Advertisement


Home > Politics - Gossip
వైఎస్సార్సీపీ వైఫల్యం

అధికార పార్టీపై ఉదాశీనత

విపక్ష పాత్రను పోషిస్తున్న జిల్లా మంత్రి

కోరస్‌ అందుకున్నా దక్కని పొలిటికల్‌ మైలేజ్‌

ప్రధాన ప్రతిపక్షమంటే ప్రభుత్వానికి దడ పుట్టించేలా ఉండాలి, ఏ చిన్న ఘటన జరిగినా దానిని కొండంత చేసే నైపుణ్యం కావాలి, నిత్యం అధికార పార్టీ చెవిలో జోరిగలా రచ్చ చేయాలి, విశాఖ జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఈ లక్షణాలు మచ్చు కైనాలేవు. గత మూడేళ్లుగా సాగుతున్న టీడీపీ ప్రభుత్వంలో అనేక వైఫల్యాలు తొంగి చూసినా కించిత్‌ మాత్రం కూడా స్పృశించక పోవడం ఆ పార్టీకే చెల్లింది.

అన్ని వర్గాల ప్రజానీకం సమస్యలతో సతమతమవుతున్నా వాటిని గుర్తించి పోరాడే సత్తా కూడా లేని దుస్థితిలో ఆ పార్టీ ఉందంటే అతిశయోక్తి కాదు, అన్నింటికీ మించి విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రాజకీయ పోరురగులుతోంది, పర్యవశానంగా రెండు వర్గాలుగా ఎమ్మెల్యేలు విడిపోయారు, అచ్చం కాంగ్రెస్‌ సంస్కృతి ప్రస్తుతం టీడీపీలో ఉంది.

ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని పార్టీ జెండాను రెపరెపలాడించాల్సిన చోట నాయకత్వం నిలువునా చతికిలపడి పోయింది. ఫలితంగా విపక్ష పాత్రను సైతం అధికార పక్షమే ఎంచక్కా పోషిస్తోంది. తాజాగా వెలుగు చూసిన జిల్లాలోని అతి పెద్ద భూ కుంభకోణంపై మొదట బాంబు పేల్చింది ఎవరో కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు.

ఆయన ఒకసారి కాదు, పలు మార్లు అనేక వేదికలపై భూ దందాను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వాన్ని పరోక్షంగా ఏకి పారేశారు. నవనిర్మాణ దీక్షలోనైతే మంత్రి చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి అడుగడుగునా జనం నుంచి విశేష స్పందన లభించిందంటే అది విపక్షం దారుణమైన వైఫల్యానికి నిఖార్సైన నిదర్శనం.. ఓ రకంగా చెప్పాలంటే ఈ భూ భోగోతాన్ని గట్టిగా ఎండగట్టడం ద్వారా జిల్లా ప్రజానీకంలో అయ్యన్న హీరో అయిపోయారు.

అలాగే, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి చెందిన శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు సైతం జిల్లాలోని ముదపాకలో చోటుచేసుకున్న ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారాన్ని రెండు నెలల క్రితం బయటపెట్టడమే కాదు, మిత్ర ప్రభుత్వంపై పెద్ద పోరాటమే చేశారు. ఈ విధంగా జిల్లాలోని భారీ స్కాంల భాగోతాల గుట్టు మట్టులు విప్పినది ఆ ప్రభుత్వానికి చెందిన వారే కావడం విశేషం.

ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఏ విధంగానూ ఈ అంశాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. కీలకమైన ఈ అంశంపై పోరాటం చేయడం ద్వారా జనాలకు దగ్గర కాలేకపోయింది. అంతా అయిపోయాక తాపీగా తామున్నా మన్నట్లుగా కోరస్‌ అందుకుంటూ ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీపై తిట్ల దండకం వినిపించడంతోనే జిల్లా నేతలకు సరిపోతోంది.

దాంతో, జిల్లాలో విపక్షం అసలు ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూ దందాపై మంత్రి అయ్యన్న చేసిన ఘాటు విమర్శలతో టీడీపీ సర్కార్‌ కదలి వచ్చింది, తాజాగా ప్రత్యేక దర్యాప్తు సంస్ధను కూడా ఏర్పాటు చేసింది. రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా జిల్లాకు వచ్చి భూ కబ్జాలపై బహిరంగ విచారణ జరిపించబోతున్నారు.

వైసీపీకి సంబంధం లేకుండానే ఈ పరిణామాలు వరుసగా జరిగిపోతున్నాయి. ఓ రాజకీయ పార్టీకి ఇంతకంటే వైఫల్యం వేరే ఉండబోదన్నది ఆ పార్టీ నేతల అంతర్గత సంభాషణలలోనే తేలుతున్న వాస్తవం. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్‌ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ భూ దందాపై అయ్యన్న ప్రకటన తరువాత మూడు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చంద్రబాబును, లోకేష్‌బాబును ఎండగట్టారు. ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

అంతా బాగానే ఉంది, జిల్లాలో భూ దందాకు సూత్రధారులెవ రన్నది తెలిసినా అసలు విషయం చెప్పకుండా ముగించడంలోనే అంతరార్ధం దాగుందని అంటున్నారు. జిల్లాలో భూ దందాపై అయ్యన్న అంత ఘాటుగా విరుచుకుపడడానికి ప్రధాన కారణం. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలోని కొందరు ఇందు లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఉండడమే.

మరీ ముఖ్యంగా, గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గంలోని మధురవాడ, ఆనందపురం వంటి చోట్లనే భారీ ఎత్తున భూ భోగోతం చోటుచేసుకుంది. ఇప్పటికే భీమిలీ, విశాఖ రూరల్‌ తహశీల్దార్లు అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ కావడంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరి పాకాన పడింది. అలాగే, పెందుర్తిలోని ముదపాక ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వర్గీయుల పాత్రపైనా ఆరోపణలు ఉన్నాయి.

ఆయన సైతం గంటా బ్యాచ్‌లో ఉన్నారు. ఇలా జిల్లాను అట్టుడికిస్తున్న భూ దందాలలో అధికార పార్టీ నేతల ప్రమేయం బలంగా ఉందని వినిపిస్తున్న క్రమంలో వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబును, లోకేష్‌ను తిట్టడంతో సరిపెట్టడం వెనుక మతలబు ఏంటని ఆ పార్టీలోనే తర్కించుకుంటున్నారు.

సామాజిక బంధంతో పాటు, ఇతర సంబంధాలు కారణంగానే గంటా అండ్‌ కోను కనీస మాత్రంగా కూడా బొత్సతో పాటు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్‌ విమర్శించడం లేదని సొంత పార్టీ వారే అంటున్నారు. ఇలా రాజకీయం చేస్తే ప్రజలకు ఎలా జవాబుదారీగా ఉంటాం, తప్పును తప్పుగా చూపించి జనంలోకి వెళ్లి పోరాడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నది నిజమని కొంతమంది వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

పాత రాజకీయ సంబంధాలను, కుల బంధాలను అడ్డం పెట్టుకుని విమర్శలు చేయక పోవడం వల్ల మొత్తానికి మొత్తం పార్టీయే నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన బొత్సకు మూడు జిల్లాలలోనూ వ్యాపార, రాజకీయ, కుల సంబంధాలు బాగానే ఉన్నాయి. వారిలో చాలా మంది ఇపుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా, ప్రముఖ నాయకులుగా ఉన్నారు.

దీంతో, అధికార పార్టీ చేసే అరాచకాలను చూసీ చూడనట్లుగా వదిలేయడం జరుగుతోందని వైసీపీలో అసంతృప్తి గళాలు అంటున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో బొత్సకు వ్యాపార సంబంధాలు ఉండడం వల్ల ఆయన అక్కడ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ ఎదిరించకూడదన్న అనధికార ఆదేశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో గంటా అండ్‌ కోపై బలమైన వ్యతిరేక వాణిని వినిపించే నేతగా జిల్లా మంత్రి అయ్యన్న గుర్తిం పు తెచ్చుకున్నారు. అదే విధంగా బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా టీడీపీ నేతల అక్రమాలను ఎక్కడికక్కడ కడిగేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజా సమస్యలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తెర వెనుక రాజకీయ బంధాలను తెంపుకుంటే తప్ప జిల్లాలో వైసీపీ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నాయకులే కుండ బద్దలు కొడుతున్నారు.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌