గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీలో చిచ్చు రగిల్చాయి. గ్రేటర్‌లో కాషాయ జెండాను ఎగురవేస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ టికెట్‌కు డిమాండ్ కూడా పెరిగింది.
ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి ,చివరికి భంగపాటుకు గురైన వారు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ కార్యకర్తలే శుక్రవారం ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, వలస వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
టికెట్లను రూ.30లక్షలకు సీట్లు అమ్ముకున్నారంటూ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డిని కలిసి కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్న బీజేపీ నుంచి ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలం ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ టికెట్లు ఇస్తోంది. దీంతో ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న వాళ్లకు నిరాశ తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో నాచారం నుంచి టికెట్ ఆశించి భంగపడిన విజయలత అశ్వత్థామరెడ్డి మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో టికెట్లు దక్కని వాళ్లు తమ కోపాన్ని పార్టీ కార్యాలయాలపై ప్రదర్శిస్తున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనమే కూకట్‌పల్లి కార్యాలయంపై దాడిగా చెప్పుకోవచ్చు.