు అనంతపురం అర్బన్‌ సీటు నుంచి ఇటువైపు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వరకూ ఇన్‌చార్జిలు మారుతూనే ఉన్నారు. కొత్తవారు వస్తున్నారు.. పాతవాళ్లకు ఖో చెబుతున్నారు. ఇలాంటి మార్పుచేర్పులు  కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా గురునాథ్‌ రెడ్డి తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడంతో వైసీపీలో మార్పులు మరిన్ని ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇన్‌చార్జిగా అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు. గతంలో అనంత ఎంపీగా పోటీ చేశారాయన. కొన్నాళ్ల కిందట నదీం అహ్మద్‌ను హిందూపురం ఎంపీ సీటు ఇన్చార్జిగా పంపించిన జగన్‌ అనంతపురం అర్బన్‌ సీటును వెంకట్రామిరెడ్డికి వదిలినట్టుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు అనంతలో అనంత పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడు.

కానీ.. ఇక్కడ నుంచి టికెట్‌ అనంతకు కన్ఫర్మ్‌ కాదనేమాట వినిపిస్తోంది. అనంత వెంకట్రామిరెడ్డిని కల్యాణదుర్గం సీటుకు పంపే ఆలోచనలో ఉన్నాడట జగన్‌. అక్కడ పార్టీలో గ్రూపులుగా ఏర్పడి రచ్చలు రేగిన నేపథ్యంలో సీనియర్‌ అయిన వెంకట్రామిరెడ్డిని కల్యాణదుర్గం పంపించాలని జగన్‌ భావిస్తున్నట్టుగా సమాచారం.

ఇంతలోనే గురునాథ్‌ రెడ్డి మళ్లీ వైసీపీలోకి రావడంతో.. అనంతపురం అర్బన్‌ సీటు గురునాథ్‌ రెడ్డికే దక్కుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎక్కడ మొదలైందో కథ అక్కడకే రావడం విశేషం. గురునాథ్‌ రెడ్డి పోయి.. నదీం అహ్మద్‌ వచ్చాడు. అహ్మద్‌ పోయి.. అనంత వచ్చాడు. అనంత స్థానంలో ఇప్పుడు మళ్లీ గురునాథ్‌ రెడ్డి!

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం వైసీపీకి అనుకూలమైనది. అలాంటి చోట ఇలా మార్పులు జరుగుతూనే ఉండటం విశేషం. ఈ మార్పులు  ఒక్క అనంతకే పరిమితం కావడంలేదు. మరిన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతున్నాయి. హిందూపురంలో ఇటీవలే ఇన్‌చార్జి మారాడు. ఇక హిందూపురం ఎంపీ సీటు కూడా నదీం అహ్మద్‌కే దక్కుతుందా లేక గోరంట్ల మాధవ్‌ వంటివాళ్లు రంగంలోకి దిగుతారా? అనేది ప్రశ్నగానే ఉంది.

అనంతపురం ఎంపీ టికెట్‌ మాత్రం తలారి రంగయ్యకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పుట్టపర్తి విషయంలోనూ జగన్‌ మార్పుచేస్తాడా? అనే సందేహాలున్నాయి. అక్కడ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నాలుగేళ్ల నుంచి గట్టిగా పనిచేస్తున్నాడు. అతడు జనాల్లోకి వెళ్లాడు కూడా. ఇప్పుడు అక్కడ కొత్తవాళ్లు ఆశావహులుగా కనిపిస్తున్నారు. దీంతో మార్పు అంటున్నారు. మరీ అలా మార్పులు చేస్తే మాత్రం.. జగన్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.

ఎందుకంటే.. అనంతపురం జిల్లాలో వైసీపీ ఎక్కడ గెలిచినా.. ఏదో స్వల్ప మెజారిటీలతో బయటపడాల్సిందే. ఇలాంటిచోట పార్టీని కుదురుగా నడుపుకోవాల్సి ఉంటుంది. జనాల్లో కాస్త నలిగిన వారికి, నాలుగేళ్ల నుంచి కష్టపడ్డ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అంతేకానీ.. ఇలా వాళ్లు వచ్చారని వీళ్లను పక్కనపెట్టి, వీళ్లు వచ్చారని వాళ్లను పక్కన పెడితే.. అనంతపురం వంటిచోట వైసీపీకి వచ్చే సీట్లు కూడా పోయే అవకాశాలు లేకపోలేదు!

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్