cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇక్కడ ‘0’... అక్కడ ‘1+1’

ఇక్కడ ‘0’... అక్కడ ‘1+1’

కొండాసురేఖ అంటే ఒకప్పట్లో రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ మహిళా నాయకుల్లో ఒకరు. పదవులు, హోదాలు లేకుండా ఫైర్ బ్రాండ్ లుగా పేరు తెచ్చుకునే వాళ్లు అనేకులు. కానీ మంత్రి పదవిలో ఉంటూ.. ఆ పదవిని త్యజించిన తర్వాత.. ఫైర్ బ్రాండ్ గా రెచ్చిపోయి మాట్లాడడం అనేది కొండా సురేఖకే మాత్రం చెల్లిన వ్యవహారం. అలాంటి నాయకురాలు.. గత నాలుగేళ్లుగా పూర్తిగా మరుగున పడిపోయారు. అలా అనడం కంటె.. తెలంగాణ రాష్ట్ర సమితి... ఆమెను లూప్ లైన్ లో పెట్టేసింది- అంటే బాగుంటుంది. చివరికి ఇప్పుడు సురేఖకు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కలేదు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉన్న సురేఖ, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే తన పదవిని వదులుకుని వచ్చి అందులో చేరారు. అప్పటినుంచి జగన్ కు దన్నుగా నిలిచారు. కానీ విభజన తర్వాతి పరిణామాల్లో ఆమె జగన్ మీద కూడా కొన్ని విమర్శలు గుప్పించి.. తెరాస తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఆ పార్టీ తరఫునే ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ సూచన మేరకు సొంత నియోజకవర్గం పరకాలను వదలుకుని, వరంగల్ తూర్పు నుంచి పోటీచేసినా గెలిచారు.

మంత్రిపదవి ఆశించారు గానీ కుదర్లేదు. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు, తన భర్త కొండా మురళికి కూడా టికెట్ అడుగుతుండగా.. కేసీఆర్ భారీ షాక్ ఇచ్చి.. ఆమెకు కూడా టికెట్ నిరాకరించారు. దాంతో కేసీఆర్ మీద గుర్రుగా ఉన్న కొండాసురేఖ శనివారం ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తెరాసను కడిగి పారేశారు. తమకు అన్యాయం చేశారని.. గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చినా కూడా.. 50వేల మెజారిటీతో గెలిచిన తనకు టికెట్ ఎలా నిరాకరిస్తారంటూ నిలదీశారు.

అధికార పార్టీ మీద ఇంతటి తిరుగుబాటు వెల్లువెత్తడం వెనుక మర్మం.. ఆమె తెరాసను వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నారని వినికిడి. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల దేవులాటలోనే ఉంది. అందుకే సురేఖ సహా, ఆమె భర్త కొండా మురళికి కూడా టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శనివారం ప్రెస్ మీట్ లో మాత్రం.. తమ కుటుంబం నుంచి తమ దంపతులతో పాటు, కూతురు కూడా కలిపి మూడు ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేస్తాం అంటూ సురేఖ చాలా ఘనంగా ప్రకటించడం విశేషం.

ఆమె చెప్పినంతగా జరగకపోవచ్చు గానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆమె అవకాశాలను ‘జీరో’ చేసేసిన తర్వాత.. కాంగ్రెస్ మాత్రం అక్కున చేర్చుకోవడం మాత్రమే కాకుండా.. ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్ తో ఊరకిస్తున్నదని తెలుస్తోంది.